...
...
Next Story

Election schedule 2026 : తమిళనాడు, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు?

Election date 2026 : అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ కీలక ప్రకటన వెలువడనుంది.

Published on: Mar 15, 2026 11:05 AM IST
Advertisement

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు, ఆదివారం, మార్చ్​ 15 సాయంత్రం నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. అసోం, పశ్చిమ్​ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశానికి ఆహ్వానం పలికింది.

5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ ఈరోజే.. (File Photo)
5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ ఈరోజే.. (File Photo)

దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎన్నికల నగారా నేడే మోగనుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి.

2026 ఎన్నికల షెడ్యూల్​- అమల్లోకి రానున్న ‘కోడ్’..

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ హై-వోల్టేజ్ ఎన్నికల ప్రకటన వెలువడగానే 'ఎన్నికల ప్రవర్తనా నియమావళి' (మోడల్​ కోడ్​ ఆఫ్​ కాండక్ట్​) తక్షణమే అమల్లోకి వస్తుంది. దీని అర్థం ఏ రాజకీయ పార్టీ కూడా ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా కొత్త పథకాలు లేదా ప్రకటనలు చేయడానికి వీలుండదు. అంతేకాకుండా, రాష్ట్ర యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం నియంత్రణలోకి వెళ్తుంది.

రాష్ట్రాల వారీగా రాజకీయ సమీకరణాలు:

పశ్చిమ్​ బెంగాల్: దీదీ వర్సెస్ బీజేపీ-

పశ్చిమ్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు, ప్రతిపక్ష బీజేపీ ఎలాగైనా పాగా వేయాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్​ఐఆర్​) ప్రక్రియ రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా చేరిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన గట్టి ఫైట్​ని ఎదుర్కొని మమతా బెనర్జీ విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో తమ బలం భారీగా పెరగడం (ఎన్నడూ లేని విధంగా) బీజేపీకి కూడా సానుకూలంగా మారింది.

దక్షిణాదిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్నారు. ప్రతిపక్షంలో ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. అయితే, ఈసారి ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణ నటుడు- రాజకీయ నాయకుడు విజయ్. తన సొంత పార్టీ ‘టీవీకే’ ద్వారా ఆయన రాజకీయ అరంగేట్రం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కేరళ: లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్-

కేరళలో ఎల్​డీఎఫ్​ (లెఫ్ట్), యూడీఎఫ్ (కాంగ్రెస్) మధ్య ప్రధాన పోరు జరగనుంది. ప్రతి ఎన్నికల్లోనూ అధికార పార్టీని మార్చే ఆనవాయితీ ఉన్న కేరళలో, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ ఇప్పటికే రెండుసార్లు వరుసగా గెలిచి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆయన మూడోసారి విజయం సాధించాలని చూస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఉత్సాహంగా ఉన్నప్పటికీ, పార్టీలోని అంతర్గత విభేదాలను చక్కదిద్దుకుంటేనే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి.

అసోం: ఈశాన్యంలో ఆధిపత్య పోరు-

ఈశాన్య భారత ముఖద్వారమైన అసోంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఇక్కడ పుంజుకోవాలని ఆశిస్తున్నప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా వంటి కీలక నేతలు పార్టీని వీడటం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో ప్రతిపక్షం బీజేపీని ఎంతవరకు ఢీకొంటుందనేది ఆసక్తికరంగా మారింది.

పుదుచ్చేరి: రంగస్వామి హ్యాట్రిక్ వేట-

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మూడోసారి అధికారాన్ని ఆశిస్తుండగా, ప్రతిపక్ష డీఎంకే మార్పు కోరుతూ ప్రజల్లోకి వెళుతోంది.

తరచూ అడిగే ప్రశ్న-

  1. ఆయా రాష్ట్రాల్లో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి?

సమాధానం- ఎన్నికలు జరగుతున్న తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్కు 118గా ఉంది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మెజారిటీ మార్కు 71గా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో, సీట్ల పరంగా పశ్చిమ్​ బెంగాల్​ అతిపెద్ద రాష్ట్రం అని చెప్పుకోవాలి. ఇక్కడ 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మెజారిటీ మార్కు 147. అసోంలోని 126 సీట్లకు మెజారిటీ మార్కు 64. ఇక పుదుచ్చేరిలో 33 సీట్లు ఉండగా, మెజారిటీ ఫిగర్​ 16గా ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe