Hyundai Bayon : మారుతీ సుజుకీ విక్టోరిస్కి పోటీగా హ్యుందాయ్ బేయాన్- ఎస్‌యూవీ హైలైట్స్ ఇవే..!
Hyundai Bayon 2026 : భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త సంచలనానికి తెరలేపబోతోంది. మారుతీ సుజుకీ విక్టోరిస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవుతో, మంచి బూట్ స్పేస్, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్లతో కూడిన 'బేయాన్' ఎస్‌యూవీని కొన్ని నెలల్లో లాంచ్ చేయనుంది.
భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీల ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో పట్టు సాధించేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రెండు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది. అందులో ఒకటి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాగా, మరొకటి గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న 'బేయాన్' క్రాస్ఓవర్ ఎస్‌యూవీ.

ఈ ఏడాది ఆఖరి నాటికి హ్యుందాయ్ బేయాన్ కారును అధికారికంగా పరిచయం చేసి, 2027 మొదటి త్రైమాసికంలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్కెట్లో ఇప్పుడిప్పుడే సంచలనం సృష్టిస్తున్న మారుతీ సుజుకీ ‘విక్టోరిస్’ ఎస్‌యూవీకి ఈ హ్యుందాయ్ బేయాన్ గట్టిపోటీ ఇస్తుంది.
కాగా, ఇటీవల భారతీయ రోడ్లపై ఈ కారును రహస్యంగా పరీక్షిస్తుండగా ఆటోమొబైల్ నిపుణుల కంట పడింది. ఫలితంగా అనేక కీలక విషయాలు అందుబాటులోకి వచ్చాయి.
వెన్యూకు, క్రెటాకు మధ్యలో సరికొత్త ప్లేస్మెంట్!
కంపెనీ అంతర్గతంగా 'BC4i' అనే కోడ్ నేమ్‌తో పిలుస్తున్న ఈ హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ దాదాపు 4.2 మీటర్ల పొడవును కలిగి ఉండనుంది. దీనివల్ల మార్కెట్లో 4 మీటర్ల లోపు ఉండే హ్యుందాయ్ 'వెన్యూ' కారుకు, 4.3 మీటర్ల పొడవుండే లగ్జరీ ఎస్‌యూవీ 'క్రెటా'కు మధ్యలో ఉన్న ధర- సైజ్ గ్యాప్‌ను ఇది సరిగ్గా భర్తీ చేయనుంది.
అయితే, రోడ్ టెస్టింగ్‌లో కనిపించిన వివరాల ప్రకారం.. మారుతీ విక్టోరిస్ కారుతో పోలిస్తే ఈ బేయాన్ ఎస్‌యూవీ కాస్త తక్కువ వీల్‌బేస్, చిన్న సైజ్ టైర్లతో కాంపాక్ట్‌గా కనిపిస్తోంది.
బాక్సీ లుక్.. అదిరిపోయే మోడ్రన్ డిజైన్!
సాధారణంగా క్రాస్ఓవర్ కార్లు అంటే రౌండ్ షేప్‌లో సాఫ్ట్ లుక్‌తో ఉంటాయి. కానీ హ్యుందాయ్ బేయాన్ విషయంలో కంపెనీ రూట్ మార్చింది. హ్యుందాయ్ సరికొత్త గ్లోబల్ డిజైన్ థీమ్ ఆధారంగా దీనిని మంచి ఎత్తుతో, బాక్సీ స్టాన్స్‌తో రగ్గడ్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. కారు ముందు భాగంలో స్ల్పిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది. అంటే, బోనెట్ కింది భాగంలో స్టైలిష్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, బంపర్‌లో ఐస్-క్యూబ్ ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు అమర్చారు. పక్క భాగంలో 16 అంగుళాల డైమండ్-కట్ అలాయ్ వీల్స్, పైన ఫంక్షనల్ రూఫ్ రైల్స్, వెనుక వైపు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యేలా ఉండే అద్భుతమైన ఎల్‌ఈడీ టైల్-లైట్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
క్యాబిన్ లోపల ఫీచర్ల జాతర.. సేఫ్టీలో లెవెల్ 2 అడాస్..
ఫీచర్ల విషయంలో హ్యుందాయ్ కార్లకు మంచి పేరుంది. బేయాన్ కారులో కూడా కస్టమర్లను ఆకట్టుకునేలా లగ్జరీ ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో ప్రయాణికుల వినోదం కోసం పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం పూర్తిగా డిజిటల్ కలర్ డిస్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. వీటన్నింటికీ మించి ప్రయాణికుల భద్రత కోసం అత్యంత ఆధునికమైన లెవెల్ 2 అడాస్ సాంకేతికతను ఇందులో జోడించారు. దీనివల్ల అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తాయి.
ఈ కారులో ఉన్న అత్యంత పెద్ద హైలైట్ ఏంటంటే.. 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండి, కంపెనీ నుంచే నేరుగా సీఎన్జీ ఆప్షన్‌తో వస్తున్న మొదటి హ్యుందాయ్ కారు ఇదే కానుంది. సాధారణంగా సీఎన్జీ కార్లలో బూట్ స్పేస్ ఉండదు. కానీ హ్యుందాయ్ ఇందులో సరికొత్త డ్యుయల్-సిలిండర్ టెక్నాలజీని వాడింది. దీనివల్ల రెండు చిన్న సిలిండర్లు డిక్కీ అడుగు భాగంలోకి వెళ్లిపోతాయి, ఫలితంగా లగేజీ పెట్టుకోవడానికి మంచి స్పేస్ దొరుకుతుంది.
ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.5 లీటర్ల న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 114 బీహెచ్పీ, 144 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. దీంతో పాటు హ్యుందాయ్ సంస్థ సరికొత్తగా అభివృద్ధి చేస్తున్న 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఈ బేయాన్ క్రాస్ఓవర్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మైలేజ్, పర్ఫార్మెన్స్ పరంగా ఈ కారు ఇండియన్ మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


