...
...
Next Story

Google Fitbit edge : ఫిట్‌బిట్ ఎడ్జ్ వచ్చేసింది! రూ.15వేల బడ్జెట్‌లో కలర్ స్క్రీన్, జీపీఎస్ స్మార్ట్‌వాచ్

గూగుల్ తన ప్రాచుర్యం పొందిన ఫిట్‌బిట్ శ్రేణిలో 'ఫిట్‌బిట్ ఎడ్జ్' పేరిట సరికొత్త హెల్త్ ట్రాకర్‌ను విడుదల చేసింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ రెండింటికీ సపోర్ట్ చేసే ఈ స్మార్ట్‌వాచ్ ధర, ఫీచర్లు, బ్యాటరీ లైఫ్, మరమ్మతు చేసుకునే ప్రత్యేక వెసులుబాట్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 13, 2026, 05:24:42 IST
Advertisement

టెక్ దిగ్గజం గూగుల్ ఫిట్‌నెస్ ప్రేమికుల కోసం 'ఫిట్‌బిట్ ఎడ్జ్' పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌వాచ్​లలో హెవీ ఫీచర్లు వద్దనుకునే వారికి, అలాగని స్క్రీన్ లేని సాధారణ బ్యాండ్లు నచ్చని వారికి ఇది సరైన ప్రాధాన్యతగా నిలవనుంది. 179 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 17,000) ప్రాథమిక ధరతో లభించే ఈ వాచ్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫిట్‌బిట్ ఎయిర్ (100 డాలర్లు), గూగుల్ పిక్సెల్ వాచ్ 5 (400 డాలర్ల)ల మధ్య బడ్జెట్ విభాగంలో స్థానాన్ని దక్కించుకుంది.

గూగుల్​ ఫిట్​బిట్ ఎడ్జ్- అదిరిపోయే డిస్‌ప్లే, ప్రీమియం లుక్..

గూగుల్ ఫిట్​బిట్ ఎడ్జ్ ట్రాకర్..
గూగుల్ ఫిట్​బిట్ ఎడ్జ్ ట్రాకర్..

గూగూల్ ఫిట్‌బిట్ ఎడ్జ్ ట్రాకర్ వాచ్‌లో 1.34 అంగుళాల కలర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది గతంలో వచ్చిన ఫిట్‌బిట్ ఛార్జ్ 6 కంటే 46 శాతం పెద్దదిగా ఉండటంతో పాటు ‘ఆల్వేస్ ఆన్’ సదుపాయాన్ని కలిగి ఉంది. వర్కౌట్లను నిలిపివేయడానికి, మెనూలను ఓపెన్ చేయడానికి వీలుగా ఫిజికల్ సైడ్ బటన్‌ను కూడా ఇచ్చారు.

ఆబ్సీడియన్, ఫాగ్, ఆలివ్, కేనియన్ రంగుల కలయికల్లో లభించే ఈ వాచ్‌లో బ్యాండ్లను సులభంగా మార్చుకోవచ్చు.

ఇక బాస్కెట్‌బాల్ దిగ్గజం పేరుతో 'స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్' ను కూడా పరిచయం చేశారు.

గూగుల్​ ఫిట్​బిట్ ఎడ్జ్- ఐఫోన్, ఆండ్రాయిడ్ రెండింటికీ సపోర్ట్!

ఈ గూగుల్​ ఫిట్​బిట్ ఎడ్జ్ స్మార్ట్‌వాచ్ వేర్ ఓఎస్​కి బదులుగా ఫిట్‌బిట్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనివల్ల ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు యాపిల్ ఐఫోన్ (ఐఓఎస్) వాడుతున్న వారు కూడా ఈ వాచ్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా ఉపయోగించవచ్చు. ఇందులో నోటిఫికేషన్లు, కాల్ అలర్టులు, వాతావరణ సమాచారం, మ్యూజిక్ కంట్రోల్స్, నావిగేషన్ డైరెక్షన్లు కనిపిస్తాయి. అయితే ఇందులో మైక్రోఫోన్, స్పీకర్ లేనందున వాచ్ ద్వారా నేరుగా మాట్లాడే వెసులుబాటు లేదు. అలాగే కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కోసం ఎన్‌ఎఫ్‌సీ సదుపాయాన్ని అందించకపోవడం గమనించాలి.

గూగుల్​ ఫిట్​బిట్ ఎడ్జ్- అత్యాధునిక హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్..

ఇన్‌బిల్ట్ జీపీఎస్: ఫోన్‌తో సంబంధం లేకుండా నేరుగా జీపీఎస్, ఆల్టీమీటర్ సేవలు లభిస్తాయి.

హార్ట్ రేట్ నిశిత పరిశీలన: గుండె వేగాన్ని కొలిచే సెన్సార్ల కచ్చితత్వం ఛార్జ్ 6 కంటే 40 శాతం పెరిగినట్లు సంస్థ స్పష్టం చేసింది.

ఈసీజీ, ఈసీజీ రీడింగ్స్: బ్లడ్ ఆక్సిజన్ (SpO2), శరీర ఉష్ణోగ్రత, ఈసీజీ రీడింగ్లను ట్రాక్ చేస్తుంది.

50కి పైగా వర్కవుట్ మోడ్లు: 40కి పైగా వ్యాయామాలను ఇది స్వయంచాలకంగా గుర్తిస్తుంది. రన్నింగ్ మిషన్లు, ఇతర జిమ్ పరికరాలకు రియల్ టైమ్ హార్ట్ రేట్ డేటాను పంపే వెసులుబాటు కూడా ఉంది.

గూగుల్​ ఫిట్​బిట్ ఎడ్జ్- బ్యాటరీ రీప్లేస్‌మెంట్..

ఈ స్మార్ట్‌వాచ్‌లోని అత్యంత ప్రధానమైన విశేషం యూజర్ రిప్లేసబుల్ బ్యాటరీ. సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లలో బ్యాటరీ పాడైతే వాచ్‌ను మార్చాల్సి వస్తుంది. కానీ ఫిట్‌బిట్ చరిత్రలోనే మొదటిసారిగా యూజర్లు స్వయంగా లేదా టెక్నీషియన్ ద్వారా బ్యాటరీని మార్చుకునేలా సులభమైన రిపేరబిలిటీ డిజైన్‌తో దీనిని రూపొందించారు.

సాధారణ వాడకంలో ఈ వాచ్ 7 రోజుల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అయితే 'ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే' ఆన్ చేసి ఉంచితే బ్యాటరీ లైఫ్ 2 రోజులకు పరిమితమవుతుంది.

ఇక ఈ గూగుల్​ ఫిట్​బిట్ ఎడ్జ్ అక్టోబర్ 27 నుంచి ఇది అధికారిక విక్రయాలకు అందుబాటులోకి రానుంది. రూ.20,000 లోపు ప్రీమియం ఫిట్‌నెస్ ట్రాకర్ కోరుకునే వారికి యాపిల్ వాచ్ ఎస్‌ఈ 3, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7లకు ఇది సరైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks