Housing Prices : 2బీహెచ్‌కే ధర రూ. 2కోట్లు! ‘2లక్షల ఆదాయం ఉన్నా ఇల్లు కొనలేని స్థితి’..
Real estate : భారత రాజధాని దిల్లీలో రియల్ ఎస్టేట్ ధరలు సామాన్యులకే కాదు, లక్షల్లో జీతాలు తీసుకునే ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు సైతం చుక్కలు చూపిస్తున్నాయి! నెలకు రూ. 2 లక్షల సంపాదన ఉన్నా ఒక చిన్న 2బీహెచ్‌కే ఫ్లాట్ కొనలేకపోతున్నానంటూ ఓ నెటిజన్ రెడ్డిట్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సొంతింటి కల అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక జీవితకాల ఆశయం. అయితే మారుతున్న కాలంలో, ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఆ కల సాకారం చేసుకోవడం పగటి కలగానే మిగిలిపోతోంది. తాజాగా దేశ రాజధాని దిల్లీకి చెందిన ఒక ఐటీ/కార్పొరేట్ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆవేదన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వేతన జీవుల పరిస్థితికి అద్దం పడుతోంది. తన భాగస్వామితో కలిపి నెలకు రూ. 2 లక్షల ఉమ్మడి ఆదాయం వస్తున్నప్పటికీ, దిల్లీలో ఒక చిన్న 2బీహెచ్‌కే ఫ్లాట్ కూడా కొనలేకపోతున్నామని ఆ నెటిజన్ బాధపడ్డాడు.

ద్వారక, పితాంపుర వంటి కాస్త పేరున్న, సురక్షితమైన ప్రాంతాల్లో ఇళ్ల కోసం వెతికితే.. కనీసం రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయని సదరు యూజర్ పేర్కొన్నాడు.
"తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేదా పూర్వీకుల ఆస్తి బ్యాకప్ లేని మాలాంటి వాళ్లకు ఇది పూర్తిగా అందుబాటులో లేని ధర. హోమ్ లోన్ పరిమితికి కూడా ఇది చాలా ఎక్కువ. అసలు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంతకీ దిల్లీలో ఇల్లు ఎక్కడైనా కొనే అవకాశం ఉందా?" అంటూ సలహాలు కోరాడు.
లక్షల జీతం ఉన్నా తప్పని ఈఎంఐ టెన్షన్!
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వేలాది మంది వేతన జీవులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. జీతాల పెరుగుదల కంటే ప్రాపర్టీ ధరల పెరుగుదల రాకెట్ వేగంతో దూసుకుపోతోందని మండిపడుతున్నారు. బిల్డర్లు సాధారణ అపార్ట్‌మెంట్లను కూడా 'అల్ట్రా లగ్జరీ' ప్రాజెక్టులుగా మార్కెటింగ్ చేస్తూ కృత్రిమంగా ధరలు పెంచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ చర్చలో భాగంగా మరో నెటిజన్ తన భయాన్ని బయటపెట్టాడు.
"నేను నెలకు రూ. 4.5 లక్షలు సంపాదిస్తాను. పోయినేడాది రూ. 2.5 కోట్లతో ఒక ఇల్లు కొన్నాను (రిజిస్ట్రేషన్, చిన్నపాటి రినోవేషన్లు కలిపి రూ. 3 కోట్ల బిల్లు అయింది). ఇప్పుడు నా జీతంలో 35 శాతం కేవలం ఈఎంఐకే పోతోంది. పైగా ప్రస్తుత ఏఐ ఉద్యోగ సంక్షోభం భయాల వల్ల అసలు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. అందుకే టెన్షన్ పడి ఇల్లు కొనేకంటే, అద్దెకు ఉంటూ వీలైతే టైర్-2, టైర్-3 నగరాలకు మారిపోవడం ప్రశాంతతను ఇస్తుంది," అని రాసుకొచ్చాడు.
దిల్లీతో పాటు హైదరాబాద్, బెంగళూరు వంటి ఐటీ హబ్‌లలోనూ ఇలాంటి ఏఐ ఉద్యోగ భయాలు ఈఎంఐ బాధితుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఫ్లాట్ కంటే ప్లాట్ బెటర్.. నెటిజన్ల విలక్షణ వ్యూహాలు!
మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ సమస్యకు భిన్నమైన పరిష్కారాలను సూచించారు. దిల్లీలో ఇల్లు కొనడానికి భారీ ఈఎంఐలు కట్టే బదులు, అదే డబ్బుతో అద్దె ఇంట్లో ఉంటూ మిగిలిన పొదుపు మొత్తాన్ని ప్లాట్లపై పెట్టుబడి పెట్టడం మంచిదని ఒకరు సలహా ఇచ్చారు.
"నేను అద్దె ఇంట్లోనే ఉంటూ టైర్-2 నగరాల్లో నాకు తెలిసిన పరిచయాలతో ప్లాట్లు కొంటుంటాను. ఫ్లాట్ల కంటే ఓపెన్ ప్లాట్లకు ల్యాండ్ అప్రిసియేషన్ (ధరల పెరుగుదల) ఎక్కువ ఉంటుంది. ఒక పెద్ద ప్లాట్ కొని, ధర పెరిగాక దాన్ని అమ్మి వచ్చిన లాభంతో రెండు మూడు చిన్న ప్లాట్లు కొంటాను. ఈ సైకిల్ నా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసింది," అని తన పర్సనల్ స్ట్రాటజీని వివరించాడు.
నిజానికి, కేవలం దిల్లీలోనే కాదు.. హైదరాబాద్ (గచ్చిబౌలి, కోకాపేట్), బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జీతం పెరిగినా, రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా సొంతిల్లు అనేది సగటు మధ్యతరగతి ఐటీ ఉద్యోగికి కూడా బరువైన భారంగా మారుతోందనేది ఈ చర్చ సారాంశం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


