Delhi blast : దిల్లీ పేలుడు ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు- ఉగ్ర కోణంలో దర్యాప్తు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ పేలుడు ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉగ్ర కోణంలో దర్యాప్తు చేస్తూ యూఏపీఏ, పేలుడు పదార్థాల చట్టాలను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కాగా పేలుడు జరిగిన కొద్ది గంటల్లోనే దిల్లీ పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ), పేలుడు పదార్థాల చట్టం (ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్) సహా పలు కీలక సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
దిల్లీ పేలుడు- నమోదైన కీలక సెక్షన్లు..
దిల్లీ పోలీసులు అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం:
ఉగ్రవాద చర్యలు, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే విధించే శిక్షలకు సంబంధించిన యుఏపీఏ సెక్షన్లు 16, 18లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
ఈ పేలుడు ఘటనలో అక్రమంగా పేలుడు పదార్థాలను కలిగి ఉండటం, ఉపయోగించడం వంటి అంశాలను పరిష్కరించే సెక్షన్లు 3, 4లను కూడా పోలీసులు నమోదు చేశారు.
పేలుడు కారణంగా సంభవించిన మరణాలు, గాయాలకు సంబంధించి హత్య, హత్యాయత్నం సెక్షన్లను కూడా చేర్చినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు నమోదు చేసిన అభియోగాల వివరాలు
దిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో ఉగ్రవాదం- పేలుడు పదార్థాల చట్టం కింద నమోదు చేసిన సెక్షన్ల వివరాలు..
యుఏపీఏ సెక్షన్ 16
ఇది ఇప్పటికే జరిగిన ఉగ్రవాద చర్యకు శిక్ష గురించి వివరిస్తుంది. ఈ చర్య మరణానికి దారితీస్తే, బాధ్యులైన వ్యక్తికి జీవిత ఖైదు లేదా మరణశిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.
యుఏపీఏ సెక్షన్ 18
ఇది ఉగ్రవాద చర్య కోసం కుట్ర, ప్రణాళిక, లేదా సహాయం చేయడంపై దృష్టి సారిస్తుంది.
ఉగ్రవాద చర్య జరగకపోయినా, ఎవరైనా ఉగ్రవాదానికి సహకరించినా, సలహా ఇచ్చినా, రెచ్చగొట్టినా లేదా సిద్ధపడ్డా ఈ సెక్షన్ కింద విచారణ జరపవచ్చు.
పేలుడు పదార్థాల చట్టం సెక్షన్లు 3, 4
ఈ చట్టాలు ఘటనలో పేలుడు పదార్థాలను అక్రమంగా కలిగి ఉండటం, ఉపయోగించడం వంటి నేరాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
దిల్లీ కారు పేలుడు: తాజా వివరాలు..
సోమవారం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మెల్లగా కదులుతున్న ఒక కారులో అధిక తీవ్రత కలిగిన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలు వాహనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
పేలుడు సంభవించిన కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇది ఆత్మాహుతి దాడి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
పేలిపోయిన హ్యుందాయ్ ఐ20 కారుకు గతంలో యజమానులుగా ఉన్న సల్మాన్, దేవేందర్ అనే ఇద్దరు వ్యక్తులను ఎర్రకోట పేలుడు కేసు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పేలుడుకు గల కారణాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. కాగా ఎర్రకోట కారు పేలుడులో ఎనిమిది మరణించినట్టు, 24 మంది గాయపడినట్లు ధ్రువీకరించారు.














