...
...
Next Story

HDFC bank share : సీఈఓ రాజీనామా చేసినా.. లాభాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు! ఇప్పుడు కొనొచ్చా?

HDFC share price : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించినప్పటికీ సంస్థ షేరు ధర మార్కెట్లో లాభాల బాట పట్టింది. కొత్త నాయకత్వంతో బ్యాంక్ మరింత బలపడుతుందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తూ భారీ టార్గెట్ ప్రైజ్​ ప్రకటించాయి.

Published on: Aug 31, 2026, 10:44:14 IST
Advertisement

భారత బ్యాంకింగ్ రంగానికి దిశానిర్దేశం చేసే ప్రైవేట్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీశన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రతికూల వార్త వెలువడినప్పటికీ, సోమవారం నాటి ట్రేడింగ్‌లో బ్యాంక్ షేరు ధర లాభాల్లో కొనసాగుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తోంది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేరు..

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ స్టాక్స్ అప్డేట్స్..
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ స్టాక్స్ అప్డేట్స్..

గత వారం శుక్రవారం ముగింపు ధర రూ.720.30తో పోలిస్తే, సోమవారం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు రూ.723.05 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక్కసారిగా రూ.739.75 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయానికి హెచ్​డీఎప్​సీ బ్యాంక్ షేరు ధర 1శాతం లాభంతో రూ. 728 వద్ద ట్రేడ్ అవుతోంది.

మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు బ్యాంక్ బలమైన ఆర్థిక పునాదులపై పూర్తి నమ్మకాన్ని ప్రదర్శించారు.

శశిధర్ జగదీశన్ నిష్క్రమణ.. కారణాలేంటి?

2026 అక్టోబర్ 26తో ముగియనున్న తన పదవీకాలాన్ని మరింత కాలం పొడిగించుకోవడానికి శశిధర్ జగదీశన్ ఆసక్తి చూపలేదని బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బ్యాంక్ పాలకమండలి ఆయనను పదవిలో కొనసాగమని కోరినప్పటికీ, ఆయన తన నిర్ణయానికే కట్టుబడ్డారని వివరించింది.

1996లో ఫైనాన్స్ డివిజన్ మేనేజర్‌గా హెచ్‌డీఎఫ్‌సీలో ప్రయాణం ప్రారంభించిన జగదీశన్, దాదాపు మూడు దశాబ్దాల కాలంలో వివిధ బాధ్యతలను నిర్వహించి సీఈఓ స్థాయికి ఎదిగారు. భారతదేశ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ విలీనంగా నిలిచిన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ - హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మెర్జర్​ని విజయవంతంగా పూర్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

తదుపరి సీఈఓ రేసులో ప్రముఖులు..

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కైజాద్ భరూచాతో పాటు వీ శ్రీనివాస రంగన్ పేర్లు సీఈఓ రేసులో ముందంజలో ఉన్నాయి. భరూచాకు బ్యాంకింగ్ రంగంలో 35 ఏళ్ల అనుభవం ఉంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బోర్డు ఒకటి కంటే ఎక్కువ పేర్లను పంపాల్సి ఉన్నందున, బయటి వ్యక్తులను కూడా పరిశీలించే అవకాశం ఉంది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేరు కొనవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరుపై విశ్లేషకులు సానుకూలంగా స్పందిస్తున్నారు.

"నాయకత్వ మార్పు బ్యాంక్‌ను చుట్టుముట్టిన అనుమానాలను పటాపంచలు చేయడానికి ఉపకరిస్తుంది. 2028 ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంక్ లాభదాయకత మరింత పుంజుకుంటుంది," అని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. బ్యాంక్ షేరుకు రూ.925 టార్గెట్ ప్రైస్ నిర్దేశిస్తూ ‘బై’ రేటింగ్ కొనసాగించింది.

కాంతిలాల్ ఛగన్‌లాల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వీపీ మహేష్ ఎం ఓజా స్పందిస్తూ.. "సుదీర్ఘకాల పెట్టుబడిదారులకు ఇది సరైన అవకాశం. బ్యాంక్ ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయి. ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా లేదా సిప్ రూపంలో షేర్లను కొనుగోలు చేయడం మంచిది," అని అభిప్రాయపడ్డారు.

భారత స్టాక్ మార్కెట్ సూచీలైన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటా చాలా ఎక్కువ. కాబట్టి ఈ షేరులో వచ్చే మార్పులు మొత్తం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు స్వల్పకాలిక హెచ్చుతగ్గులకు భయపడకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు సాగడం శ్రేయస్కరం అని నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks