...
...
Next Story

క్రెడిట్ కార్డ్ 'మినిమమ్ డ్యూ' ఒక ట్రాప్: ఆటోపే ఆప్షన్లు మారుతున్నాయా?

క్రెడిట్ కార్డ్ బిల్లుల్లో 'మినిమం అమౌంట్ డ్యూ' చెల్లించడం సులువైన మార్గంగా అనిపించినా, అది వినియోగదారులను భారీ వడ్డీల ఊబిలోకి నెడుతోంది. బ్యాంకు యాప్‌లలో ఉండే డిజైన్ లోపాలు, ఆటోపే సెట్టింగ్స్ దానంతట అవే మినిమం డ్యూకి మారిపోవడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న తీవ్ర పరిణామాలపై ప్రత్యేక విశ్లేషణ.

Published on: Aug 11, 2026, 17:35:25 IST
Advertisement

క్రెడిట్ కార్డ్ వాడే చాలామందికి ప్రతి నెలా బిల్లు రాగానే ఒకే లక్ష్యం ఉంటుంది.. బిల్లు సమయానికి చెల్లించి సిబిల్ స్కోర్ (CIBIL Score) కాపాడుకోవడం. అయితే బిల్లు చెల్లింపుల సమయంలో కనిపించే 'మినిమం అమౌంట్ డ్యూ' ఆప్షన్ వెనుక ఉన్న పెద్ద ప్రమాదాన్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఇది చాలదన్నట్లు, కొన్ని బ్యాంకులలో ఆటోపే సెట్టింగ్స్ దానంతట అవే 'మినిమం డ్యూ'కి మారిపోతుండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఆటోపే సెట్టింగ్స్‌లో తేడాలు.. జేబుకు చిల్లు

క్రెడిట్ కార్డ్ 'మినిమమ్ డ్యూ' ఒక ట్రాప్: ఆటోపే ఆప్షన్లు మారుతున్నాయా?
క్రెడిట్ కార్డ్ 'మినిమమ్ డ్యూ' ఒక ట్రాప్: ఆటోపే ఆప్షన్లు మారుతున్నాయా?

బెంగళూరుకు చెందిన ఐటీ కన్సల్టెంట్ రాఘవేంద్ర అనుభవమే దీనికి నిదర్శనం. ఆయన తన క్రెడిట్ కార్డ్ బిల్లును ప్రతి నెలా ఆటోపే ద్వారా ‘పూర్తి మొత్తం’ (Full Amount Due) చెల్లించేలా సెట్ చేసుకున్నారు. కానీ, సిస్టమ్ బ్యాకెండ్‌లో ఆ ఆప్షన్ 'మినిమం డ్యూ'కి మారిపోయింది. ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీలు పడుతుండటాన్ని గమనించిన ఆయన, బ్యాంకుతో నెల రోజులకు పైగా పోరాడి ఆ ఛార్జీలను రద్దు చేయించుకోగలిగారు.

ఇదే తరహా సమస్య మరో ప్రముఖ ప్రయివేటు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కూడా ఎదురైంది. ఆటోపే టోగుల్ తమకు తెలియకుండానే ప్రతి నెలా 'మినిమం డ్యూ'కి మారిపోతోందని, ప్రతిసారి తాము మ్యాన్యువల్‌గా 'ఫుల్ అమౌంట్'కు మార్చుకోవాల్సి వస్తోందని కొందరు కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో ఒక వినియోగదారునికి ఏకంగా రూ. 1.2 లక్షల వరకు వడ్డీ ఛార్జీలు పడ్డాయి.

మినిమం డ్యూతో అసలు నష్టం ఏమిటి?

మినిమం అమౌంట్ డ్యూ అనేది మొత్తం బిల్లులో సాధారణంగా 5% నుంచి 10% వరకు ఉంటుంది.

తాత్కాలిక ఊరట: మినిమం డ్యూ చెల్లించడం వల్ల ఆలస్య రుసుము (Late Payment Fee) పడదు. అలాగే బ్యాంకు మిమ్మల్ని డిఫాల్టర్‌గా ప్రకటించదు కాబట్టి సిబిల్ స్కోర్ వెంటనే పడిపోదు.

చక్రవడ్డీ ఉచ్చు: మిగిలిన బకాయి మొత్తంతో పాటు, మీరు ఆ తర్వాత కార్డ్ ద్వారా చేసే ప్రతి కొత్త కొనుగోలుపై ఏడాదికి 20% నుండి 32% వరకు భారీ వడ్డీ పడుతుంది.

"చాలామంది మినిమం డ్యూ చెల్లిస్తే సిబిల్ స్కోర్ పడిపోదు కదా అని భావిస్తారు. కానీ, చెల్లించని బకాయి కార్డ్‌పై అలానే ఉండిపోవడం వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి పెరిగి, దీర్ఘకాలంలో సిబిల్ స్కోర్‌ దెబ్బతింటుంది" అని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఎండి, సిఇఒ భావేష్ జైన్ తెలిపారు.

డిజిటల్ యాప్‌ల డిజైన్ లోపాలు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం.. "మినిమం డ్యూ మాత్రమే చెల్లిస్తే బకాయి తీరడానికి ఏళ్లు పడుతుంది, భారీగా వడ్డీ పడుతుంది" అని క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్లలో స్పష్టమైన హెచ్చరిక ముద్రించాలి.

అయితే, నేటి డిజిటల్ యుగంలో ఎక్కువమంది పిడిఎఫ్ స్టేట్‌మెంట్లు చదవకుండా CRED, Paytm, Freecharge, PayZapp, Amazon Pay వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా నేరుగా చెల్లింపులు చేస్తున్నారు. చాలా యాప్‌లు, నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లు చెల్లింపు స్క్రీన్‌పై మినిమం డ్యూ ఆప్షన్‌ను ముందే సెలెక్ట్ (Pre-selected) చేసి ఉంచుతున్నాయి. అక్కడ వడ్డీ పడుతుందనే హెచ్చరికలను స్పష్టంగా చూపించడం లేదు.

చెల్లింపులు చేసే యాప్‌లోనే వడ్డీ భారం గురించిన హెచ్చరికను ప్రదర్శిస్తే తప్ప, వినియోగదారులు ఈ మినిమం డ్యూ ఆర్థిక ఉచ్చు నుంచి బయటపడటం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks