Sachin Out: సచిన్ వివాదాస్పద ఔట్ గుర్తుందా? భుజానికి తాకి ఎల్బీడబ్ల్యూ.. ఇప్పటికీ అది ఔటేనని వాదిస్తున్న మెక్‌గ్రాత్
Sachin Out: పాత తరం ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఓ సంఘటన బాగా గుర్తుంటుంది. అదే 1999లో ఆస్ట్రేలియాతో టెస్టులో సచిన్ టెండూల్కర్ ఎల్బీడబ్ల్యూ ఔట్. బాల్ భుజానికి తగిలినా అంపైర్ ఎల్బీడబ్ల్యూ అని ఇచ్చాడు. అయితే ఇప్పటికీ అది ఔటేనని ఆసీస్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వాదిస్తున్నాడు.
మిగతా క్రికెట్ ప్రపంచం మొత్తం సచిన్ టెండూల్కర్ నాటౌట్ అని చెప్తున్నా.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కు మాత్రం అది ఔటే. అసలు ఏ మ్యాచ్, ఏ ఔట్ అంటారా? పాత తరం భారత క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మర్చిపోని సచిన్ టెండూల్కర్ వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ ఔట్ గురించే ఈ చర్చంతా.

సచిన్ టెండూల్కర్ ఔట్
1999, డిసెంబర్ 13న అడిలైడ్ లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ సాగింది. 396 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైంది. అయితే టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. బంతి షార్ట్‌గా వచ్చి టెండూల్కర్ భుజానికి తగిలింది, అంపైర్ డారిల్ హార్పర్ వెంటనే ఔటిచ్చాడు.
అది ఔట్ కాదని
బంతి తనపై నుంచి వెళ్లిపోతుందని భావించి సచిన్ అప్పుడు కిందకు వంగాడు. కానీ బాల్ వచ్చి అతని భుజానికి తగిలింది. అంత ఎత్తులో వచ్చిన బాల్ కచ్చితంగా వికెట్ల మీద నుంచి వెళ్లేదని సచిన్ తో సహా క్రికెట్ ప్రపంచం మొత్తం భావించింది. కానీ గ్లెన్ మెక్‌గ్రాత్ మాత్రం ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత కూడా అది ఔట్ అనే అంటున్నాడు.
మెక్‌గ్రాత్ కామెంట్లు
స్పోర్ట్స్‌స్టార్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ ఖచ్చితంగా ఔటేనని వాదించాడు. "సచిన్ అప్పుడే క్రీజులోకి వచ్చాడు. బహుశా నాలుగు బంతులు ఆడాడేమో. అతనికి బౌన్సర్ వేయాలనిపించింది. నేను పరిగెత్తుకుంటూ వచ్చి షార్ట్ బాల్ వేశాను. సచిన్ దాన్ని తప్పించుకోవడానికి వంగాడు. కానీ బాల్ అతని భుజానికి తగిలింది’’ అని ఆ రోజు ఏం జరిగిందో మెక్‌గ్రాత్ గుర్తు చేసుకున్నాడు.
బెయిల్స్ కు తగిలేది
"నేను సచిన్ కిందకు వంగడం చూశాను. అతని తల మీదుగా బెయిల్స్ నాకు కనిపించాయి. కాబట్టి ఆ బంతి స్టంప్స్‌ను తాకుతుందని నేను అనుకున్నా. ఆస్ట్రేలియా అంపైర్ డారిల్ హార్పర్ ఔటిచ్చాడు. సచిన్, నేను చాలా కాలంగా ఈ ఔట్‌పై చర్చిస్తూనే ఉన్నాం" అని మెక్‌గ్రాత్ చెప్పాడు.
కళ్లు చెక్ చేయించుకోవాలని
"ఆ బంతి స్టంప్స్‌కు కనీసం ఒకటిన్నర అడుగు పైన వెళ్తుందని సచిన్ అనుకుంటున్నాడు. ఆ బంతి స్టంప్స్‌ను తాకుతూ వెళ్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. 18 నెలల క్రితం ఇండియాలో సచిన్‌తో కలిసి ఒక టీవీ యాడ్ లో నటించే ఛాన్స్ వచ్చింది. అప్పుడు నా కళ్లు చెక్ చేయించుకోవాలని ఆ ఔట్ గురించే సచిన్ చెప్పాడు’’ అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












