80 కి.మీ స్పీడ్‌లో బస్సు- ‘బిగ్ బాస్’ చూస్తూ నడుపుతున్న డ్రైవర్! షాకింగ్ వీడియో..
ఓ బస్సు డ్రైవర్ బిగ్ బాస్ చూస్తూ వాహనాన్ని నడుపుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ముంబై- హైదరాబాద్ బస్సులో ప్రయాణికుడు ఈ వీడియో తీశారు. ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ముంబై నుంచి హైదరాబాద్ వెళుతున్న వీఆర్ఎల్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. అర్ధరాత్రి పూట దాదాపు గంటకు 80 కి.మీ వేగంతో బస్సు నడుపుతూ, మొబైల్‌లో 'బిగ్ బాస్' రియాలిటీ షో చూస్తున్న దృశ్యం తీవ్ర కలకల రేపింది! రోడ్డు ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఆందోళనకరంగా మారిన వేళ, ఈ వీడియో వెలుగులోకి రావడంతో ప్రజలు బస్సులు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ సంఘటన అక్టోబర్ 27న తెల్లవారుజామున సుమారు 2:50 గంటలకు జరిగింది. ప్రయాణికుల్లో ఒకరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వైరల్ అయిన ఈ వీడియోలో రాత్రిపూట బస్సు నడుపుతున్న డ్రైవర్, స్టీరింగ్ కింద తన ఫోన్‌లో బిగ్ బాస్ చూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
"యాక్సిడెంట్లు జరగడానికి ఇది కూడా ఒక కారణం," అని ఆ ప్రయాణికుడు ఆ వీడియో కింద రాసుకొచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :
వీఆర్ఎల్ ట్రావెల్స్ తక్షణ చర్య: డ్రైవర్ తొలగింపు..
వీడియో వైరల్ అయిన వెంటనే, వీఆర్ఎల్ ట్రావెల్స్ సంస్థ తక్షణమే స్పందించి విచారణ ప్రారంభించి, డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది.
విజయనంద్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న్ వీఆర్ఎల్ ట్రావెల్స్ సంస్థ, ఒక క్షమాపణ ప్రకటన సైతం విడుదల చేసింది. ఈ సంఘటన జరిగిందని అంగీకరిస్తూ, ప్రయాణికుల భద్రతే తమ అగ్ర ప్రాధాన్యత అని హామీ ఇచ్చింది.
"అక్టోబర్ 27న ముంబై నుంచి హైదరాబాద్ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న అసౌకర్యం, భయం, కలతకు మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము. ప్రయాణికుల భద్రత మా ప్రథమ కర్తవ్యం, మేము ఇలాంటి విషయాలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తాము," అని పేర్కొంది.
నిర్లక్ష్య వైఖరి పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటిస్తూ, డ్రైవర్‌ను తొలగించినట్లు ధృవీకరించారు.
"ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి. ఇలాంటి సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చిన ప్రయాణికులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదనే కఠినమైన ఆదేశాలను మేము మళ్లీ అమలు చేశాము. మీకు కలిగిన ఈ అసహ్యకరమైన అనుభవానికి మేము మళ్లీ క్షమాపణలు చెబుతున్నాము," అని కంపెనీ జోడించింది.
వీఆర్ఎల్ ట్రావెల్స్ తీసుకున్న శీఘ్ర చర్యకు ప్రశంసలు దక్కాయి. అయితే, కొంతమంది ప్రయాణికులు, నెటిజన్లు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, కంపెనీ తమ నియామక, శిక్షణా ప్రక్రియలను మరింత మెరుగుపరచాలని కోరారు.
గతంలో ఇలాంటి ఘటనే: పబ్జీ ఆడిన క్యాబ్ డ్రైవర్!
ఈ తరహాలోనే మార్చి నెలలో, హైదరాబాద్‌లో ఒక క్యాబ్ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ తన ఫోన్‌లో పబ్జీ ఆడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది కూడా ప్రయాణికుల భద్రతపై విస్తృత ఆందోళనలు రేపింది. వెనుక సీటులో ఉన్న ప్రయాణికుడు రికార్డు చేసిన ఫుటేజీలో, డ్రైవర్ ఒక చేత్తో వాహనం నడుపుతూ, మరో చేతితో ఫోన్ పట్టుకున్నట్లు కనిపించింది. ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికుడు హెచ్చరించినా, ఆ డ్రైవర్ ఆందోళనలను పట్టించుకోకుండా ఆడటం కొనసాగించాడని తెలిసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


