Housing prices : ‘ఇద్దరి సంపాదన ఉన్నా.. ఇల్లు కొనలేము! యూకేలో ఒకరి జీతంతోనే 3BHK’

Bengaluru Real Estate : బెంగళూరులో ఇద్దరి సంపాదన ఉన్నా ఇల్లు కొనడం భారంగా మారిందని, కానీ యూకేలో ఒక్కరి ఆదాయంతోనే అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు కొన్నానని అమెజాన్ టెక్కీ నేహా శర్మ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Published on: May 10, 2026, 08:14:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Property Prices Bengaluru : భారతదేశంలోని టెక్ హబ్ బెంగళూరులో సామాన్యుడు సొంతింటి కలను నెరవేర్చుకోవడం ఎంత కష్టతరమో వివరిస్తూ ఒక టెక్కీ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకురాలు, అమెజాన్ టెక్కీ నేహా శర్మ.. భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) దేశాల్లో ఇల్లు కొనే ప్రక్రియలో తనకు ఎదురైన అనుభవాలను పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెల్లడించారు.

బెంగళూరులులో ఇల్లు కొనలేమా?
బెంగళూరులులో ఇల్లు కొనలేమా?

బెంగళూరులో ఇద్దరి జీతం ఉన్నా సరిపోలేదు!

నేహా శర్మ తన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతాలో రాస్తూ.. "బెంగళూరులో ఉన్నప్పుడు మా ఇంట్లో ఇద్దరి సంపాదన ఉన్నప్పటికీ, ఒక ఫ్లాట్ కొనడానికి మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఆర్థికంగా ఎంతో భారంగా అనిపించి ఆ నిర్ణయాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నాము," అని పేర్కొన్నారు. కనీసం ఒక అపార్ట్‌మెంట్ కొనడం కూడా బెంగళూరులో మధ్యతరగతి వారికి అందని ద్రాక్షలా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

యూకేలో ఒక్కరి సంపాదనతోనే 3-బీహెచ్​కే ఇల్లు!

అదే సమయంలో యూకేలో ఇల్లు కొనడం ఎంత సులభమో ఆమె వివరించారు. "యూకేకు మారిన రెండేళ్లలోనే నేను ఒక ఇండిపెండెంట్ 3-బెడ్‌రూమ్ ఇంటిని కొనుగోలు చేయగలిగాను. అది కూడా కేవలం నా ఒక్కరి ఆదాయం మీదనే సాధ్యమైంది," అని ఆమె తెలిపారు.

యూకేలో తాను కొన్న ఇంటి సౌకర్యాల గురించి వివరిస్తూ.. "ఆ ఇంట్లో బ్యాక్‌యార్డ్, పార్కింగ్ సౌకర్యం, మంచి వ్యూతో పాటు ఫ్రిజ్, గ్యాస్, డిష్‌వాషర్, వాషింగ్ మెషీన్, ఓవెన్, కార్పెట్, లైటింగ్ వంటి ఒక ఇంటికి అవసరమైన ప్రతి కిచెన్ హోమ్ అప్లయన్స్ కూడా ఉన్నాయి," అని ఆమె చెప్పుకొచ్చారు.

'నల్లధనం' అడగలేదు.. 100 శాతం పారదర్శకత!

మన దేశంలోని రియల్ ఎస్టేట్ రంగానికి, యూకేకు ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని నేహా శర్మ ఎత్తిచూపారు.

"అక్కడ ఎవరూ నన్ను నల్లధనం అడగలేదు. ప్రతిదీ 100 శాతం పారదర్శకంగా ఉంది," అని ఆమె రాశారు.

అంతేకాకుండా, మొదటిసారి ఇల్లు కొంటున్నందుకు తనకు యూకేలో 'ఫస్ట్ బయర్' డిస్కౌంట్ కూడా లభించిందని ఆమె పేర్కొన్నారు! భారతదేశంలో ఇల్లు కొనాలంటే రిజిస్ట్రేషన్ విలువల కంటే అదనంగా నగదు రూపంలో నల్లధనాన్ని బిల్డర్లు డిమాండ్ చేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

2017లో పూణె ఇంటర్నేషనల్ సెంటర్ ప్రచురించిన ఒక పాలసీ పేపర్ కూడా భారత రాజకీయాలు, రియల్ ఎస్టేట్ రంగాలే నల్లధనానికి ప్రధాన వనరులని పేర్కొనడాన్ని ఇక్కడ గమనించాలి.

నెటిజన్ల రియాక్షన్: "ఇది రియల్ ఎస్టేట్ పీడకల!"

నేహా శర్మ చేసిన ఈ పోస్ట్​పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

"ఖచ్చితంగా.. విదేశాల్లో ఇల్లు కొనండి, ఇక్కడ సాధ్యం కాకపోతే అద్దెకు ఉండండి. ప్రాపర్టీ కొనుగోలుదారులు, బిల్డర్లు కొంతకాలం ఇబ్బంది పడనివ్వండి," అని ఒకరు రాశారు.

"భారతదేశంలో ఆస్తి కొనడం ఒక పీడకల. ఈ వ్యవస్థ మళ్లీ గాడిలో పడాలంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా కుప్పకూలాలి. అప్పుడే నల్లధనం వేళ్లు విరుగుతాయి" అని మరొకరు కామెంట్ చేశారు.

"మీ కథనంలో అత్యంత కీలకమైన పాయింట్ 'ఎవరూ బ్లాక్ మనీ అడగలేదు' అనేది. భారత రియల్ ఎస్టేట్ రంగంలో సగం పెయిన్ ఆ ఒక్క లైన్ లోనే ఉంది" అంటూ మరొక యూజర్ విశ్లేషించారు.

మొత్తానికి, నేహా శర్మ పంచుకున్న ఈ ఎక్స్​పీరియెన్స్.. భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న పారదర్శకత లోపాలను, సామాన్యుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More