...
...
Next Story

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్- 'హీ ఈజ్​ మై బాస్' అంటూ ప్రధాని మోదీ ప్రశంసలు!

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్న జరిగిన ఎన్నికలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నబిన్ రాకతో పార్టీలో నవశకం మొదలైందని, యువ ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆయనది కీలక పాత్ర అని, ఇక నుంచి ఆయనే తన బాస్​ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Published on: Jan 20, 2026, 13:26:29 IST
Advertisement

దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తి రేకెత్తిస్తూ.. బీజేపీ పగ్గాలను బిహార్‌కు చెందిన సీనియర్ నేత నితిన్ నబిన్ అందుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నబిన్ నియమితులయ్యారు. సోమవారం నామినేషన్ల ప్రక్రియలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన.. మంగళవారం దిల్లీలో ఆ బాధ్యతలను స్వీకరించారు.

ప్రధాని మోదీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబిన్​.. (HT Photo)
ప్రధాని మోదీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబిన్​.. (HT Photo)

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా నితిన్​ నబిన్​ (46) నిలిచిపోయారు.

ఇక నుంచి నబిన్​ నా బాస్​: మోదీ..

భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. నబిన్‌ను ఒక 'మిలీనియల్' నాయకుడిగా అభివర్ణించారు. భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగా మారుతున్న తీరును దగ్గరుండి చూసిన తరం చేతుల్లోకి పార్టీ వెళ్లడం గర్వకారణమని ఆయన ప్రశంసించారు.

"నితిన్ నబిన్ ఒక మిలీనియల్ నాయకుడు. చిన్నప్పుడు రేడియోలో వార్తలు విన్న తరం నుంచి వచ్చి.. నేడు ఏఐ టెక్నాలజీని అవలీలగా వాడే స్థాయికి ఎదిగిన తరానికి ఆయన ప్రతినిధి," అని మోదీ కొనియాడారు.

పార్టీని బలోపేతం చేయడంలో గత అధ్యక్షులు అమిత్ షా, జేపీ నడ్డా చేసిన కృషిని గుర్తు చేసుకున్న ప్రధాని.. ఇకపై పార్టీ వ్యవహారాల్లో నబిన్ తనకు 'బాస్' అని అన్నారు. కేవలం బీజేపీకే కాకుండా, ఎన్డీయే కూటమిలో సమన్వయం సాధించే బాధ్యత కూడా ఆయనపైనే ఉందని గుర్తుచేశారు.

క్షేత్రస్థాయి నుంచి శిఖరాగ్రానికి..

నితిన్ నబిన్ 1980లో బిహార్​ పట్నాలో జన్మించారు. ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)తో ప్రారంభించారు.

2000 సంవత్సరంలో తొలిసారిగా బిహార్ అసెంబ్లీకి ఎన్నికైన నబిన్, ప్రస్తుతం పట్నాలోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.

గతేడాది జరిగిన బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో.. రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన రేఖా కుమారిపై 51,000 ఓట్లకు పైగా మెజారిటీతో నితిన్​ నబిన్​ గెలుపొందారు.

బిహార్ గడ్డ నుంచి మరో జాతీయ నేత..

నబిన్ నియామకంపై బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ స్పందిస్తూ.. "బీజేపీ పుట్టిన తర్వాత జన్మించిన మొదటి జాతీయ అధ్యక్షుడు నబిన్. ఇది పార్టీలో కొత్త అధ్యాయం. ముఖ్యంగా యువ ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం" అని పేర్కొన్నారు.

బిహార్‌ నుంచి గతంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వంటి మహోన్నత నేతలు దేశానికి దిశానిర్దేశం చేశారని, ఇప్పుడు నబిన్ నియామకం ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తోందని ఎమ్మెల్సీ అనిల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు.

ఎప్పుడూ చిరునవ్వుతో, అందరికీ అందుబాటులో ఉండే నితిన్ నబిన్ నాయకత్వం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks