Election Results 2026 : బెంగాల్ నుంచి కేరళ వరకు- ఓట్లను ఎలా లెక్కిస్తారు? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇలా..
ఐదు రాష్ట్రాలు- యూటీ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు? ముందస్తు ట్రెండ్స్ ఎప్పుడు వస్తాయి? కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతుంది? వంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకోండి..
యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న ఘట్టం ఇంకొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళతో పాటు పుదుచ్చెరి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. కాగా ఎన్నికలు జరపడం ఒక ఎత్తయితే, పారదర్శకంగా ఓట్లను లెక్కించడం మరో ఎత్తు! మరి దేశ రాజకీయాల్లో ఇంత కీలకమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుసుకోండి..

1. కౌంటింగ్ ఎక్కడ, ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది?
భారత ఎన్నికల సంఘం (ఈసీ) నిబంధనల ప్రకారం, రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కట్టుదిట్టంగా జరుగుతుంది. మరోవైపు ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు. కౌంటింగ్ ఎక్కడ జరగాలి అనేది ఆయనే నిర్ణయిస్తారు. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఎటువంటి పక్షపాతం లేకుండా ఉండేందుకు కౌంటింగ్ సిబ్బందిని మూడు దశల 'రాండమైజేషన్' ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు కూడా కౌంటింగ్ హాల్‌లో ఉండవచ్చు.
2. లెక్కింపు ప్రారంభం: పోస్టల్ బ్యాలెట్లే ఫస్ట్!
కౌంటింగ్ మొదట పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమవుతుంది.
సైనిక సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, వృద్ధులు వేసిన ఓట్లను ముందుగా లెక్కిస్తారు.
ఈ ప్రక్రియ మొదలైన 30 నిమిషాల తర్వాతే ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓట్లను ఇక్కడ లెక్కిస్తారు.
3. ఈవీఎంల లెక్కింపు.. రౌండ్ల వారీగా ఫలితాలు
రౌండ్లు: ఒక నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయనే దానిపై రౌండ్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది.
14 ఈవీఎంలు: సాధారణంగా ప్రతి రౌండ్‌లో 14 ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు.
ప్రతి రౌండ్ ముగియగానే, ఆ రౌండ్ వరకు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది అధికారికంగా ప్రకటిస్తారు. దీని ఆధారంగానే టీవీ ఛానెళ్లలో ట్రెండ్స్ మారుతుంటాయి.

4. వీవీప్యాట్ వెరిఫికేషన్..
ఈవీఎంలపై నమ్మకాన్ని పెంచేందుకు, ప్రతి నియోజకవర్గంలో రాండమ్‌గా ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. ఈ స్లిప్పుల సంఖ్య, ఈవీఎం మెషీన్‌లోని ఓట్ల సంఖ్యతో సరిపోలాల్సి ఉంటుంది. అప్పుడే అంతా సవ్యంగా జరుగుతున్నట్టు పరిగణిస్తారు.
5. తుది ఫలితం వెల్లడి
అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత, పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎం ఓట్లను కలిపి మొత్తం లెక్క తేలుస్తారు. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటిస్తారు. అనంతరం విజేతకు 'సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్' అందజేస్తారు.
ఫలితాలను ఎక్కడ చూడొచ్చు?
ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం మీరు:
భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ (results.eci.gov.in) చూడవచ్చు.
మొబైల్‌లో ECINET యాప్ ద్వారా కూడా ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేసి హెచ్‌టీ తెలుగు లైవ్ పేజ్ని ఫాలో అవ్వొచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఓట్ల లెక్కింపు ఏ సమయంలో ప్రారంభమవుతుంది?
అన్ని చోట్లా ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
2. ముందస్తు ట్రెండ్స్ ఎప్పటికి వస్తాయి?
కౌంటింగ్ ప్రారంభమైన గంట లేదా రెండు గంటల్లోనే (సుమారు 10 గంటల కల్లా) తొలి ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం కల్లా గెలుపు గుర్రాలు ఎవరనేది ఒక స్పష్టత వస్తుంది.
3. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకముందే ఈవీఎంలు తెరుస్తారా?
అవును, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత, అవి పూర్తి కాకపోయినా ఈవీఎంల లెక్కింపును ప్రారంభించవచ్చు.
4. ఒక రౌండ్‌లో ఎన్ని ఈవీఎంలు లెక్కిస్తారు?
సాధారణ నిబంధనల ప్రకారం, ప్రతి రౌండ్‌లో 14 ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


