Bharat Coking Coal IPO బంపర్ లిస్టింగ్- ఇన్వెస్టర్లకు 96.5శాతం లాభాలు..
ఊహించనట్టుగానే భారత్ కోకింగ్ కోల్ ఐపీఓకి బంపర్ లిస్టింగ్ లభించింది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఈ ఐపీఓ దాదాపు 97శాతం ప్రీమియంతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది.
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) ఐపీఓ అలాట్ అయిన ఇన్వెస్టర్ల పంట పండింది! సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఈ బీసీసీఎల్ ఐపీఓ ఏకంగా 96.5శాతం ప్రీమియంతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. ఇష్యూ ధర రూ. 23తో పోల్చితే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో వద్ద రూ. 45.2 లిస్ట్ అయ్యింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో రూ. 45 వద్ద లిస్ట్ అయ్యింది.

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సమయంలో కనిపించిన జోరు కొనసాగిస్తూ.. ఇన్వెస్టర్లకు లిస్టింగ్ సమయంలోనే భారీ లాభాలు దక్కాయి.
బీసీసీఎల్ ఐపీఓ వివరాలు..
ఈ బీసీసీఎల్ ఐపీఓ పట్ల ఇన్వెస్టర్లు అసాధారణమైన ఆసక్తిని కనబరిచారు. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం, మొత్తం మీద ఈ ఇష్యూ 146.87 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. కేటగిరీల వారీగా చూస్తే:
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) విభాగంలో అత్యధికంగా 310.81 రెట్లు దరఖాస్తులు వచ్చాయి.
నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐ) కేటగిరీలో 258.16 రెట్లు,
సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 49.33 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదైంది.
జనవరి 9న ప్రారంభమైన ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ జనవరి 13తో ముగిసింది. షేర్ ప్రైజ్ బ్యాండ్ రూ. 21 నుంచి రూ. 23గా నిర్ణయించారు. ఈ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా కంపెనీ సుమారు 46.57 కోట్ల షేర్లను విక్రయించి, రూ. 1,071.11 కోట్లను సమీకరించింది.
ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ ఇష్యూకు లీడ్ మేనేజర్‌గా వ్యవహరించగా, కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించింది.
బీసీసీఎల్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం..
బీసీసీఎల్ ఐపీఓ జీఎంపీ (గ్రే మార్కెట్ ప్రీమియం) చూస్తేనే ఈ ఐపీఓకి బంపర్ లిస్టింగ్ లభిస్తుందని స్పష్టమైంది. సోమవారం ఉదయం ఈ ఐపీఓ జీఎంపీ రూ. 13.6గా ఉంది. దీని ప్రకారం.. షేరు రూ. 36.6 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే, ఇష్యూ ధర రూ. 23తో పోలిస్తే ఏకంగా 59 శాతం లాభంతో ట్రేడింగ్ ప్రారంభం కావొచ్చని మార్కెట్ వర్గాలు భావించాయి. అయితే, జీఎంపీ అంచనాలను కూడా మించి బీసీసీఎల్ ఐపీఓ మార్కెట్లో లిస్ట్ అవ్వడం విశేషం.
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ గురించి..
భారతదేశ ఇంధన, పారిశ్రామిక రంగాల్లో భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశంలోనే అతిపెద్ద కోకింగ్ కోల్ ఉత్పత్తిదారుగా ఈ సంస్థ అవతరించింది. మన దేశం ఉత్పత్తి చేస్తున్న మొత్తం కోకింగ్ కోల్‌లో దాదాపు 58.5 శాతం వాటాను ఒక్క బీసీసీఎల్ సంస్థే అందించడం విశేషం.
కోకింగ్ కోల్ ఉత్పత్తిని తన ప్రధాన వ్యాపారంగా కొనసాగిస్తున్న ఈ సంస్థకు ఏప్రిల్ 1, 2024 నాటికి సుమారు 7,910 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఈ అంకెలు బీసీసీఎల్‌ను దేశంలోనే అతిపెద్ద బొగ్గు నిల్వలు కలిగిన సంస్థల్లో ఒకటిగా నిలబెట్టాయి. కేవలం కోకింగ్ కోల్ మాత్రమే కాకుండా, నాన్-కోకింగ్ కోల్, వాష్డ్ కోల్ వంటి వివిధ రకాల బొగ్గు గ్రేడ్లను కూడా ఇది ఉత్పత్తి చేస్తోంది. ఈ ఉత్పత్తులు ప్రధానంగా దేశంలోని ఉక్కు, విద్యుత్ పరిశ్రమల అవసరాలను తీరుస్తున్నాయి.
కోల్ ఇండియా లిమిటెడ్‌కు పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా కొనసాగుతున్న బీసీసీఎల్, 1972లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. సంస్థ కనబరుస్తున్న అద్భుతమైన పనితీరును గుర్తించిన ప్రభుత్వం 2014లోనే దీనికి 'మినీ రత్న' హోదాను కల్పించింది. ఝార్ఖండ్‌లోని ప్రసిద్ధ ఝరియా బొగ్గు క్షేత్రాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్ క్షేత్రాల నుంచి ఈ సంస్థ బొగ్గు తవ్వకాలను జరుపుతోంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం ఉత్తమం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


