JEE, NEET పరీక్షల్లో.. 50శాతం వెయిటేజ్ బోర్డు ఎగ్జామ్స్​కే! కేంద్రం సంచలన నిర్ణయం!

NEET : మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసే నీట్, జేఈఈ పరీక్షల విధానంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంచలన మార్పులకు శ్రీకారం చుట్టబోతోందని సమాచారం. ఇకపై అడ్మిషన్లలో కేవలం ప్రవేశ పరీక్షల మార్కులే కాకుండా, బోర్డు/ఇంటర్మీడియట్ మార్కులకు కూడా 50 శాతం వెయిటేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.

Published on: Jul 3, 2026, 05:37:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కఠినమైన ప్రవేశ పరీక్షలుగా పేరుగాంచిన జేఈఈ, నీట్ రాసే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది! ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల కేటాయింపులో ఇప్పటివరకు ప్రవేశ పరీక్షల ర్యాంకులకే అధిక ప్రాధాన్యతగా ఇస్తుండగా.. ఇకపై క్లాస్ 12 (ఇంటర్మీడియట్/బోర్డు పరీక్షలు) మార్కులకు ఏకంగా 50 శాతం వెయిటేజీ కల్పించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో ఎదురైన పేపర్ లీకులు, మూల్యాంకన లోపాలు వంటి తీవ్ర వివాదాల నేపథ్యంలో ఎగ్జామినేషన్ సిస్టమ్ నమ్మకాన్ని కాపాడేందుకు ఈ విప్లవాత్మక మార్పులను పరిశీలిస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.

నీట్​, జేఈఈ లేటెస్ట్ అప్డేట్స్..
నీట్​, జేఈఈ లేటెస్ట్ అప్డేట్స్..

ఒత్తిడిని తగ్గించేందుకే ఈ నిర్ణయం..

కేవలం ఒకే ఒక్క ప్రవేశ పరీక్షపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉండటం వల్ల వారిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఈ “హై-స్టేక్స్” విధానాన్ని తగ్గించడమే ఈ కొత్త ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. అభ్యర్థులు కేవలం బోర్డు పరీక్షల్లో అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది, సీటు రావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో టాప్ మార్కులు సాధించాల్సిందే. అయితే కొత్త నిబంధన అమల్లోకి వస్తే, బోర్డు పరీక్షల మార్కులు, ఎంట్రన్స్ మార్కులు రెండింటినీ సమానంగా (50:50) పరిగణనలోకి తీసుకుని మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

కోచింగ్ సెంటర్లు, 'డమ్మీ స్కూల్స్'కు చెక్!

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న కోచింగ్ సెంటర్ల ఆధిపత్యానికి, కార్పొరేట్ సంస్థలు నడుపుతున్న 'డమ్మీ స్కూల్స్' (పాఠశాలకు వెళ్లకుండా కేవలం కోచింగ్ తీసుకునే విధానం) సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి కేంద్రం ఈ ప్లాన్ చేస్తోంది.

"బోర్డు మార్కులకు 50% వెయిటేజీ ఇవ్వడంతో పాటు ప్రవేశ పరీక్షల సిలబస్‌ను పాఠశాల పాఠ్యప్రణాళికకు మరింత దగ్గరగా అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల విద్యార్థులు స్కూల్ చదువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా, సంవత్సరానికి మల్టిపుల్ అటెంప్ట్స్ కల్పించడం, కంప్యూటర్ ఆధారిత అడాప్టివ్ ఆన్-డిమాండ్ పరీక్షల వైపు క్రమంగా మారడం వంటి ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి," అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

తొమ్మిది మంది సభ్యుల కమిటీ రిఫార్మ్స్..

విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఎక్కువగా ఆధారపడటం, డమ్మీ స్కూల్స్ పెరిగిపోవడం, ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత లోపించడం వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గత ఏడాది ఒక తొమ్మిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ సుదీర్ఘ చర్చల అనంతరం ఈ సంస్కరణలను సిఫార్సు చేసింది. దీనికి సంబంధించిన తుది నివేదికను రాబోయే కొద్ది వారాల్లోనే ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

ఈ ప్రతిపాదన గనుక అధికారికంగా ఆమోదం పొందితే.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మెడికల్, ఇంజనీరింగ్ అభ్యర్థుల ప్రిపరేషన్ విధానంలో, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More