EPFO SWP : రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల పీఎఫ్ సొమ్ము.. ఈపీఎఫ్ఓ ఎస్‌డబ్ల్యూపీ పూర్తి వివరాలు..
పదవీ విరమణ తర్వాత పీఎఫ్ డబ్బును ఒకేసారి కాకుండా నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధవార్షిక వాయిదాల్లో తీసుకునేలా ఈపీఎఫ్ఓ సరికొత్త 'సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్' (ఎస్‌డబ్ల్యూపీ) తీసుకొచ్చింది. మిగిలిన సొమ్ముపై వడ్డీ కూడా కొనసాగే ఈ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి..
ఉద్యోగ విరమణ తర్వాత చేతికి వచ్చే పీఎఫ్ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, నెలవారీ ఖర్చులకు ఆదాయం ఎలా సమకూర్చుకోవాలి అన్న ఆందోళనకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చక్కటి పరిష్కారం చూపిస్తోంది. రిటైర్ అయ్యే ఖాతాదారులు తమ ఖాతాలో జమ అయిన మొత్తం సొమ్మును ఒకేసారి విత్‌డ్రా చేసుకోవాల్సిన అవసరం లేకుండా, క్రమపద్ధతిలో వాయిదాల రూపంలో తీసుకునేలా 'సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్' (ఎస్‌డబ్ల్యూపీ) విధానాన్ని అమోదించింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన 2026 నవంబర్ 19న జరిగిన ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణాయక మండలి 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్' (సీబీటీ) 240వ సమావేశంలో ఈ కీలక ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చినప్పుడు, సరైన అవగాహన లేక తక్కువ వడ్డీ వచ్చే డిపాజిట్లలో వేయడం లేదా నకిలీ పెట్టుబడి పథకాల్లో చిక్కుకుని నష్టపోవడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈపీఎఫ్ఓ తీసుకొస్తున్న ఈ కొత్త ఎస్‌డబ్ల్యూపీ విధానం ప్రైవేట్ ఉద్యోగులకు ఎంతో భరోసా కల్పించనుంది.
ఎవరికి ప్రయోజనం? 6.32 లక్షల మందికి తక్షణ లబ్ధి!
కార్మిక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, తొలి దశలో 55 ఏళ్లు పైబడి, తమ పీఎఫ్ ఖాతాల్లో రూ. 5 లక్షల కంటే ఎక్కువ నిల్వ ఉన్న సుమారు 6.32 లక్షల మంది సభ్యులకు ఈ పథకం నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. భవిష్యత్తులో రిటైర్ కాబోయే ఉద్యోగులకు కూడా ఒకేసారి మొత్తం డబ్బు తీసుకునే బదులు, తమ పీఎఫ్ నిల్వల నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
పదవీ విరమణ తర్వాత పెద్దగా పెన్షన్ గానీ, ఇతర స్థిరమైన ఆదాయ వనరులు గానీ లేని ఉద్యోగులకు ఈ సదుపాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. రిటైర్ అయిన వెంటనే తమ పూర్తి పీఎఫ్ నిధిని బ్యాంకు డిపాజిట్లలోకి లేదా ఇతర పెట్టుబడుల్లోకి మార్చుకునే బదులు, విత్‌డ్రా చేయని మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలోనే ఉంచి నిర్ణీత కాలానికి ఒకసారి చెల్లింపులు పొందవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ప్రతినెలా ఎంత విత్‌డ్రా చేయాలి అన్న రీ-ఇన్వెస్ట్మెంట్ రిస్క్‌ను ఈ విధానం సమర్థవంతంగా నివారిస్తుంది.
ఈపీఎఫ్ఓ ఎస్‌డబ్ల్యూపీ ఎలా పనిచేస్తుంది?
ప్రతిపాదిత ఎస్‌డబ్ల్యూపీ ఫ్రేమ్‌వర్క్ కింద, పదవీ విరమణ చేసే సభ్యులు తమ మొత్తం పీఎఫ్ నిల్వను ఒకేసారి కాకుండా, తమ అవసరానికి అనుగుణంగా నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధవార్షిక వాయిదాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా విత్‌డ్రా చేయగా ఖాతాలో మిగిలి ఉన్న సొమ్ము ఈపీఎఫ్ ఫండ్‌లోనే కొనసాగుతుంది; ఆ మొత్తానికి ప్రభుత్వం ప్రకటించే వర్తించే వడ్డీ రేటు ప్రకారం రాబడి లభిస్తూనే ఉంటుంది. తద్వారా ఖాతాదారులు తమ పొదుపులో కొంత భాగాన్ని వాడుకుంటూనే, మిగిలిన నిధిపై పూర్తి యాజమాన్య హక్కును, వడ్డీ ప్రయోజనాన్ని నిలుపుకోవచ్చు.
ఈ సదుపాయం పూర్తిగా స్వచ్ఛందం! రిటైర్మెంట్ సమయంలో తమకు అర్హత ఉన్న పూర్తి పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోవాలని కోరుకునే సభ్యులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు; వారు ఎప్పటిలాగే పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎస్ నెలవారీ పెన్షన్ స్థానంలో ఇది వస్తుందా?
లేదు, ఈపీఎఫ్ఓ ప్రతిపాదించిన సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అనేది ప్రస్తుత 'ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్' కంటే పూర్తిగా భిన్నమైనది. కనీసం 10 ఏళ్ల అర్హత సర్వీసు పూర్తి చేసుకున్న సభ్యులకు ఈపీఎస్ కింద ప్రతినెలా పెన్షన్ అందుతుంది. ఆ నెలవారీ పెన్షన్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ కొత్త పథకాన్ని తీసుకురాలేదు; రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆదాయానికి అదనపు తోడ్పాటుగా మాత్రమే దీన్ని రూపొందించారు. ఈ రెండు ప్రయోజనాలకు అర్హత ఉన్న రిటైరీలకు, ఒకవైపు నెలవారీ ఈపీఎస్ పెన్షన్ వస్తూనే, మరోవైపు తమ పీఎఫ్ నిధి నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా వాయిదాల రూపంలో అదనపు ఆదాయం లభిస్తుంది.
ఖాతాదారుడు మరణిస్తే మిగిలిన డబ్బు పరిస్థితి ఏంటి? అమలు ఎప్పటి నుంచి?
ఖాతాదారుడి కుటుంబ సభ్యుల ప్రయోజనాలను కాపాడే నిబంధనలను కూడా ఈ ప్రతిపాదనలో చేర్చారు. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా వాయిదాలు పొందుతున్న సమయంలో ఒకవేళ సభ్యుడు మరణిస్తే, నామినీ లేదా అర్హులైన కుటుంబ సభ్యులు ఖాతాలో మిగిలి ఉన్న పూర్తి పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా ఆ వాయిదాల చెల్లింపులను యథావిధిగా కొనసాగించుకోవచ్చు. పదవీ విరమణ చేసిన వ్యక్తి పొదుపుపై ఆధారపడి జీవించే కుటుంబాలకు ఇది ఆర్థిక వెసులుబాటును అందిస్తుంది.
అయితే ఈ పథకం అమలు ప్రక్రియ, ఇతర నిబంధనలతో కూడిన పూర్తి కార్యాచరణ ప్రణాళిక చట్టపరమైన సవరణలు, ప్రభుత్వ నోటిఫికేషన్లపై ఆధారపడి ఉంటుంది. ఈపీఎఫ్ స్కీమ్‌లో అవసరమైన సవరణలను నోటిఫై చేస్తామని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి అనుగుణంగా ఆదాయపు పన్ను చట్టంలో కూడా మార్పులు చేసే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. విత్‌డ్రా పరిమితులు, చెల్లింపుల విధానం, అమలు నియమాలపై స్పష్టత వచ్చిన తర్వాత రిటైరీలకు ఈ పథకం ఎంతవరకు ఉపయోగపడుతుందో పూర్తిగా తేలనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


