...
...
Next Story

Rajdhani express : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం! ఏసీ కోచ్‌లో మంటలు, ప్రయాణికులు సురక్షితం

Rajdhani express fire : కేరళ నుంచి దిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రైలు కోట డివిజన్ పరిధిలోని విక్రమ్‌గఢ్ ఆలోట్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఓ ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.

Updated on: May 17, 2026, 09:08:24 IST
Advertisement

Rajdhani express fire today : కేరళ నుంచి దిల్లీకి వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం (మే 17) ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. కోట డివిజన్ పరిధిలోని లుని రిచ్ఛా - విక్రమ్‌గఢ్ ఆలోట్ రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో రైలులోని ఒక ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని రైల్వే శాఖ ప్రకటించింది.

రాజధాని ఎక్స్​ప్రెస్​లో అగ్నిప్రమాదం- అసలేం జరిగింది?

రాజధాని ఎక్స్​ప్రెస్​లో అగ్నిప్రమాదం..
రాజధాని ఎక్స్​ప్రెస్​లో అగ్నిప్రమాదం..

ఉదయం 5:15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కేరళలోని తిరువనంతపురం నుంచి దిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు వెళుతున్న రైలు నంబర్ 12431 రాజధాని ఎక్స్‌ప్రెస్.. రత్లాం దాటిన తర్వాత ఈ ఘోర ప్రమాదానికి గురైంది. రైలులోని బీ-1 ఏసీ కోచ్‌లో మొదట మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో సదరు కోచ్‌లో మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలను గమనించిన రైలు గార్డ్ వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

అసలు కోచ్‌లో మంటలు ఎలా చెలరేగాయి అనేదానిపై రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు దిల్లీ చేరుకోవాల్సి ఉంది. ప్రమాదం జరిగే సమయానికి రైలు అప్పటికే 2,600 కిలోమీటర్ల దూరాన్ని కవర్​ చేసింది.

రాజధాని ఎక్స్​ప్రెస్​లో మంటలు- ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..

రైలులో నుంచి దించేసిన 68 మంది ప్రయాణికులను ప్రస్తుతానికి అదే రైలులోని ఇతర కోచ్‌లలో సర్దుబాటు చేసి కోట స్టేషన్ వరకు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. కోట రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత రైలుకు అదనంగా మరో ఏసీ కోచ్‌ను అమర్చి ప్రయాణికులకు పూర్తి సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ మధ్య రైల్వే పీఆర్ఓ రవీంద్ర లఖారా తెలిపారు.

కాగా, ఈ ప్రమాదం కారణంగా దిల్లీ-ముంబై రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను వేర్వేరు స్టేషన్లలో నిలిపివేశారు.

మొన్న మరో రైలులో..

శుక్రవారమే మరో రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్​లోని ఒక రైల్వే స్టేషన్​లో ఆగి ఉన్న హైదరాబాద్- జైపూర్​ స్పెషల్​ ట్రైన్​లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు ఎక్కేందుకు ప్లాట్​ఫామ్ మీదకు తీసుకొస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో రైలులో ఎవరూ లేకపోవడంతో ఎవరికి గాయాలవ్వలేదు.

అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రభావితమైన బోగీలను తప్పించి రైలును సిద్ధం చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks