2026లో పెట్టుబడిని ఎలా ప్లాన్ చేయాలి? నిపుణులు సూచిస్తున్న బెస్ట్ పోర్ట్‌ఫోలియో ఇదే..
సంపద సృష్టిలో 'అసెట్ అలోకేషన్' (పెట్టుబడుల కేటాయింపు) ఎంత కీలకమో 2025 ఏడాది నిరూపించింది. కేవలం షేర్ మార్కెట్‌పైనే ఆధారపడకుండా బంగారం, వెండి వంటి ఇతర విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే లాభాలను విశ్లేషిస్తూ.. 2026లో రూ. 1 లక్షను ఎలా ఇన్వెస్ట్ చేయాలో నిపుణులు వివరిస్తున్నారు.
పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించాలంటే సరైన విభాగాల్లో డబ్బును కేటాయించడం చాలా ముఖ్యం. దీనికి 2025 ఏడాది ఒక చక్కని ఉదాహరణ. గత ఏడాది బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. కేవలం ఈక్విటీల (షేర్ మార్కెట్) పైనే మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు, ఈ విలువైన లోహాల ద్వారా వచ్చే భారీ లాభాలను అందిపుచ్చుకునే అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారు.

2025లో బంగారం, వెండి ధరలు గత 46ఏళ్లల్లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాయి. వెండి ఏకంగా 164%, బంగారం 73% లాభాలను అందించాయి. వీటితో పోలిస్తే స్టాక్ మార్కెట్ కీలక సూచి నిఫ్టీ50 అందించిన 10.5% లాభాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా స్మాల్-క్యాప్ షేర్లు నిరాశపరిచిన వేళ, బంగారం/వెండి లాభాలు ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను ఆదుకున్నాయి.
ఇప్పుడు 2026 ప్రారంభంలో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తిరిగి సమీక్షించుకునే అవకాశం వచ్చింది.
"మార్కెట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 2025లో బులియన్ (బంగారం, వెండి) జోరు చూశాము. అయితే 2026లో మళ్లీ ఈక్విటీలు పుంజుకునే అవకాశం ఉంది," అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ శేషాద్రి సేన్ మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు సమతుల్యత పాటిస్తూ, సరైన షేర్లను ఎంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ నేపథ్యంలో రూ. 1లక్ష నగదును ఇన్వెస్ట్ చేయాలంటే ఎందుకో పెట్టుబడి పెట్టాలి? ఏ స్ట్రాటజీని అనుసరించాలి? నిపుణుల సూచనలను ఇక్కడ తెలుసుకోండి..
రూ. 1 లక్షను 2026లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
లక్ష రూపాయల పెట్టుబడిని ఎలా విభజించాలో ముగ్గురు ప్రముఖ విశ్లేషకులు ఇచ్చిన సలహాలు ఇవే:
1. లార్జ్-క్యాప్ షేర్లకు పెద్దపీట:
స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ సంతోష్ మీనా ప్రకారం..
లార్జ్ క్యాప్ షేర్లు (45% - 60%): ఇవి మీ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని ఇస్తాయి. నిఫ్టీ50 30,000 పాయింట్ల దిశగా సాగుతున్న క్రమంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
మిడ్ అండ్ స్మాల్ క్యాప్ (30% - 40% | రూ. 30,000 – రూ. 40,000): 2025లో ఇవి ఒడిదుడుకులకు లోనవ్వడం వల్ల ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ పెట్టుబడికి అధిక లాభాలను (ఆల్ఫా) తెచ్చిపెట్టగలవు.
బంగారం అండ్ వెండి (10% - 15% | రూ. 10,000 – రూ. 15,000): మార్కెట్ అనిశ్చితి నుంచి రక్షణ పొందడానికి ఇవి అవసరం. వీటిని 'గోల్డ్ ఈటీఎఫ్' రూపంలో కొనడం ఉత్తమం.
2. రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా:
ఎంకే గ్లోబల్‌కి చెందిన ఎనలిస్ట్ శేషాద్రి సేన్ ప్రకారం..
మితమైన రిస్క్ తీసుకునేవారు: స్థిరత్వం కోసం లార్జ్-క్యాప్, మెరుగైన రిటర్నుల కోసం మిడ్, స్మాల్-క్యాప్ షేర్ల మిక్స్‌ని ఎంచుకోవాలి.
యువత/ఎక్కువ రిస్క్ తీసుకునేవారు: దూకుడుగా మిడ్, స్మాల్-క్యాప్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
రిస్క్ వద్దనుకునేవారు: లార్జ్-క్యాప్ షేర్లు, డెట్ ఇన్స్ట్రుమెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
3. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సులభంగా:
ఏంజెల్ వన్‌కి చెందిన సీనియర్ ఫండమెంటల్ ఎనలిస్ట్ వకార్‌జావేద్ ఖాన్.. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసే యువత కోసం ఈ కింది విభజనను సూచించారు:
రూ. 1లక్షని..
40% ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్
40% నిఫ్టీ-50 ఇండెక్స్ ఫండ్స్
10% గోల్డ్ ఈటీఎఫ్
10% డెట్ ఫండ్స్
"కొత్త పన్ను నిబంధనల (12.5% ఎల్టీసీజీ) వల్ల ఖర్చు స్వల్పంగా పెరిగినా, ఏడాది కంటే ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగించే వారికి ఈక్విటీలు ఇప్పటికీ లాభదాయకమే," అని ఆయన పేర్కొన్నారు. కొంచెం తక్కువ రిస్క్ కోరుకునే వారు డెట్ ఫండ్స్- గోల్డ్ ఈటీఎఫ్ వాటాను పెంచుకోవాలని ఆయన సూచించారు.
మాడరేట్ రిస్క్ తీసుకోవాలని అనుకునే వారు తమ మ్యూచువల్ ఫండ్స్‌లో 30శాతం ఫ్లెక్సీ క్యాప్, నిఫ్టీ50 ఇండెక్స్ ఫండ్స్, 25శాతం డెట్ ఫండ్స్, 15శాతం గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు అని వివరించారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


