...
...
Next Story

గుడ్ న్యూస్! ఇక 5 కార్లు ఉంటే చాలు రెంటల్ బిజినెస్ చేసుకోవచ్చు.. కేంద్రం కొత్త స్కీమ్!

సెల్ఫ్ డ్రైవ్, క్యాబ్ రెంటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకునే చిన్న వ్యాపారులకు కేంద్ర రవాణా శాఖ శుభవార్త చెప్పింది. కనీస కార్ల సంఖ్యను 50 నుంచి ఏకంగా 5కు తగ్గిస్తూ 'ది రెంట్-ఎ-క్యాబ్ స్కీమ్ 2026' ముసాయిదాను విడుదల చేసింది. లైసెన్స్ ఫీజు, భద్రతా నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 13, 2026, 10:49:10 IST
Advertisement

కార్ రెంటల్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కనే చిన్న, మధ్యతరహా వ్యాపారులకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ భారీ ఊరట కల్పించనుంది! ఇప్పటివరకు సెల్ఫ్ డ్రైవ్ లేదా డ్రైవర్ ఆధారిత (ఛౌఫర్-డ్రివెన్) కార్ రెంటల్ సంస్థను ప్రారంభించాలంటే కనీసం 50 కార్లు ఉండాలనే కఠిన నిబంధన ఉండేది. తాజాగా ఆ పరిమితిని ఏకంగా 5 కార్లకు తగ్గిస్తూ కేంద్రం ‘ది రెంట్-ఏ-క్యాబ్ స్కీమ్ 2026’ పేరుతో కొత్త ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది.

ఇక 5 కార్లు ఉంటే చాలు రెంటల్ బిజినెస్ చేసుకోవచ్చు..
ఇక 5 కార్లు ఉంటే చాలు రెంటల్ బిజినెస్ చేసుకోవచ్చు..

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ ఉద్యోగుల వారాంతపు ప్రయాణాల నుంచి మొదలుకొని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో పర్యాటకులు, భక్తుల అవసరాల వరకు తెలుగు రాష్ట్రాల్లో సెల్ఫ్ డ్రైవ్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే 50 కార్ల నిబంధన కారణంగా స్థానిక చిన్న ట్రావెల్ ఏజెన్సీలు, యువ పారిశ్రామికవేత్తలు ఈ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టలేకపోయారు. కేవలం బడా కార్పొరేట్ యాప్స్ మాత్రమే ఈ మార్కెట్‌ను శాసించే పరిస్థితి ఉంటోంది. ఇప్పుడు కేంద్రం తెచ్చిన ఈ మార్పుతో తక్కువ పెట్టుబడితో స్థానికులు సైతం సొంతంగా కార్ రెంటల్ బిజినెస్ ప్రారంభించుకోవచ్చు.

37ఏళ్ల నాటి పాత చట్టానికి స్వస్తి.. 2027 జనవరి నుంచి అమలు

కొత్తగా ప్రతిపాదించిన ఈ విధానం 2027 జనవరి నుంచి అమల్లోకి రానుంది. 1989లో రూపొందించిన పాత నిబంధనల స్థానంలో దాదాపు 37 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తీసుకొస్తున్న సమగ్ర మార్పు ఇది. గతంలో 2021లో ఒక పరిమిత సవరణ ద్వారా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ క్యాబ్‌లు, మిథనాల్, ఇథనాల్ ఇంధనాలతో నడిచే వాహనాలకు పర్మిట్ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ ఈ పథకం పరిధిని విస్తరించారు.

రెంటల్ సంస్థల యజమానులకు అనుమతుల ప్రక్రియను కేంద్రం అత్యంత సరళతరం చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్నా, ఎన్ని కార్లు నడుపుతున్నా సరే ఒకే లైసెన్స్ సరిపోతుంది. ఆయా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అంతటా చెల్లుబాటు అయ్యే ఈ సింగిల్ లైసెన్స్ కోసం రూ. 25,000 స్థిర ఫీజును ప్రతిపాదించారు. కార్ల సంఖ్య పెరిగినా లేదా బ్రాంచీలు విస్తరించినా అదనపు లైసెన్స్ ఫీజుల భారం ఉండదు.

ప్రయాణికుల భద్రతకు పెద్దపీట.. చలాన్లు ఉంటే నో ఎంట్రీ!

వ్యాపార నిబంధనలను సడలించినప్పటికీ, ప్రయాణికుల భద్రత విషయంలో కేంద్రం కఠిన నిబంధనలు పెట్టింది. ప్రతి రెంటల్ కారుకు సమగ్ర బీమా పాలసీ తప్పనిసరి. కారును అద్దెకు తీసుకునే వ్యక్తి, డ్రైవర్‌తో పాటు కారు సీటింగ్ సామర్థ్యం మేరకు లోపల ప్రయాణించే అందరికీ ఈ బీమా వర్తించాలి.

వాహనాల చరిత్ర విషయంలోనూ కఠిన తనిఖీలు ఉంటాయి. రెంటల్ వ్యాపారంలో వాడే కార్లపై ఎలాంటి పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు లేదా నిబంధనల ఉల్లంఘన కేసులు ఉండకూడదు. జాతీయ నేర గణాంకాల సంస్థ పోలీసు నేర డేటాబేస్‌లో ఆ వాహనాలపై ఎలాంటి రికార్డులు ఉండరాదని ముసాయిదాలో స్పష్టం చేశారు. ప్రతి కారులో యాక్టివ్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (జీపీఎస్), ఫస్ట్ ఎయిడ్ కిట్ కచ్చితంగా ఉండాలి.

24 గంటల కస్టమర్ సపోర్ట్.. డ్రైవర్ల సంక్షేమానికి భరోసా

కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఆపరేటర్లు తప్పనిసరిగా సొంత వెబ్‌సైట్‌ను నిర్వహించాలి. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి 24 గంటల గ్రీవెన్స్ సపోర్ట్ అందుబాటులో ఉంచాలి. ప్రయాణ మధ్యలో వాహనం మొరాయిస్తే తక్షణమే అత్యవసర మరమ్మతులు, వాహనాన్ని తరలించే టోయింగ్ సదుపాయాన్ని కల్పించాలి.

కేవలం వ్యాపారవేత్తలు, ప్రయాణికుల ప్రయోజనాలే కాకుండా డ్రైవర్ల భవిష్యత్తుకు కూడా ఈ స్కీమ్ భరోసా ఇస్తోంది. సామాజిక భద్రతా కోడ్ 2020 కింద డ్రైవర్లకు అవసరమైన సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత ప్రయోజనాలను ఆపరేటర్లు కచ్చితంగా అందించాలని కేంద్ర రవాణా శాఖ నిర్దేశించింది. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే రవాణా రంగంలో పారదర్శకత పెరగడంతో పాటు స్థానికంగా వేలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks