సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్యాకేజీ కూడా దీని ముందు తక్కువే.. ఇస్త్రీ షాపుతో నెలకు రూ. 2 లక్షల ఆదాయం!
నగరాల్లో డ్రై క్లీనింగ్ షాపు నడిపేవారు ఎంత సంపాదిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? నెలకు రూ. 2 లక్షలకు పైగా లాభం గడిస్తూ ఓ డ్రై క్లీనింగ్/ ఇస్త్రీ దుకాణాన్ని నడుపుతున్న దంపతులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు! ఇందుకు సంబంధించిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.
సాధారణంగా మనం వీధి చివర ఉండే డ్రై క్లీనింగ్ లేదా ఇస్త్రీ షాపులను చూసినప్పుడు.. వారు రోజువారీ అవసరాలకు సరిపడా మాత్రమే సంపాదిస్తారని, ఒక్కోసారి అసలు వాళ్లకి వచ్చే డబ్బులు సరిపోతాయో లేదో అని జాలి పడుతుంటాము. కానీ, అసలు విషయం తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే! ఒక సాధారణ డ్రై క్లీనింగ్ షాపు యజమాని నెలకు ఏకంగా రూ. 2 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఆదాయం పదేళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీతంతో సమానం కావడం గమనార్హం.

వైరల్ పోస్ట్ వెనుక అసలు కథ
కంటెంట్ క్రియేటర్ నళిని ఉనగర్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ ఈ చర్చకు దారితీసింది. తన ఇంటి సమీపంలోని డ్రై క్లీనింగ్ షాపు యజమానితో ఆమె జరిపిన సంభాషణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ షాపును ఒక దంపతులు నడుపుతున్నారు. వారికి సహాయంగా ఇద్దరు వర్కర్లు కూడా ఉన్నారు! వారి నెలవారీ ఆదాయం గురించి విన్న నళిని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఆదాయం లెక్కలు ఇలా ఉన్నాయి:
సదరు షాపు యజమాని వెల్లడించిన వివరాల ప్రకారం వారి రోజువారీ సంపాదన అంచనా ఇలా ఉంది:
సాధారణ ఇస్త్రీ: రోజుకు సుమారు 350 బట్టలు. ఒక్కోదానికి రూ. 10 చొప్పున లెక్కగడితే రోజుకు రూ. 3,500 ఆదాయం.
ప్రీమియం సర్వీస్: సూట్లు, లెహంగాలు, భారీ చీరల డ్రై క్లీనింగ్ కోసం ఒక్కోదానికి రూ. 350 వసూలు చేస్తారు. ఇలా రోజుకు 20 బట్టలు వచ్చినా రూ. 7,000 లభిస్తుంది.
మొత్తం ఆదాయం: రోజుకు సగటున రూ. 10,500 వరకు వస్తుంది. నెలకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవు తీసుకున్నా, నెలవారీ మొత్తం ఆదాయం సుమారు రూ. 2,83,500 గా ఉంది.
ఖర్చులు పోనూ మిగిలేది భారీగానే..!
షాపు సొంతది కావడంతో ఆ దంపతులకు అద్దె భారం లేదు. నెలకు కరెంటు బిల్లు రూ. 6,000, ఇద్దరు సహాయకులకు జీతాలు రూ. 40,000.. అన్ని ఖర్చులూ తీసివేస్తే నెలకు సుమారు రూ. 2,37,500 నికర లాభం మిగులుతోందని ఆ దంపతులు వివరించారు. ఇది జనవరి నెలకు సంబధించిన లెక్కలని, సగటున ప్రతి నెలా రూ. 2 లక్షలకు పైగా ఆదాయం ఖాయమని వారు ధీమాగా చెబుతుండటం విశేషం.
నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు
ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఐటీ ఉద్యోగులతో పోలుస్తూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.
"సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అర్ధరాత్రి 2 గంటల వరకు కోడింగ్‌లోని బగ్‌లను వెతుకుతుంటే.. ఇక్కడ అన్న మాత్రం కేవలం రెండు నిమిషాల్లో బట్టల మీద ముడతలను క్లీన్ చేస్తూ అంతే సంపాదిస్తున్నారు. మనం సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ కంటే 'స్టీమ్ ఇంజనీరింగ్' నేర్చుకోవాల్సింది," అని ఒక వినియోగదారుడు చమత్కరించారు.
మరికొందరు పన్నుల అంశాన్ని లేవనెత్తారు. "భారత్‌లో ఇలాంటి వ్యాపారాలు చేసేవారు చాలామంది ఆదాయపు పన్ను కట్టడం లేదు. మధ్యతరగతి ఉద్యోగులే పన్నుల భారం మోస్తున్నారు," అని అసహనం వ్యక్తం చేశారు.
“ఐటీ వాళ్లు ఇప్పుడు వాళ్ల మీద దాడులు చేస్తారు. వాళ్లు మిమ్మల్ని తిట్టుకుంటారు,” అని ఇంకొకరు అన్నారు.
అయితే ఈ ఉదాహరణ కేవలం ఐటీ ఉద్యోగాల గురించి మాత్రమే కాదు.. సంపాదన అనేది కేవలం చదువుపైనే ఆధారపడి ఉండదని, మనం అందించే సేవకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్న వ్యాపారమైనా అంకితభావంతో చేస్తే కార్పొరేట్ ఉద్యోగాల కంటే మెరుగ్గా రాణించవచ్చని ఈ ఉదాహరణ నిరూపిస్తోంది.
మరి ఈ వ్యవహారంపై మీ ఒపీనియన్ ఏంటి?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


