...
...
Next Story

Crime news : స్పీడ్​ మానిటరింగ్ డివైజ్​ ఇన్​స్టాల్ చేస్తుంటే ఢీకొట్టిన కారు- పోలీసు మృతి!

దిల్లీ సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింఘు బోర్డర్ వద్ద స్పీడ్ మానిటరింగ్ డివైజ్​ ఇన్​స్టాల్ చేస్తున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అమిత్‌ను ఒక కారు ఢీకొట్టింది. ఆయన ప్రాణాలు కోల్పోయారు.

Published on: Jul 16, 2026, 09:56:40 IST
Advertisement

దేశ రాజధాని దిల్లీలో హిట్ అండ్ రన్ కేసు కలకలం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఒక కారు.. రహదారిపై విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌ను బలితీసుకుంది. ఆ సమయంలో సదరు పోలీసు.. స్పీడ్ మానిటరింగ్ డివైజ్​ని ఇన్​స్టాల్ చేస్తుండటం గమనార్హం.

అసలేం జరిగింది?

దిల్లీలోని ఓ రోడ్డు.. (RAJ K RAJ /HT PHOTO)
దిల్లీలోని ఓ రోడ్డు.. (RAJ K RAJ /HT PHOTO)

బుధవారం సాయంత్రం ఔటర్ నార్త్ దిల్లీలోని సింఘు బోర్డర్ సమీపంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు సదరు కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల కథనం ప్రకారం.. దిల్లీ ట్రాఫిక్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ అమిత్ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సింఘు బోర్డర్ వద్ద ఉన్న ఒక ట్రాఫిక్ బూత్ సమీపంలో డ్యూటీలో ఉన్నారు. వాహనాల వేగాన్ని రికార్డ్ చేసే ఆన్-డ్యూటీ స్పీడ్ మానిటరింగ్ మిషన్‌ను ఆయన రోడ్డు పక్కన ఇన్​స్టాల్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అటుగా, అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. అమిత్‌ను బలంగా ఢీకొట్టింది. కారు గుద్దిన వేగానికి ఆయన రోడ్డుపై పడిపోయి తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

హాస్పిటల్‌కు తరలించేలోపే పోయిన ప్రాణం!

హరియాణాలోని సోనిపట్‌కు చెందిన అమిత్, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన తోటి ట్రాఫిక్ సిబ్బంది వెంటనే స్పందించి, ఆయన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అమిత్ అప్పటికే మరణించాడని, ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు.

సాధారణంగా వాహనాల వేగాన్ని నియంత్రించి, ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు రహదారులపై స్పీడ్ గన్‌లు, స్పీడ్ మానిటరింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి ఒక విధి నిర్వహణలోనే ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోవడం పట్ల తోటి సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

గంటల వ్యవధిలోనే నిందితుడి అరెస్ట్..

ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా దూసుకెళ్లిపోయాడు.

కాగా ఈ హిట్ అండ్ రన్ కేసును దిల్లీ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు, కారును గుర్తించేందుకు రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు తక్షణమే పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించి, ప్రమాదానికి ముందు, తర్వాత ఆ కారు ఏ మార్గంలో ప్రయాణించిందనే విషయాన్ని ట్రేస్ చేశారు. పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రమాదం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడైన డ్రైవర్‌ను పట్టుకుని అరెస్ట్​ చేశారు. నిందితుడి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks