...
...
Next Story

Rain alert : దక్షిణాదికి భారీ వర్ష సూచన.. ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్!

బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీని ప్రభావంతో కేరళ, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Published on: Oct 23, 2026, 06:45:27 IST
Advertisement

బంగాళాఖాతం వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అండమాన్ సముద్రం మీదుగా దూసుకొస్తున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ అల్పపీడనం క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తూ మరింత బలపడే అవకాశం ఉండటంతో దక్షిణాది రాష్ట్రాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుందని అభిప్రాయపడింది.

చెన్నై వర్షాల వేళ తీసిన ఫొటో..
చెన్నై వర్షాల వేళ తీసిన ఫొటో..

ప్రత్యేకించి తమిళనాడు, కేరళ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ రాబోయే రోజుల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఈదురు గాలుల వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది.

కేరళ, తమిళనాడు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్..

వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఏకంగా 115.6 ఎంఎం నుంచి 204.4 ఎంఎం వరకు అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ కుండపోత వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడమే కాకుండా, రహదారులపై నీరు చేరి రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో ఇటీవలి కాలంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అక్కడ వరద తరహా పరిస్థితులు కనిపించాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో స్కూళ్లు సైతం మూతపడ్డాయి. అయితే వర్షాకాలంలో సరిగ్గా వర్షాలు పడకపోవడంతో తాజా వానలతో నగరవాసులు ఉపశమనం పొందారు.

మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ 64.5 ఎంఎం నుంచి 115.5 ఎంఎం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.

బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేర్వేరు వాతావరణ పరిస్థితులు..!

మరోవైపు, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన మరో అల్పపీడనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి అత్యంత క్రియాశీలకంగా ఉంది. ఇది క్రమంగా సోమాలియా తీరం వైపు పయనిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులు.. మత్స్యకారులకు హెచ్చరిక

ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

సముద్రం తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. కేరళ తీరం, లక్షద్వీప్, మన్నార్ సింధుశాఖ, కొమరిన్ ప్రాంతాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో జడిగాలులు వీచే అవకాశం ఉంది.

వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావం.. ఉష్ణోగ్రతల్లో మార్పులు

దక్షిణాదిన వర్షాలు ముసురుకుంటుండగా, వాయవ్య భారతదేశంలో అక్టోబర్ 24 నుంచి కొత్తగా 'వెస్ట్రన్ డిస్టర్బెన్స్' ప్రభావం ప్రారంభం కానుంది. దీనివల్ల ఉత్తరాది పర్వత ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉండగా, మైదాన ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

దేశవ్యాప్త ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అత్యధికంగా 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో కనిష్ఠంగా 11.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ప్రజలు, రైతులకు సూచనలు..

పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్ష సూచన ఉన్నందున కోతలు పూర్తి చేసుకున్న రైతులు తమ ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పొలాల్లో నీరు నిలవకుండా నీటి పారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks