...
...
Next Story

E20 పెట్రోల్‌పై పెరుగుతున్న అసంతృప్తి: 53% వాహనదారులు తీవ్ర వ్యతిరేకం

భారతదేశంలో ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ (20% ఇథనాల్ మిశ్రమం) విధానంపై వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లోకల్‌సర్కిల్స్ (LocalCircles) సర్వే ప్రకారం, 53 శాతం మంది ఈ నిర్ణయాన్ని విఫలమైందిగా భావిస్తుండగా, మెజారిటీ వాహనదారులు మైలేజ్ తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published on: Jul 6, 2026, 16:31:30 IST
Advertisement

భారతదేశంలో ఇథనాల్ బ్లెండింగ్ (పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం) ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాహనదారుల నుంచి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2030 నాటికి సాధించాల్సిన 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) లక్ష్యాన్ని ప్రభుత్వం ఆరేళ్ల ముందే, అంటే 2025 ఏప్రిల్ నాటికే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఏడాది కాలంలో ఈ విధానంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.

జంతర్ మంతర్ వద్ద ఈ20 పెట్రోల్ పాలసీపై నిరసనలు (REUTERS)
జంతర్ మంతర్ వద్ద ఈ20 పెట్రోల్ పాలసీపై నిరసనలు (REUTERS)

ప్రముఖ కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'లోకల్‌సర్కిల్స్' నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెట్రోల్ వాహనదారులలో 53 శాతం మంది కేంద్ర రవాణా, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు E20 విధానాన్ని అమలు చేసిన తీరును 'ఘోరమైన వైఫల్యం' (Disastrous) లేదా 'అసమర్థమైనది' గా రేట్ చేశారు. ఇందులో 42 శాతం మంది నేరుగా దీనిని తీవ్ర వైఫల్యంగా అభివర్ణించడం గమనార్హం. కేవలం 13 శాతం మంది మాత్రమే ప్రభుత్వ నిర్ణయానికి సానుకూల రేటింగ్ ఇచ్చారు.

మైలేజ్ తగ్గుదల - వాహనదారుల ఆందోళన

E20 పెట్రోల్‌కు మారిన తర్వాత ఎదురవుతున్న ఇబ్బందులపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మైలేజ్ పతనం: సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది E20 ఇంధనం వల్ల తమ వాహనాల మైలేజ్ 10 శాతం కంటే ఎక్కువ తగ్గిపోయిందని స్పష్టం చేశారు.

నిర్వహణ ఖర్చులు: దాదాపు 45 శాతం మంది వాహనదారులు ఇంజన్ అరుగుదల పెరగడం, పదే పదే రిపేర్లు రావడం వల్ల మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పాత ఇంధనం వైపే మొగ్గు: దాదాపు 31 శాతం మంది వాహనదారులు ఎక్కువ ధర చెల్లించడానికైనా సిద్ధమే కానీ, పాత E0 (ఇథనాల్ లేనిది) లేదా E10 ఇంధనాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని గట్టిగా సమర్థిస్తోంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మైలేజ్‌పై దీని ప్రభావం చాలా స్వల్పమని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కల్పిత కథనమని కొట్టిపారేశారు. ఈ కొత్త ఇంధనం వల్ల వాహన బీమా (ఇన్సూరెన్స్) క్లెయిమ్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు మార్చింది.

RON 95 ప్రమాణాలు: ఏప్రిల్ 1, 2026 నుండి దేశంలో విక్రయించే అన్ని E20 పెట్రోల్ రకాలు కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ (RON) కలిగి ఉండాలని నిబంధన విధించింది. దీనివల్ల ఇంజన్ నాకింగ్ సమస్య తగ్గుతుంది.

భవిష్యత్తు ప్రణాళికలు: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మే 2026 లో E22 నుండి E30 వరకు (IS 19850:2026) కొత్త ప్రమాణాలను కూడా నోటిఫై చేసింది. అయితే 2026 అక్టోబర్ 31 వరకు ప్రభుత్వం E20 పైనే దృష్టి పెట్టనుంది.

జులై 2026 లో సుప్రీంకోర్టుకు సమర్పించిన ఒక నివేదికలో కేంద్రం.. ఇథనాల్ బ్లెండింగ్ అనేది నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రక్రియ అని, దీని పూర్తి స్థాయి దీర్ఘకాలిక ఫలితాలు 2027 నాటికి స్పష్టమవుతాయని పేర్కొంది.

నీతి ఆయోగ్ ముందస్తు హెచ్చరికలు

నిజానికి ఈ సమస్యలపై ముందస్తు హెచ్చరికలు ఉన్నాయి. 2021 జూన్‌లో విడుదల చేసిన 'రోడ్‌మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా 2020-25' నివేదికలో నీతి ఆయోగ్ (NITI Aayog) అప్పట్లోనే ఒక హెచ్చరిక చేసింది. E0 కోసం డిజైన్ చేసి, E10 కి అనుగుణంగా మార్చిన కార్లలో 6-7% మైలేజ్ తగ్గుతుందని, టూ-వీలర్లలో 3-4% మైలేజ్ తగ్గుతుందని పేర్కొంది.

అంతేకాకుండా, తక్కువ శక్తి సామర్థ్యం ఉన్న ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను సాధారణ పెట్రోల్ కంటే తక్కువ ధరకు విక్రయించాలని మరియు పాత వాహనాల కోసం సాధారణ ఇంధనాన్ని విడిగా అందుబాటులో ఉంచాలని సూచించింది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ సాధారణ పెట్రోల్ ధరలకే విక్రయిస్తుండడం గమనార్హం.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe