Kunal Shah : వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్ కునాల్ షా..
భారతీయ స్టార్టప్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ‘క్రెడ్’ అధినేత కునాల్ షా ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'వాట్సాప్' గ్లోబల్ హెడ్‌గా నియమితులయ్యారు. ఇందుకోసం క్రెడ్ సంస్థలో మెటా దాదాపు రూ.8,550 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
భారతీయ టెక్, స్టార్టప్ చరిత్రలోనే ఒక సరికొత్త సంచలనం నమోదైంది. ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’.. ఒక భారతీయుడికి అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. ప్రముఖ ఇండియన్ ఫిన్‌టెక్ స్టార్టప్ 'క్రెడ్' (CRED) వ్యవస్థాపకుడు కునాల్ షాను వాట్సాప్ నూతన గ్లోబల్ హెడ్‌గా నియమించింది. గడిచిన ఏడేళ్లుగా వాట్సాప్ విభాగాన్ని విజయవంతంగా నడిపించిన విల్ క్యాథ్‌కార్ట్ స్థానంలో కునాల్ షా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ భారీ ఒప్పందంలో భాగంగా.. మెటా ప్లాట్‌ఫామ్స్ క్రెడ్ సంస్థ ‘సిరీస్ హెచ్’ ఫండింగ్ రౌండ్‌లో భాగంగా ఏకంగా 900 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 8,550 కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడితో క్రెడ్‌లో మెటా సంస్థకు దాదాపు 20 శాతం మైనారిటీ వాటా దక్కనుంది. తాజా ఫండింగ్ తర్వాత క్రెడ్ కంపెనీ మార్కెట్ విలువ పోస్ట్-మనీ ప్రాతిపదికన రూ. 43,239 కోట్లకు (సుమారు 4.5 బిలియన్ డాలర్లు) చేరుకుంది. ప్రైమరీ, సెకండరీ షేర్ల కొనుగోలు ద్వారా మెటా ఈ పెట్టుబడులను సమకూర్చింది.
క్రెడ్ సీఈఓ పదవికి కునాల్ షా గుడ్‌బై!
వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, కునాల్ షా క్రెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆయన మెటా అంతర్జాతీయ లీడర్‌షిప్ టీమ్‌లో భాగస్వామి అవుతారు. ఇప్పటివరకు వాట్సాప్‌ను నడిపించిన విల్ క్యాథ్‌కార్ట్ ఇకపై మెటా సంస్థలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
వాట్సాప్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో కునాల్ షా కీలక పాత్ర పోషిస్తారని మెటా వెల్లడించింది. ముఖ్యంగా యాడ్స్ (ప్రకటనలు), సబ్‌స్క్రిప్షన్ ప్రొడక్ట్స్ ద్వారా వాట్సాప్ ఆదాయాన్ని పెంచడం, అలాగే ప్లాట్‌ఫామ్‌లోకి ఏఐ ఏజెంట్లను అనుసంధానించడం వంటి బాధ్యతలను కునాల్ షా పర్యవేక్షిస్తారు.
క్రెడ్‌కు తాత్కాలిక సీఈఓగా మితెన్ సంపత్..
కునాల్ షా తప్పుకోవడంతో, 2020 నుంచి క్రెడ్ సంస్థలో స్ట్రాటజీ- ఫైనాన్స్ విభాగాలను చూస్తున్న మితెన్ సంపత్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించారు. ఈ మార్పు తక్షణమే అమలుల్లోకి రానుంది. భవిష్యత్తులో కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ (ఐపీఓ) చేయడానికి వీలుగా ఒక పటిష్టమైన, శాశ్వత మేనేజ్‌మెంట్ నిర్మాణాన్ని రూపొందించే పనిలో క్రెడ్ బోర్డు, లీడర్‌షిప్ టీమ్ నిమగ్నమై ఉన్నట్లు సంస్థ తెలిపింది.
క్రెడ్ ప్రస్థానం: క్రెడిట్ కార్డ్ బిల్లుల నుంచి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ వరకు..
2018లో ప్రారంభమైన క్రెడ్.. మొదట్లో క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించే వినియోగదారులకు క్యాష్‌బ్యాక్, రివార్డులను అందించే ప్లాట్‌ఫామ్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత కాలంలో క్రమంగా విస్తరిస్తూ పేమెంట్స్, లెండింగ్ (రుణాలు), ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్, లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్‌ను అందించే పూర్తి స్థాయి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది.
క్రెడ్ సాధించిన కొన్ని ముఖ్యమైన మైలురాళ్లు..
ప్రస్తుతం క్రెడ్ యాప్‌నకు నెలకు 1.7 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
భారతదేశంలో జరిగే మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుల్లో 40 శాతం కంటే ఎక్కువ కేవలం క్రెడ్ యాప్ ద్వారానే జరుగుతున్నాయి.
భాగస్వామ్య ఆర్థిక సంస్థల (బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు) తరఫున క్రెడ్ నిర్వహిస్తున్న రుణ వ్యాపారం (ఏయూఎం) రూ. 24,000 కోట్లకు చేరుకుంది.
కంపెనీ వార్షిక ఆదాయం సుమారు రూ. 3,200 కోట్లుగా నమోదవ్వగా, ప్రస్తుతం సంస్థ లాభాల్లోకి అడుగుపెట్టింది.
గ్లోబల్ టెక్ రంగంలో ఒక భారతీయ స్టార్టప్ వ్యవస్థాపకుడికి ఇంతటి అత్యున్నత స్థాయి పదవి దక్కడం దేశీయ టెక్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


