...
...
Next Story

DA hike news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్! ఇంకో 4 రోజుల్లో డీఏ పెంపు ప్రకటన?

అక్టోబర్ 14, 21 తేదీల్లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశాల్లోనూ కరువు భత్యం (డీఏ) పెంపుపై ప్రకటన రాకపోవడంతో కోట్లాది మంది ఉద్యోగులు, పింఛనుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీపావళి కానుకగా అక్టోబర్ 28న జరిగే తదుపరి కేబినెట్ భేటీలోనైనా శుభవార్త వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Published on: Oct 24, 2026, 05:30:00 IST
Advertisement

కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్) పెంపు వార్తల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల నిరీక్షణ కొనసాగుతోంది. అక్టోబర్ 14, 21 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశాల్లో డీఏ సవరణపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడమే ఇందుకు కారణం. దసరా పండుగ సందర్భంగా తీపి కబురు అందుతుందని భావించిన దాదాపు 48 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులకు నిరాశే ఎదురైంది. ఇప్పుడు అందరి దృష్టి రాబోయే దీపావళి పండుగ (నవంబర్ 8) కంటే ముందే జరగనున్న అక్టోబర్ 28న జరిగే తదుపరి కేబినెట్ సమావేశంపైనే నెలకొంది!

డీఏ పెంపు ప్రకటన ఇంకెప్పుడు? (AI-generated image for representational purposes only)
డీఏ పెంపు ప్రకటన ఇంకెప్పుడు? (AI-generated image for representational purposes only)

పండుగల వేళ పెరిగిన ధరల భారాన్ని తట్టుకునేందుకు డీఏ సవరణ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి అత్యంత కీలకం.

బోనస్ వచ్చింది.. కానీ డీఏ పెంపు ప్రకటన లేదు!

కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 16న నాన్-పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్‌ను ప్రకటించినప్పటికీ, డీఏ లేదా డీఆర్ రేట్ల పెంపుపై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిత్యావసర వస్తువుల ధరలు, వినియోగదారుల ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతున్న తరుణంలో ప్రాథమిక వేతనంలో (బేసిక్ పే) నిర్ణీత శాతంగా చెల్లించే ఈ భత్యం పెంపు కోసం ఉద్యోగులు ఆశగా నిరీక్షిస్తున్నారు.

సాధారణంగా 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా, అఖిల భారత పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ) గణాంకాలను బట్టి ఏడాదికి రెండుసార్లు - జనవరి 1, జులై 1 తేదీల నుంచి అమలులోకి వచ్చేలా డీఏను సవరిస్తారు. జనవరి విడతను మార్చి లేదా ఏప్రిల్‌లో, జులై విడతను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రకటిస్తుంటారు. ఈ ఏడాది చివరిసారిగా ఏప్రిల్ 2026లో డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

అక్టోబర్ 28 సమావేశంలో 'దీపావళి కానుక' లభించేనా?

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గణాంకాల ప్రకారం గత ఐదేళ్ల జులై విడత ప్రకటన తేదీలను పరిశీలిస్తే:

2025: అక్టోబర్ 1న 3 శాతం పెంపు (55% నుంచి 58%కి).

2024: అక్టోబర్ 16న 3 శాతం పెంపు (50% నుంచి 53%కి).

2023: అక్టోబర్ 18న 4 శాతం పెంపు (42% నుంచి 46%కి).

2022: సెప్టెంబర్ 28న 4 శాతం పెంపు (34% నుంచి 38%కి).

2021: అక్టోబర్ 21న 3 శాతం పెంపు (28% నుంచి 31%కి).

ఆలస్యమైనా బకాయిలు పక్కా!

ప్రకటన రావడంలో జాప్యం జరుగుతున్నప్పటికీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత ఆలస్యంగా ఆమోదం తెలిపినా, పెంపు మాత్రం జులై 1, 2026 నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి అక్టోబర్​లో ఆమోదం పొందింతే.. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల డీఏ బకాయిలను జీతంతో కలిపి ఒకేసారి జమ చేస్తారు.

దీపావళి పండుగకు ముందే ఈ ప్రకటన వస్తే కేంద్ర ఉద్యోగుల చేతికి వేలల్లో అదనపు సొమ్ము అందడంతో పాటు పండుగ సంబరాలు రెట్టింపవుతాయని ఉద్యోగ సంఘాల నాయకులు భావిస్తున్నారు.

మరి ఈ అక్టోబర్ 28న డీఏ పెంపు ప్రకటన వస్తుందో రాదో వేచి చూడాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks