Elon Musk net worth : ‘ట్రిలియన్’ డాలర్ల అధిపతిగా ఎలాన్ మస్క్- ప్రపంచంలోనే తొలి వ్యక్తి..

Elon Musk : అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్‌ఎక్స్' బంపర్ ఐపీఓతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ట్రిలియనీర్’గా ఆయన అవతరించబోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి.

Published on: Jun 12, 2026, 12:22:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ టెక్నాలజీ, వ్యాపార రంగంలో తిరుగులేని శక్తులలో ఒకరైన ఎలాన్ మస్క్.. అతి త్వరలో ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ట్రిలియనీర్’గా అవతరించబోతున్నారు. ఆయనకు చెందిన రాకెట్ తయారీ సంస్థ 'స్పేస్‌ఎక్స్' రికార్డు స్థాయి ఐపీఓతో స్టాక్ మార్కెట్​లోకి అడుగుపెడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ బంపర్ లిస్టింగ్ ఫలితంగా మస్క్ నికర ఆస్తి విలువ ఏకంగా 1.1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 95 లక్షల కోట్లు) మార్కును దాటబోతోందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ తన నివేదికలో వెల్లడించింది. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'టెస్లా', అంతరిక్ష సంస్థ 'స్పేస్‌ఎక్స్' లలో ఉన్న భారీ వాటాలే మస్క్ అపార సంపదకు ప్రధాన వనరులుగా ఉన్నాయి.

ఎలాన్ మస్క్ (Reuters / File)
ఎలాన్ మస్క్ (Reuters / File)

కాగా, ఇటీవల ముగిసిన ఐపీఓలో స్పేస్‌ఎక్స్ రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల నిధులను సేకరించిన సంగతి తెలిసిందే.

స్పేస్‌ఎక్స్ సంస్థలో ఎలాన్ మస్క్‌కు సుమారు 866 బిలియన్ డాలర్ల విలువైన షేర్ల వాటా ఉంది. టెస్లా కంపెనీలోని వాటాలు, ఇతర ఆస్తులతో కలిపి లెక్కిస్తే.. అమెరికా స్టాక్ మార్కెట్​లో స్పేస్‌ఎక్స్ షేర్ల ట్రేడింగ్ అధికారికంగా ప్రారంభమైన (భారత కాలమానంలో శుక్రవారం రాత్రి 7 గంటలు) వెంటనే ఆయన నికర ఆస్తి విలువ 1.1 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటనుంది. కంపెనీలు సమర్పించిన అధికారిక పత్రాల ఆధారంగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్, రాయిటర్స్ సంస్థలు ఈ విషయాన్ని విశ్లేషించాయి.

మిగతా కుబేరుల కంటే ఎంతో దూరం!

ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ అంచనాల ప్రకారం.. ఎలాన్ మస్క్ నికర ఆస్తి విలువ ఏకంగా 971 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే రికార్డు స్థాయిలో 274 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. గడిచిన ఏడాది కాలంలోనే ఆయన ఆస్తి విలువకు 351 బిలియన్ డాలర్లు అదనంగా చేరాయి. ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడైన లారీ పేజ్ మొత్తం ఆస్తి (304 బిలియన్ డాలర్లు) కంటే మస్క్ ఒక్క ఏడాదిలో సంపాదించిన సంపదనే చాలా ఎక్కువ కావడం గమనార్హం1

మరోవైపు ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం.. మస్క్ నికర ఆస్తి విలువ 794.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది కూడా క్రితం రోజు ట్రేడింగ్‌తో పోలిస్తే 12.6 బిలియన్ డాలర్లు పెరిగింది. రెండో స్థానంలో ఉన్న లారీ పేజ్ (292.7 బిలియన్ డాలర్లు) కంటే మస్క్ ఆస్తి 501.9 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది.

తెరపైకి ‘మస్కోనమీ’.. ‘ఎలాన్ ప్రీమియం’!

ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న ఎలాన్ మస్క్.. టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల విజయాలతో పాటు సామాజిక మాధ్యమం 'ట్విట్టర్' (ప్రస్తుత X) ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించారు. అయితే, గతంలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో చేరడం, ఆయన వ్యవహార శైలిపై అంతర్జాతీయంగా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ట్రంప్ ప్రభుత్వంలో ప్రభుత్వ సామర్థ్య పెంపు విభాగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, ఫెడరల్ శాఖల్లో బడ్జెట్ కోతలు, ఉద్యోగాల తొలగింపు వంటి వివాదాస్పద నిర్ణయాలలో ఆయన భాగస్వామి అయ్యారు.

అయినప్పటికీ, వ్యాపార ప్రపంచంలో ఆయనకున్న అపారమైన ప్రభావం కారణంగా మార్కెట్ విశ్లేషకులు మస్క్ వ్యాపార నెట్‌వర్క్‌ను “మస్కోనమీ” (Muskonomy) లేదా “ఎలాన్ ప్రీమియం” (Elon premium) అని పిలుస్తున్నారు. అంటే, ఏదైనా ఒక కంపెనీతో ఎలాన్ మస్క్ పేరు ముడిపడి ఉంటే చాలు.. సాంప్రదాయ మార్కెట్ లెక్కలతో సంబంధం లేకుండా ఆ కంపెనీల మార్కెట్ విలువలు ఆకాశాన్ని తాకుతాయి.

“టెస్లా కంపెనీ లాగే, స్పేస్‌ఎక్స్ కూడా పూర్తిగా ఎలాన్ మస్క్ అనే బ్రాండ్ ఇమేజ్ మీద నడుస్తున్న పందెం. ఈ సంస్థకు దక్కిన 1.5 నుంచి 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ అనేది సాంప్రదాయ ఆర్థిక సూత్రాలకు ఎవరూ ఊహించనిది. దీనిని ఖచ్చితంగా 'ఎలాన్ మస్క్ ప్రీమియం' గానే వర్ణించాలి,” అని రినైసెన్స్ క్యాపిటల్ సీనియర్ స్ట్రాటజిస్ట్ మాట్ కెన్నెడీ వివరించారు.

దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో కెనడియన్ తల్లి, దక్షిణాఫ్రికా తండ్రికి జన్మించిన ఎలాన్ మస్క్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి 1997లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2008లో టెస్లా సీఈఓగా బాధ్యతలు చేపట్టి గ్లోబల్ ఆటోమొబైల్ రంగాన్నే పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు అదే అద్భుతాన్ని ఆయన అంతరిక్ష పరిశోధనలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లోనూ పునరావృతం చేస్తారని ఇన్వెస్టర్లు బలంగా నమ్ముతున్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ మాత్రమే కాకుండా.. సొరంగాలు తవ్వే స్టార్టప్ 'ది బోరింగ్ కంపెనీ', మానవ మెదడులో చిప్‌లు అమర్చే 'న్యూరాలింక్' తో పాటు మరో ఐదు సంచలనాత్మక కంపెనీలకు మస్క్ సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More