కొంపముంచిన ఉద్యోగులు- IDFC Fist Bank షేర్లు ఢమాల్​- ఇన్వెస్టర్లకు కోట్లల్లో నష్టం!

చండీగఢ్ బ్రాంచ్‌లో రూ. 590 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వెల్లడించిన అనంతరం, సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఆ బ్యాంకు షేర్లు 20శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. కొందరు ఉద్యోగులు చేసిన ఈ ఫ్రాడ్​ వల్ల ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు తలెత్తాయి.

Published on: Feb 23, 2026, 10:30:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేర్లు ఎందుకు పడుతున్నాయి?
ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేర్లు ఎందుకు పడుతున్నాయి?

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. ఒకానొక సందర్భంలో ఈ స్టాక్​ బీఎస్​ఈలో 20శాతం లోయర్​ సర్క్యూట్​ని సైతం హిట్​ చేసింది. చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో సుమారు రూ. 590 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్లు బ్యాంకు చేసిన ప్రకటన తర్వాత ఈ అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే 10శాతం నష్టంతో మొదలైన షేరు, ఆ తర్వాత ఏమాత్రం కోలుకోకుండా రోజువారీ కనిష్ట స్థాయి రూ. 66.80కి పడిపోయింది.

అనంతరం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేరు ధర 16.6శాతం నష్టాలతో రూ. 69.6 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ షేర్ ధర ఎందుకు పడిపోతోంది?

బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, హరియాణా ప్రభుత్వానికి చెందిన ఒక విభాగం తమ ఖాతాను మూసివేసి నిధులను మరో బ్యాంకుకు బదిలీ చేయాలని కోరినప్పుడు ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రక్రియలో, ప్రభుత్వ అభ్యర్థనలో పేర్కొన్న మొత్తానికి, ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌కు మధ్య భారీ వ్యత్యాసాలను బ్యాంకు గమనించింది. దీనితో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ ఉన్నతాధికారులు లోతైన సమీక్షను ప్రారంభించారు.

బ్యాంకులోని కొందరు ఉద్యోగులు మోసానికి పాల్పడినట్టు తేలింది.

"చండీగఢ్‌లోని సదరు బ్రాంచ్‌లో గుర్తించిన ఖాతాల్లో రికన్సిలియేషన్ (సరిపోల్చాల్సిన) మొత్తం సుమారు రూ. 590 కోట్లుగా ఉంది. దీని ప్రభావం ఎంత అనేది మరిన్ని వివరాలు అందిన తర్వాత, క్లెయిమ్‌ల నిర్ధారణ, ఇతర బ్యాంకుల్లో ఉన్న మోసపూరిత బెనిఫిషియరీ ఖాతాలను సీజ్ చేయడం ద్వారా వచ్చే రికవరీలు, ఈ మోసంలో పాల్గొన్న ఇతర సంస్థల బాధ్యతలపై ఆధారపడి ఉంటుంది," అని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

అనంతరం ఈ బ్యాంకు అంతర్గత సేఫ్టీపై ప్రశ్నలు తలెత్తాయి. దాని ప్రభావమే ఈరోజు షేరు ధరపై పడింది.

హరియాణా ప్రభుత్వం డీ-ఎంపానెల్‌మెంట్..

ఈ మోసం బయటపడిన తర్వాత, హరియాణా ప్రభుత్వం ఆదివారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్​లను ప్రభుత్వ వ్యాపారాలను నిర్వహించకుండా తక్షణమే డీ-ఎంపానెల్ చేసింది.

హరియాణా ఆర్థిక శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ బ్యాంకుల్లో ఎలాంటి ప్రభుత్వ నిధులను డిపాజిట్ చేయడం, పెట్టుబడి పెట్టడం లేదా లావాదేవీలు నిర్వహించడం చేయకూడదు.

ఖాతాల మూసివేత: అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ రెండు బ్యాంకుల్లో ఉన్న తమ ఖాతాలను వెంటనే మూసివేసి, బ్యాలెన్స్‌ను ఇతర బ్యాంకులకు బదిలీ చేయాలని ఆదేశించింది.

వడ్డీ నష్టంపై ఆగ్రహం: ఫ్లెక్సిబుల్ లేదా అధిక వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్​డీ) కోసం కేటాయించిన నిధులను, నిబంధనలకు విరుద్ధంగా తక్కువ వడ్డీ వచ్చే సేవింగ్స్ ఖాతాల్లో ఉంచడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆర్థిక శాఖ ఆరోపిస్తోంది.

గడువు: అన్ని శాఖలు నెలవారీగా ఖాతాలను సరిపోల్చుకోవాలని, మార్చి 31, 2026 నాటికి అన్ని రికన్సిలియేషన్లు పూర్తి చేసి, ఏప్రిల్ 4, 2026 నాటికి తుది నివేదికను సమర్పించాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది.

బ్యాంకు మోసం: ఇప్పటివరకు తెలిసిన వివరాలు..

చండీగఢ్ బ్రాంచ్‌లోని కొందరు ఉద్యోగులు హరియాణా ప్రభుత్వానికి చెందిన కొన్ని నిర్దిష్ట ఖాతాల్లో ఈ అనధికారిక, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు బ్యాంకు ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో బయటి వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 18 నుంచి ఇలాంటి వ్యత్యాసాలే ఇతర ప్రభుత్వ ఖాతాల్లోనూ కనిపించాయి.

సస్పెన్షన్: ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగురు బ్యాంకు అధికారులను సస్పెండ్ చేశారు. వారిపై కఠినమైన క్రమశిక్షణా, సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బ్యాంకు తెలిపింది.

ఫోరెన్సిక్ ఆడిట్: ఈ కేసును పర్యవేక్షించేందుకు ఫిబ్రవరి 20, 2026న బోర్డు ప్రత్యేక కమిటీ సమావేశమైంది. ఒక స్వతంత్ర బాహ్య సంస్థ ద్వారా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే ప్రక్రియలో బ్యాంకు ఉంది.

రికవరీ: ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఇతర బ్యాంకుల్లోని అనుమానిత ఖాతాలపై నిఘా ఉంచాలని కోరారు. అయితే, ఈ సమస్య కేవలం చండీగఢ్ బ్రాంచ్‌లోని కొన్ని ప్రభుత్వ ఖాతాలకు మాత్రమే పరిమితమని, ఇతర సాధారణ కస్టమర్లపై దీని ప్రభావం ఉండదని బ్యాంకు హామీ ఇచ్చింది.

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేరు ధర వివరలు..

బ్యాంక్​ నిఫ్టీ, పీఎస్​యూ బ్యాంకింగ్​ ఇండెక్స్​ విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఇటీవలి కాలంలో ఒత్తిడిలోనే ఉన్నాయి. ఈ స్టాక్​ గత నెల రోజుల్లో 10శాతం, గత మూడు నెలల్లో 4శాతం నష్టపోయాయి. అయితే, గత ఏడాది కాలంలో 24శాతం, గత ఆరు నెలల్లో 8% వృద్ధిని సాధించాయి. ప్రస్తుతం ఈ షేరు జనవరి 2026లో తాకిన రూ. 87 (52 వారాల గరిష్ట స్థాయి) నుంచి దాదాపు 12-13శాతం పైగా పడిపోయింది. గత ఏప్రిల్‌లో ఈ షేరు రూ. 52.50 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది.

ఏదేమైనా.. బ్యాంకులోని కొందరు ఉద్యోగులు చేసిన మోసం కారణంగా.. ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంకులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు నేడు భారీ నష్టాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More