‘మోదీ గొప్ప వ్యక్తి.. మంచి మిత్రుడు’- భారత్​ పర్యటనపై ట్రంప్​ హింట్​!

ప్రధానమంత్రి మోదీ గొప్ప వ్యక్తి, మంచి మిత్రుడు అని కొనియాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. భారత్​పై పర్యటనపై ట్రంప్​ హింట్​ ఇచ్చారు. 2026లో ఇండియాకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

Updated on: Nov 7, 2025, 05:38:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘గొప్ప మనిషి’, ‘మిత్రుడు’ అంటూ కొనియాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా.. వచ్చే ఏడాది తాను భారత్‌ను సందర్శించే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. (Bloomberg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. (Bloomberg)

వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. బరువు తగ్గించే ఔషధాల ధరలు తగ్గించేందుకు ఉద్దేశించిన కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత, ప్రధాని మోదీతో తన చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని ట్రంప్ అన్నారు.

"ఆయన (ప్రధాని మోదీ) రష్యా నుంచి కొనుగోలును చాలా వరకు తగ్గించారు. ఆయన నాకు మిత్రుడు. మేము మాట్లాడుకుంటూ ఉంటాం, ఆయన నన్ను అక్కడికి (భారత్‌కు) రావాలని కోరుకుంటున్నారు. మేం దాన్ని ఖరారు చేస్తాం, నేను వెళతాను.. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి. నేను తప్పకుండా భారత్‌కు వెళతాను," అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వచ్చే ఏడాది భారత్‌కు వెళ్లే ప్రణాళిక ఏమైనా ఉందా అని విలేకరులు అడగ్గా.. "అవును, ఉండవచ్చు" అని ట్రంప్ బదులిచ్చారు.

కొనసాగుతున్న వాణిజ్య చర్చలు

రష్యా నుంచి చమురు కొంటోందంటూ భారత్​పై 50శాతం (25శాతం అదనపు టారీఫ్​ కలిపి) సుంకం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ట్రంప్​ ఆరోగ్యంపై ఆందోళన..

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఒక సమావేశంలో కుర్చీలో వెనక్కి ఒరిగిపోయి, కళ్లు మూసుకుని ఉన్నట్లు కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై చాలామంది ఆన్‌లైన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.

ఔషధాల ధరల తగ్గింపు ప్రకటన కోసం నిర్వహించిన సమావేశం మధ్యలో తీసిన కొన్ని క్లిప్‌లలో, ట్రంప్ కళ్లు మూసుకుని, కుర్చీలో వాలిపోయి ఉన్నట్లు కనిపించడం గమనార్హం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

ట్రంప్ ఓవల్ ఆఫీస్ వీడియోను పంచుకుంటూ ఒక వ్యక్తి ఎక్స్​ (గతంలో ట్విట్టర్)లో, "ట్రంప్ నిజంగా కాన్ఫరెన్స్‌లో నిద్రపోతూ ఒరిగిపోయారు.. అందుకే ఆయనకు 6 నెలలకోసారి మెదడు స్కాన్లు చేయిస్తున్నారేమో.." అని వ్యాఖ్యానించారు. మరొక వినియోగదారుడు.. "ట్రంప్ తన కుర్చీలో వెనక్కి ఒరిగి నిద్రపోతున్నాడు.." అని పేర్కొన్నారు.

ట్రంప్ నిద్రపోతున్నట్లు కనిపించిన వీడియోపై అనేకమంది ఆందోళన వ్యక్తం చేశారు. "ఆ ఎంఆర్​ఐ రిపోర్ట్ చూడటానికి నేనేం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను!" అని ఒక వ్యక్తి అన్నారు. ఇంకొకరు, "ట్రంప్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ప్రజల నుంచి కచ్చితంగా కొన్ని వైద్య సమస్యలను దాచిపెడుతున్నారు" అని అన్నారు.

అయితే, ట్రంప్ అనారోగ్యంగా ఉన్నారనే దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ట్రంప్ గతంలో అక్టోబర్‌లో తాను ఎంఆర్​ఐ చేయించుకున్నానని, అది పర్ఫెక్ట్​గ ఉందని వెల్లడించారు.

“ట్రంప్​ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు” అని అధ్యక్షుడి వైద్యుడు గతంలో చెప్పారు. అయినప్పటికీ, ట్రంప్ పాదాల వాపు, గాయపడిన చేతికి మేకప్ వేసుకున్న ఫోటోలు ఆన్‌లైన్‌లో కనిపించినప్పుడు వైట్‌హౌస్‌ను ప్రశ్నలు చుట్టుముట్టాయి. అంతేకాకుండా, అధ్యక్షుడు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీతో బాధపడుతున్నారని కూడా గతంలో ఊహాగానాలు వెలువడ్డాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More