ఇక చిటికెలో ఈపీఎఫ్ డబ్బులు.. యూపీఐ ద్వారా విత్​డ్రా ఆప్షన్​ త్వరలోనే!

ఉద్యోగుల భవిష్య నిధి సభ్యులుఇకపై క్లెయిమ్ ఫారాలతో పనిలేకుండా, నేరుగా యూపీఐ ద్వారా తమ ఖాతాలోని నగదును విత్​డ్రా చేసుకునే సరికొత్త వ్యవస్థను కేంద్రం తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఏప్రిల్ 2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Published on: Jan 17, 2026 12:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్​) ఖాతాదారులకు తమ సొంత డబ్బును విత్ డ్రా చేసుకోవడం అనేది ఇప్పటికీ కొంత శ్రమతో కూడిన పనే. అయితే, ఈ ప్రక్రియను మరింత సరళం చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సుమారు ఎనిమిది కోట్ల మంది సభ్యులు తమ ఈపీఎఫ్ నిధులను ఇక యూపీఐ ద్వారా విత్​డ్రా చేసుకునేలా కొత్త సాఫ్ట్‌వేర్ వ్యవస్థను సిద్ధం చేస్తోందని సమాచారం.

ఇక యూపీఐ ద్వారా పీఎఫ్​ నగదు ఉపసంహరణ!
ఇక యూపీఐ ద్వారా పీఎఫ్​ నగదు ఉపసంహరణ!

ఏప్రిల్ 2026 నాటికి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల నిధుల లభ్యత వేగవంతం అవ్వడమే కాకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా సేవల్లో పారదర్శకత పెరుగుతుందని వివరించారు.

యూపీఐ ద్వారా ఈపీఎఫ్ విత్​డ్రా ఎలా పనిచేస్తుంది?

  • ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, సభ్యుల ఈపీఎఫ్ నిధులలో కొంత భాగాన్ని ఫ్రీజ్​ చేసి, మిగిలిన మెజారిటీ వాటాను నేరుగా బ్యాంక్ ఖాతా ద్వారా విత్​డ్రా చేసుకునే వీలుంటుంది.
  • సభ్యులు తమ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను స్క్రీన్‌పై చూడవచ్చు.
  • లింక్ చేసిన యూపీఐ పిన్ ఉపయోగించి సురక్షితంగా డబ్బును తమ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.
  • ఖాతాలోకి డబ్బు చేరిన తర్వాత, వాటిని డిజిటల్ పేమెంట్స్ కోసం వాడవచ్చు లేదా ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు.

ప్రస్తుత పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం ఈపీఎఫ్ నిధుల కోసం క్లెయిమ్ ఫారాలు సమర్పించాల్సి వస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ ఇబ్బందులను తొలగించేందుకు ఈపీఎఫ్‌ఓ కసరత్తు చేస్తోంది. అటో సెటిల్‌మెంట్ విధానం ద్వారా ఇప్పటికే విత్​డ్రా పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు.

అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే డబ్బు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈపీఎఫ్‌ఓ నేరుగా బ్యాంక్‌గా ఎందుకు వ్యవహరించదు?

ఈపీఎఫ్‌ఓకు బ్యాంకింగ్ లైసెన్స్ లేదు, అందుకే సభ్యులకు నేరుగా నగదు చెల్లింపులు చేయలేదు. అందుకే బ్యాంకుల ద్వారా యూపీఐ సదుపాయాన్ని అనుసంధానిస్తోంది. ఏటా దాదాపు 5 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరిస్తున్న ఈ సంస్థ, కోవిడ్ సమయంలో ప్రవేశపెట్టిన అడ్వాన్స్ క్లెయిమ్ విధానాన్ని మరింత ఆధునీకరిస్తోంది.

సభ్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, అక్టోబర్ 2025లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) పలు కీలక మార్పులకు ఆమోదం తెలిపింది:

నిబంధనల విలీనం: గతంలో ఉన్న 13 క్లిష్టమైన నిబంధనలను రద్దు చేసి, వాటిని కేవలం మూడు వర్గాలుగా (అవసరమైన అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు) మార్చారు.

పూర్తి నిధుల ఉపసంహరణ: సభ్యులు తమకు అర్హత ఉన్న నిధుల్లో 100% (మొత్తం నిధుల్లో 75%) వరకు విత్​డ్రా చేసుకోవచ్చు. అంటే ఉద్యోగి, యాజమాన్య వాటా రెండింటినీ వాడుకోవచ్చు.

సేవ కాలం తగ్గింపు: అన్ని రకాల పార్షియల్ విత్ డ్రాయల్స్ కోసం కనీస సేవా కాలాన్ని కేవలం 12 నెలలకు తగ్గించారు.

విద్యా, వివాహ ఖర్చులు: పిల్లల చదువుల కోసం 10 సార్లు, పెళ్లిళ్ల కోసం 5 సార్లు డబ్బు తీసుకునే వీలు కల్పించారు.

వీటితో పాటు యూపీఐ ద్వారా విత్​డ్రా ఆప్షన్​ ఏప్రిల్ 2026 నుంచి అందుబాటులోకి వస్తే, మధ్యతరగతి ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో ఈపీఎఫ్ నిధులు ఆపద్బాంధవుడిలా ఆదుకుంటాయని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.