Budget 2026 : నేడే కేంద్ర బడ్జెట్-​ నిర్మలమ్మ పద్దుపై భారీ అంచనాలు.. ఆ 75 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సెలవు రోజైన ఆదివారం నాడు బడ్జెట్ రావడం, ప్రసంగ శైలిలో మార్పులు ఉండనుండటంతో ఇన్వెస్టర్లు, సామాన్యుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Published on: Feb 1, 2026, 06:07:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరో కీలక ఘట్టానికి దేశం సన్నద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంకొన్ని గంటల్లో 'బడ్జెట్ 2026'ను సమర్పించనున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది ఇదే తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడం మనకు అలవాటే అయినా.. ఈసారి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రావడం విశేషం. దీనితో సెలవు రోజున బడ్జెట్ ప్రవేశపెడుతున్న అరుదైన సందర్భానికి దేశం సాక్ష్యం కాబోతోంది. అంతేకాదు, వరుసగా తొమ్మిది పూర్తి స్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ గుర్తింపు పొందబోతున్నారు.

నేడే నిర్మలమ్మ పద్దు.. (PTI)
నేడే నిర్మలమ్మ పద్దు.. (PTI)

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక దిశానిర్దేశం చేయనుంది. ప్రభుత్వ వ్యయంలో ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే.. దేశ వృద్ధికి, ఉపాధి కల్పనకు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభవాన్ని పెంచేందుకు అవసరమైన వ్యూహాత్మక చర్యలను ప్రభుత్వం ఎలా తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బడ్జెట్ 2026- ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

బడ్జెట్​ 2026ను ఫిబ్రవరి 1, ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఉభయ సభల ముందు ప్రవేశపెడతారు.

బడ్జెట్ 2026 లైవ్​ అప్డేట్స్​ని హిందుస్థాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ లేదా హిందుస్థాన్​ టైమ్స్​, లైవ్​ మింట్​ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో వీక్షించవచ్చు. ప్రభుత్వం నిర్వహించే ప్రత్యక్ష ప్రసారం 'సంసద్ టీవీ'లో వివిధ భాషల్లో నిర్మలమ్మ పద్దు అందుబాటులో ఉంటుంది. అలాగే దూరదర్శన్ (డీడీ) ఛానెళ్లు, కేంద్ర బడ్జెట్ అధికారిక వెబ్‌సైట్ (indiabudget.gov.in), ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పొందవచ్చు.

బడ్జెట్ 2026: ప్రధాన అంచనాలు ఇవే!

పరిశ్రమ వర్గాలు, ప్రజలు ఈ బడ్జెట్ నుంచి ఆశిస్తున్న కొన్ని కీలక అంశాలు:

ఆదాయపు పన్ను చట్టం 2025: ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానున్న నేపథ్యంలో.. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు, రూల్స్, తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలను బడ్జెట్‌లో ఆశిస్తున్నారు.

స్టాండర్డ్ డిడక్షన్: పాత పన్ను విధానం నుంచి కొత్త విధానానికి ఇన్వెస్టర్లను ప్రోత్సహించేలా 'స్టాండర్డ్ డిడక్షన్' పరిమితిని పెంచే అవకాశం ఉంది.

టీడీఎస్ సరళీకరణ: టీడీఎస్ రేట్లు, స్లాబ్‌లను తగ్గించి సులభతరం చేయడం.

కస్టమ్స్ డ్యూటీ: వివాదాల్లో చిక్కుకున్న రూ.1.53 లక్షల కోట్ల నిధులను వెలికితీసేలా అమ్నెస్టీ స్కీమ్ ప్రకటించడం, వ్యాపార సులభతరం కోసం సుంకాల స్లాబ్‌లను తగ్గించడం.

రుణ భారం: దేశ జీడీపీలో అప్పుల శాతాన్ని తగ్గించడంపై దృష్టి సారించడం.

రక్షణ రంగం: అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రక్షణ బడ్జెట్‌ను పెంచడం.

గ్రామీణ ఉపాధి: 'వికసిత భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్​ ఆజీవిక మిషన్' (వీబీ-జీ రామ్​ జీ) కోసం నిధుల కేటాయింపు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఖర్చు చేస్తాయి.

8వ పే కమిషన్: జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చిన 8వ వేతన సంఘం కేటాయింపులు.

పన్నుల పంపిణీ: 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు పన్నుల వాటా కేటాయింపు.

చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్​ఎంఈ): ఆభరణాలు, వస్త్ర, తోలు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.

కీలక ఖనిజాలు: లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాల వెలికితీతకు నిధులు.

75 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి..

ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ఒక భారీ మార్పు కనిపించబోతోంది! గత 75 ఏళ్లుగా బడ్జెట్ ప్రసంగంలోని 'పార్ట్-బీ' కేవలం పన్నులు, పాలసీలకే పరిమితమయ్యేది. కానీ ఈసారి పార్ట్-బీలో భారత ఆర్థిక భవిష్యత్తుపై లోతైన దార్శనికతను ఆర్థిక మంత్రి వివరించనున్నారు. దేశీయ బలాలు, ప్రపంచ ఆశయాలను మేళవిస్తూ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను ఇందులో పొందుపరచనున్నారు.

గతంలో దశాబ్దాల తరబడి వాడుకలో ఉన్న లేదర్ బ్రీఫ్‌కేస్ సంప్రదాయాన్ని 2019లో నిర్మలమ్మ 'బహీ-ఖాతా'తో మార్చేశారు. గత నాలుగేళ్ల లాగే ఈ ఏడాది కూడా బడ్జెట్ పూర్తిగా 'పేపర్‌లెస్' (డిజిటల్) రూపంలో ఉండబోతోంది.

ఆదివారం నాడు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?

సాధారణంగా ఆదివారం స్టాక్​ మార్కెట్​లకు సెలవు. కానీ బడ్జెట్​ 2026 నేపథ్యంలో ఈ రోజు స్టాక్​ మార్కెట్​లు పనిచేస్తాయి. టైమింగ్స్​ సహా ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More