‘నన్ను సంతోష పెట్టాలి.. లేకపోతే టారిఫ్ వేస్తా’- భారత్‌ని మళ్లీ టార్గెట్ చేసిన ట్రంప్
రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల విషయంలో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు. రష్యా ఆయిల్ అంశంలో సహకరించకపోతే, భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను మరింత పెంచుతామని ఆయన హెచ్చరించారు.
భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 'టారిఫ్' అస్త్రాన్ని ప్రయోగించారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న అంశంపై భారత్ వెనక్కి తగ్గకపోతే, ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాలను మరింత పెంచుతామని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదించింది.

చమురు వివాదం.. పెరిగిన సుంకాలు
రష్యాతో భారత్ జరుపుతున్న చమురు వ్యాపారాన్ని ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ కారణం చూపే గత ఏడాది (ఆగస్టు 2025) భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను రెట్టింపు చేస్తూ 50 శాతానికి పెంచారు.
ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. "రష్యా ఆయిల్ విషయంలో భారత్ మాకు సహకరించకపోతే, వారిపై మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉంది," అని ట్రంప్ స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీని కూడా ట్రంప్ ప్రస్తావించారు.
“మోదీ మంచి వారు. నేను సంతోషంగా లేరని ఆయనకు తెలుసు. నన్ను సంతోష పెట్టడం చాలా ముఖ్యం. వాళ్లు ట్రేడ్ చేస్తారు. మేము సుంకాలు పెంచొచ్చు,” అని ట్రంప్ అన్నారు.
భారత్-అమెరికా మధ్య నెలల తరబడి జరుగుతున్న వాణిజ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు భారత్‌పై ట్రంప్ మరోసారి టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగిస్తుండటం సర్వత్రా చర్చకు దారితీసింది.
మోదీ హామీ ఇచ్చారన్న ట్రంప్.. కొట్టిపారేసిన భారత్..
గత అక్టోబర్‌లో ట్రంప్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి రష్యా నుంచి చమురు కొనబోమని హామీ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. "ఇకపై రష్యా నుంచి చమురు రాదు.. ఆయన (మోదీ) కొనడం లేదు" అని అప్పట్లో ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను భారత్ అప్పుడే ఖండించింది. ప్రధాని మోదీకి, ట్రంప్‌కు మధ్య అలాంటి సంభాషణే జరగలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
చర్చలు ఎందుకు ఫలించడం లేదు?
ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ వాషింగ్టన్‌తో చర్చలు జరిపి టారిఫ్‌ల నుంచి ఉపశమనం పొందుతుంటే, భారత్ విషయంలో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన చర్చలు విఫలమవ్వడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి:
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడానికి దిల్లీ నిరాకరించడం.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తానన్న ప్రతిపాదనను భారత్ తోసిపుచ్చడం.
ఈ పరిణామాల తర్వాతే ఆగస్టులో ట్రంప్ భారత వస్తువులపై పన్నులను రెట్టింపు చేశారు.
అమెరికా ఎంత ఒత్తిడి తెస్తున్నా, రష్యా నుంచి చమురు దిగుమతులు తమ దేశ ఇంధన భద్రతకు అత్యంత అవసరమని భారత్ గట్టిగా వాదిస్తోంది.
అయితే అమెరికా, యూరోపియన్ యూనియన్ విధిస్తున్న కఠిన ఆంక్షల ప్రభావం ఇప్పటికే రష్యా చమురు సరఫరాపై పడింది. డిసెంబర్ నాటికి భారత్ దిగుమతులు మూడేళ్ల కనిష్టానికి (రోజుకు 12 లక్షల బ్యారెల్స్) పడిపోయాయి. ఇది గత జూన్ నెలలో ఉన్న 20 లక్షల బ్యారెల్స్ గరిష్ట స్థాయి కంటే దాదాపు 40 శాతం తక్కువ.
అయినప్పటికీ.. ఇదే విషయంపై భారత్‌పై వేసిన అదనపు సుంకాలను తొలగించకపోగా, ఇప్పుడు ట్రంప్ కొత్త సుంకాలు వేస్తామని హెచ్చరిస్తుండటం గమనార్హం.
ట్రంప్ తాజా హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ట్రంప్ వైఖరి భారత్- అమెరికా వాణిజ్య చర్చలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


