...
...
Next Story

Digi Yatra : హైదరాబాద్​ విమానాశ్రయంలో ఇక అంతర్జాతీయ ప్రయాణాలకు ‘డిజీ యాత్ర’ సేవలు- మరో 6 చోట్ల కూడా!

ఇండియా నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 'డిజీ యాత్ర' ఫేస్ రికగ్నిషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ-పాస్‌పోర్ట్ ఉన్న భారతీయ పౌరులు హైదరాబాద్ సహా ఏడు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ చెక్‌ఇన్ నిమిషాల్లో ఎలా పూర్తి చేసుకోవచ్చో వివరంగా తెలుసుకోండి..

Published on: Nov 2, 2026, 07:30:53 IST
Advertisement

ఇండియాలో విమాన ప్రయాణాలు చేసేవారికి ‘డిజీ యాత్ర’ పేరుతో ఫేస్​ రికగ్నీషన్ టెక్నాలజీ సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. డొమెస్టిక్ ప్రయాణికులకు బోర్డింగ్ ప్రక్రియను అత్యంత సులభతరం చేసిన ఈ అధునాతన సాంకేతికతను ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా అందుబాటులోకి వస్తోంది!

ఇక అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా డిజీ యాత్ర!
ఇక అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా డిజీ యాత్ర!

దేశంలోని ఏడు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ-పాస్‌పోర్ట్ ఉన్న భారతీయ పౌరుల కోసం డిజీ యాత్ర సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నవంబర్, డిసెంబర్ 2026 వరకు ఈ ట్రయల్స్ కొనసాగనున్నాయి.

హైదరాబాద్, బెంగళూరు సహా 7 ఎయిర్‌పోర్టుల్లో సేవలు..

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రయోగాత్మక సేవలు ప్రస్తుతం దేశంలోని 7 కీలక విమానాశ్రయాల్లో అందుబాటులోకి వచ్చాయి:

  • రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
  • కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు
  • ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దిల్లీ
  • ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై
  • కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, కొచ్చి
  • చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నై
  • శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం, అమృతసర్

తొలి దశలో ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు నడిపే కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ సర్వీసులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. టెర్మినల్ ఎంట్రీ పాయింట్లు, సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలు, బోర్డింగ్ గేట్ల వద్ద ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఈ-పాస్‌పోర్ట్ ఉన్నవారు డిజీ యాత్రను ఎలా ఉపయోగించాలి?

సాధారణ పాస్‌పోర్ట్ కాకుండా, ఎలక్ట్రానిక్ చిప్ ఉన్న ఈ-పాస్‌పోర్ట్ కలిగి ఉన్న భారతీయ పౌరులు మాత్రమే అంతర్జాతీయ డిజీ యాత్రకు అర్హులు.

యాప్‌లో ఈ-పాస్‌పోర్ట్‌పై ఉండే మెషిన్-రీడబుల్ జోన్ (ఎంఆర్​జెడ్)ను స్కాన్ చేయాలి.

స్మార్ట్‌ఫోన్‌లోని ఎన్‌ఎఫ్‌సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) సదుపాయం ద్వారా పాస్‌పోర్ట్‌లోని చిప్ డేటాను రీడ్ చేయాలి.

ఒక సెల్ఫీ తీసుకుని సమాచారాన్ని సరిచూసుకుంటే, క్రెడెన్షియల్స్ ప్రయాణికుడి ఫోన్‌లోని డిజీ యాత్ర వాలెట్‌లో భద్రంగా స్టోర్ అవుతాయి.

ఇమ్మిగ్రేషన్, పాస్‌పోర్ట్ తనిఖీలకు ప్రత్యామ్నాయం కానే కాదు!

డిజీ యాత్ర అందుబాటులోకి వచ్చినంత మాత్రాన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మారవని కేంద్ర విమానయాన శాఖ స్పష్టం చేసింది. ఈ సేవ కేవలం ఎయిర్‌పోర్ట్ లోపలి గేట్లు, సెక్యూరిటీ ప్రాంతాల్లో ప్రయాణికుల డిజిటల్ గుర్తింపును వేగవంతం చేయడానికి మాత్రమే తోడ్పడుతుందని పేర్కొంది.

ప్రయాణికులు తప్పనిసరిగా తమ భౌతిక పాస్‌పోర్ట్, వీసా, ఎయిర్‌లైన్ డాక్యుమెంట్లను చేతిలో ఉంచుకోవాలి. ఎయిర్‌పోర్టుల్లో జరిగే ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, ఎయిర్‌లైన్ వెరిఫికేషన్ ప్రక్రియలను యథాతథంగా పూర్తి చేయాల్సిందే.

2027 నాటికి విస్తరణ ప్రణాళికలు..

డిసెంబర్ 2026 నాటికి పూర్తయ్యే ఈ ప్రయోగాల ద్వారా లభించే ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా 2027లో ఈ సేవను దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ విమానయానంలో డిజీ యాత్రకు 2.65 కోట్లకు పైగా వినియోగదారులు ఉండగా, 39 దేశీయ ఎయిర్‌పోర్టులలో 11 కోట్లకు పైగా ప్రయాణాలు ఈ యాప్ ద్వారా జరిగాయి. 2027 నాటికి మరో 25 దేశీయ విమానాశ్రయాలకు దీనిని విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మన తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు ప్రయాణించే టెక్కీలు, విద్యార్థులు, పర్యాటకులకు హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో ప్రారంభమైన ఈ డిజీ యాత్ర సేవలు సుదీర్ఘమైన క్యూలైన్ల తిప్పలు తప్పించి సమయాన్ని ఆదా చేయనున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks