...
...
Next Story

Hyderabad real estate : ఆరేళ్లలో 81% పెరిగిన ఇంటి ధరలు- కానీ తగ్గుతున్న నివాస స్థలం!

Hyderabad housing prices : హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ గత ఆరేళ్లలో ఊహించని రీతిలో పుంజుకుంది. 2019 నుంచి 2025 మధ్య సగటు ఇంటి ధరలు 81% పెరిగి చదరపు అడుగుకు రూ. 8,326 కు చేరుకున్నాయి. ధరలు పెరుగుతున్నా, అపార్ట్‌మెంట్ పరిమాణాలు మాత్రం తగ్గుముఖం పట్టడం గమనార్హం.

Published on: Apr 6, 2026, 11:20:39 IST
Advertisement

హైదరాబాద్‌లో సొంత ఇంటి కల సామాన్యుడికి మరింత భారంగా మారుతోంది. 'నోబ్రోకర్' విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. గత ఆరేళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏకంగా 81% ధరల వృద్ధిని నమోదు చేసింది. 2019లో ఉన్న ధరలతో పోలిస్తే, 2025 నాటికి సగటు చదరపు అడుగు ధర రూ. 8,326 కు చేరుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే 85% వృద్ధిని సాధించిన గురుగ్రామ్ తర్వాత.. అత్యంత వేగంగా ధరలు పెరిగిన నగరంగా హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.

హైదరాబాద్​ ఇళ్ల ధరలపై నివేదిక.. (Pexels )
హైదరాబాద్​ ఇళ్ల ధరలపై నివేదిక.. (Pexels )

అయితే ధరలు కొండెక్కి కూర్చున్నా, ఇళ్ల పరిమాణం మాత్రం 'ష్రింక్‌ఫ్లేషన్' వల్ల తగ్గుతోంది. హైదరాబాద్‌లో సగటు అపార్ట్‌మెంట్ సైజు 1,068 చదరపు అడుగుల నుంచి 1,025 చదరపు అడుగులకు (సుమారు 4శాతం) పడిపోయింది. ఇది ప్రధాన నగరాలన్నింటిలోనూ కనిపిస్తున్న ట్రెండ్ అని నివేదిక పేర్కొంది.

హైదరాబాద్​ రియల్​ ఎస్టేట్- మధ్యతరగతికి అందని ద్రాక్షగా కోటి రూపాయల ఇల్లు!

ధరల పెరుగుదల ప్రభావం కొనుగోలు శక్తిపై తీవ్రంగా పడింది. నగరంలోని దాదాపు 84శాతం మంది కొనుగోలుదారులు రూ. 1 కోటి లోపు ఇళ్ల కోసం వెతుకుతుండగా, మార్కెట్‌లో లభ్యత మాత్రం అందుకు భిన్నంగా ఉంది. దీనికి ప్రధాన కారణం సరఫరాలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు. డెవలపర్లు ఇప్పుడు ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులపైనే దృష్టి సారిస్తున్నారు. పెరిగిన భూమి ఖర్చులు, లగ్జరీ విభాగంలో వచ్చే అధిక లాభాల కారణంగా సరసమైన- మధ్య ఆదాయ వర్గాల ఇళ్ల సరఫరా తగ్గిపోయింది. దీనివల్ల కొనుగోలుదారులు కోరుకునే దానికి, మార్కెట్‌లో నిర్మిస్తున్న దానికి మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది.

హైదరాబాద్​ రియల్​ ఎస్టేట్​- రీసేల్ మార్కెట్ వైపు మళ్లుతున్న కొనుగోలుదారులు..

కొత్త లాంచ్‌లు అత్యంత ఖరీదైనవిగా మారుతుండటంతో, కొనుగోలుదారులు ఇప్పుడు హైదరాబాద్​లోని 'రీసేల్' మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ధరలు కొంత తక్కువగా ఉండటమే కాకుండా విభిన్న ధరల శ్రేణిలో ఇళ్లు అందుబాటులో ఉంటున్నాయి. మొదటిసారి ఇల్లు కొనేవారికి, మధ్య ఆదాయ వర్గాలకు రీసేల్ విభాగం ఇప్పుడు ఒక సమతుల్యమైన ప్రత్యామ్నాయంగా మారింది.

పశ్చిమ కారిడార్: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా ఉన్న తెల్లాపూర్, కోకాపేట, నియోపోలిస్, నార్సింగి, రాజేంద్రనగర్ ప్రాంతాలు కొత్త సరఫరాలో 25శాతం వాటాను కలిగి ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి వంటి చోట్ల ఖాళీ స్థలాలు లేకపోవడంతో డెవలప్‌మెంట్ అంతా ఈ పశ్చిమ శివార్లకు మళ్లింది. ఇక్కడి లగ్జరీ ట్రెండ్ పదేళ్ల క్రితం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తరహాలో వేగంగా వృద్ధి చెందుతోంది.

దక్షిణ హైదరాబాద్: ఎయిర్‌పోర్ట్ కారిడార్ ఇప్పుడు నగరంలోనే అతిపెద్ద కంట్రిబ్యూటర్‌గా అవతరించింది. మొత్తం కొత్త లాంచ్‌లలో 33% ఇక్కడే జరుగుతున్నాయి. తక్కువ ధరలో ఇళ్లు కోరుకునే ఐటీ నిపుణులకు ఇది కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్​ఆర్​) కనెక్టివిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సమీపంలో ఉండటం వల్ల ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు.

తూర్పు హైదరాబాద్: ఉప్పల్, ఎల్‌బీ నగర్ ప్రాంతాలు ఇప్పటికీ బడ్జెట్ ఇళ్ల కోటగా కొనసాగుతున్నాయి (13% వాటా). అయితే 2026లో ఇక్కడ వృద్ధి కొంత మందగించవచ్చని నివేదిక అంచనా వేసింది. అయినప్పటికీ, మెట్రో సౌకర్యం ఉండటంతో ఐటీ ఉద్యోగులు ఇక్కడ ఇల్లు కొనేందుకు ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. హైదరాబాద్‌లో గత ఆరేళ్లలో ఇంటి ధరలు ఎంత శాతం పెరిగాయి?

నోబ్రోకర్ నివేదిక ప్రకారం 2019 నుంచి 2025 మధ్య హైదరాబాద్‌లో సగటు ఇంటి ధరలు 81% మేర పెరిగాయి.

2. ధరలు పెరుగుతున్నా ఇళ్ల పరిమాణం తగ్గడానికి కారణం ఏంటి?

పెరిగిన భూమి ఖర్చులు, నిర్మాణ వ్యయాల వల్ల 'ష్రింక్‌ఫ్లేషన్' ప్రభావంతో సగటు అపార్ట్‌మెంట్ సైజు సుమారు 4% తగ్గింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe