BITSAT 2026 : బిట్సాట్ ర్యాంకర్లకు బంపర్ ఆఫర్- 500 మందికి ఉచితంగా ఇంజనీరింగ్ చదివించనున్న బిట్స్ పిలానీ!
బిట్సాట్ 2026లో టాప్ 500 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బిట్స్ పిలానీ పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు ప్రకటించింది! ప్రతిభ ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ ‘ట్యూషన్-బ్లైండ్’ అడ్మిషన్ల విధానాన్ని తీసుకొచ్చినట్టు వివరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ సంచలన ప్రకటన చేసింది! బిట్సాట్ 2026 పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 500 మంది ర్యాంకర్లకు ఉచిత విద్యను అందించబోతున్నట్టు వెల్లడించింది
బిట్స్ పిలానీ- టాప్ 500 ర్యాంకర్లకు ఉచిత విద్య..
బిట్సాట్ 2026 పరీక్షలో మొదటి 500 ర్యాంకులు సాధించి, 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందే విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రయోజనం వారు చదివే నాలుగేళ్ల ఫస్ట్-డిగ్రీ ప్రోగ్రామ్ మొత్తానికి వర్తిస్తుంది.
బిట్స్ పిలానీలో ఉచిత విద్య- అర్హత ప్రమాణాలు..
ఆదాయ పరిమితి: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 20 లక్షల వరకు ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు.
అకాడమిక్ నిబంధన: ఈ స్కాలర్‌షిప్‌ను కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగించాలంటే, విద్యార్థులు తమ తమ క్యాంపస్‌లలో కనీసం 7.5 సీజీపీఏ నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.
'ట్యూషన్-బ్లైండ్' అడ్మిషన్ల విధానం..
బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీ రామగోపాల్ రావు మాట్లాడుతూ.. "మేము ఏళ్ల తరబడి స్కాలర్‌షిప్‌ల కోసం భారీగా పెట్టుబడి పెట్టాము. కానీ ఈ 'ట్యూషన్-బ్లైండ్' అడ్మిషన్లు ఒక చారిత్రాత్మక అడుగు. మీ దగ్గర ప్రతిభ ఉంటే, చదువుకు డబ్బు అడ్డంకి కాకూడదు," అని పేర్కొన్నారు.
ఈ విధానం ప్రకారం.. విద్యార్థులు కాలేజీలో చేరిన తర్వాత స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ ఆఫర్‌లోనే ఈ మినహాయింపు వివరాలు ఉంటాయి. దీనివల్ల ప్రతిభావంతులు ఆర్థిక స్థోమత గురించి ఆలోచించకుండా కేవలం మెరిట్ ఆధారంగా బిట్స్‌ను ఎంచుకోవచ్చు.
గత ఏడాది గణాంకాలు..
గత విద్యా సంవత్సరంలో బిట్స్ పిలానీ సుమారు రూ. 132 కోట్లు స్కాలర్‌షిప్‌ల రూపంలో అందజేసింది. దీనివల్ల ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు ఆర్థిక సహాయం పొందారు! దాదాపు 25 శాతం మంది విద్యార్థులు అడ్మిషన్ కంటే ముందే ఏదో ఒక రూపంలో ఆర్థిక సాయం పొందుతున్నారు.
ప్రస్తుత మెరిట్, మెరిట్-కమ్-నీడ్ స్కాలర్‌షిప్ వివరాలు..
బిట్సాట్ ద్వారా అడ్మిషన్ పొందే విద్యార్థులకు ఇప్పటికే ఉన్న స్కాలర్‌షిప్ పాలసీలు ఇవి..
1. ఇన్స్టిట్యూట్ మెరిట్ అవార్డు:
టాప్ 2 శాతం విద్యార్థులు: 100 శాతం ట్యూషన్ ఫీజు మినహాయింపు.
తర్వాతి 1 శాతం విద్యార్థులు: 50 శాతం ట్యూషన్ ఫీజు మినహాయింపు.
2. ఇన్స్టిట్యూట్ మెరిట్-కమ్-నీడ్ అవార్డు:
టాప్ 5 శాతం విద్యార్థులు: 100 శాతం ట్యూషన్ ఫీజు మినహాయింపు.
తర్వాతి 2 శాతం విద్యార్థులు: 50 శాతం ట్యూషన్ ఫీజు మినహాయింపు.
తర్వాతి 5 శాతం విద్యార్థులు: 25 శాతం ట్యూషన్ ఫీజు మినహాయింపు.
తర్వాతి 10 శాతం విద్యార్థులు: 10 శాతం ట్యూషన్ ఫీజు మినహాయింపు.
ముఖ్య గమనిక: ఈ అవార్డులన్నీ ఒక సెమిస్టర్‌కు మాత్రమే వర్తిస్తాయి. తర్వాతి సెమిస్టర్‌లలో వీటిని కొనసాగించడం అనేది విద్యార్థి అకాడమిక్ పెర్ఫార్మెన్స్, ఆర్థిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే, అడ్మిషన్ ఫీజుపై ఎలాంటి మినహాయింపు ఉండదు.
ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2026-27 నోటిఫికేషన్ విడుదల- పూర్తి వివరాలు..
2+2 డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్..
విదేశీ యూనివర్సిటీలతో కలిపి నిర్వహించే 2+2 ప్రోగ్రామ్ విద్యార్థులకు కూడా ఈ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే, ఇవి బిట్స్‌లో చదివే మొదటి రెండేళ్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తర్వాత విదేశాల్లో చదివే కాలానికి ఆయా యూనివర్సిటీల నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
నకిలీ ప్రవేశాల పట్ల హెచ్చరిక!
డైరెక్ట్ అడ్మిషన్ ఇప్పిస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా సందేశాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని బిట్స్ హెచ్చరించింది. అడ్మిషన్ల కోసం admissions.bits-pilani.ac.in అనే వెబ్‌సైట్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శిచాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












