LPG Price Hike : సామాన్యుడిపై ‘బండ’ బాదుడు- పెరిగిన గృహ సిలిండర్​ ధరలు..

అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో ఇంట్లో వాడుకునే ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్లతో పాటు వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్​ సంస్థలు ప్రకటించాయి. ఇది శనివారమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి.

Published on: Mar 7, 2026, 06:00:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇస్తూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. పెంచిన ధరలు శనివారం, మార్చి 7వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి.

ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరలు పెంపు..
ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరలు పెంపు..

ఇరాన్​పై అమెరికా- ఇజ్రాయెల్​ దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు, తద్వారా ఉత్పన్నమైన అంతర్జాతీయ మార్కెట్ అనిశ్చితి, ఇంధన సరఫరా గొలుసులో మార్పులు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సుమారు ఏడాది కాలంగా స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరగడం గృహిణులతో పాటు చిన్న తరహా వ్యాపారులపై అదనపు భారాన్ని మోపనుంది.

ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరలు పెంపు- వివిధ నగరాల్లో ఇలా..

తాజా పెంపుతో 14.2 కిలోల గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్‌పై రూ. 60 పెరిగింది.

ప్రధాన నగరాల్లో కొత్త ధరలు (14.2 కేజీల సిలిండర్):

దిల్లీ: రూ. 853 నుంచి రూ. 913 కి చేరింది.

ముంబై: రూ. 852.50 నుంచి రూ. 912.50 కి పెరిగింది.

కోల్‌కతా: రూ. 879 నుంచి రూ. 939 కి చేరింది.

చెన్నై: రూ. 868.50 నుంచి రూ. 928.50 కి పెరిగింది.

హైదరాబాద్​ : రూ. 905 నుంచి రూ. 965 కి పెరిగింది.

కమర్షియల్ సిలిండర్ ధరలు (19 కేజీలు):

డొమెస్టిక్​ గ్యాస్​ సిలిండర్​తో పాటు 19 కిలోల వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ ధర సైతం ఏకంగా రూ. 115 మేర పెరిగింది.

హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రభావం చూపే కమర్షియల్ సిలిండర్ ధర దిల్లీలో రూ. 1883, ముంబైలో రూ. 1835, కోల్‌కతాలో రూ. 1990, చెన్నైలో రూ. 2043.50 కి చేరుకుంది. హైదరాబాద్​లో వాణిజ్య సిలిండర్​ ధర రూ. 2,076.5గా ఉంది.

2025 ఏప్రిల్ తర్వాత ధరల్లో మార్పు రావడం ఇదే తొలిసారి.

గత నెల వరకు కేవలం కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్​ ధరలు మాత్రమే పెరుగుతూ వచ్చాయి. ఇది సామాన్యుడిపై పరోక్షంగా ప్రభావితం చేసేది. కానీ ఇప్పుడు డొమెస్టిక్​ సిలిండర్​ ధరలు కూడా పెరగడం షాక్​కి గురి చేసే విషయం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుతాయో తెలియని నేపథ్యంలో ముందు ముందు ఇంకెంత ‘బండ’ బాదుడు ఎదుర్కోవాలో అని సామాన్యుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తింది.

కాగా ఉజ్వల్​ పథకం ద్వారా అందిచే సిలిండర్​ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

ఇంధన కొరత లేదు: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ

కాగా దేశంలో ఇంధన సరఫరాపై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. దేశంలో ఎనర్జీ కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. "మా ప్రాధాన్యత ఎప్పుడూ పౌరులకు సరసమైన, స్థిరమైన ఇంధనాన్ని అందించడమే. ప్రస్తుతం దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి" అని ఆయన 'ఎక్స్​' వేదికగా స్పష్టం చేశారు.

అదేవిధంగా, పెట్రోల్- డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొట్టిపారేసింది. సరఫరా, పంపిణీ నెట్‌వర్క్ సాధారణంగానే ఉందని, ప్రజలు భయాందోళనతో పెట్రోల్ బంకుల వద్ద గుమిగూడవద్దని విజ్ఞప్తి చేసింది.

వ్యూహాత్మక నిల్వలు, దిగుమతులు..

హార్ముజ్ జలసంధి వద్ద అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్ ఇంధన భద్రత విషయంలో ధీమాగా ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ తన ముడి చమురు దిగుమతులను గత కొన్నేళ్లుగా వైవిధ్యీకరణ చేస్తూ వస్తోందని వివరించాయి.

రష్యా నుంచి దిగుమతులు: 2022లో రష్యా నుంచి కేవలం 0.2% మాత్రమే ముడి చమురు దిగుమతి చేసుకునే భారత్, ఇప్పుడు ఆ వాటాను గణనీయంగా పెంచింది. ఫిబ్రవరి నాటికి భారత్ తన మొత్తం అవసరాలలో 20% (రోజుకు 1.04 మిలియన్ బ్యారెళ్లు) రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది.

అమెరికా ఎల్‌పీజీ: జనవరి నుంచి అమెరికా నుంచి కూడా ఎల్‌పీజీ దిగుమతులు ప్రారంభమయ్యాయి. 2026 కాంట్రాక్ట్ ఏడాది కోసం ఏటా 2.2 మిలియన్ టన్నుల ఎల్‌పీజీ దిగుమతి చేసుకునేలా ప్రభుత్వ రంగ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ప్రస్తుతానికి దేశీయ రిఫైనరీలన్నింటినీ ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎక్కడా సరఫరాకు ఆటంకం కలగదని అధికారులు భరోసా ఇస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More