Best selling cars : పండుగకు కొత్త కారు కొనాలా? ఏ బ్రాండ్ ఎంచుకోవాలి? ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఇవే..
వాహన్ రిజిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం 2026 సెప్టెంబర్‌లో దేశంలో కార్ల విక్రయాలు 31.8 శాతం పుంజుకున్నాయి. టాటా మోటార్స్‌ను అధిగమించి మహీంద్రా రెండో స్థానానికి చేరుకోగా, మారుతీ సుజుకీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
భారత ప్యాసింజర్ వాహన మార్కెట్ పండగల సీజన్‌కు ముందే భారీ పురోగతిని నమోదు చేసింది! ‘వాహన్’ రిజిస్ట్రేషన్ల గణాంకాల ప్రకారం.. దేశంలోని అగ్రగామి 15 కార్ల తయారీ కంపెనీలు 2026 సెప్టెంబర్ నెలలో మొత్తంగా 4,20,359 యూనిట్లను విక్రయించాయి. గతేడాది (2025) సెప్టెంబర్‌లో నమోదైన 3,18,907 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 31.8 శాతం వార్షిక వృద్ధి కావడం విశేషం. ఇక ఆగస్టు నెలలోని 4,09,528 యూనిట్లతో పోల్చి చూస్తే నెలవారీగా 2.6 శాతం పురోగతి కనిపించింది.

ఈ సెప్టెంబర్ విక్రయాల రేసులో మహీంద్రా అద్భుత ప్రదర్శన కనబరిచి, ప్రముఖ స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది!
ఈ పండుగ సీజన్లో మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తూ, ఏ బ్రాండ్ ఎంచుకోవాలని ఆలోచిస్తుంటే ఇది మీకోసమే! ఇండియాలో టాప్ ఆటోమొబైల్ బ్రాండ్స్‌ని ఇక్కడ చూసేయండి..
మారుతీ సుజుకీ తిరుగులేని ఆధిపత్యం..
ఎప్పటిలాగే దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రథమ స్థానంలో నిలిచింది. కంపెనీ గత నెలలో దేశీయంగా 1,69,826 యూనిట్ల విక్రయాలను సాధించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన 1,30,533 యూనిట్లతో పోలిస్తే ఇది 30.1 శాతం వృద్ధి. మొత్తం భారత మార్కెట్‌లో మారుతీ సుజుకీ ఏకంగా 40.4 శాతం వాటాను కలిగి ఉంది. ఆగస్టు నెల విక్రయాలతో (1,69,756 యూనిట్లు) పోలిస్తే కేవలం 70 యూనిట్ల స్వల్ప తేడాతో విక్రయాలు స్థిరంగా కొనసాగాయి.
రెండో స్థానం కోసం మహీంద్రా - టాటా తీవ్ర పోటీ
రెండో స్థానం కోసం జరిగిన పోరు తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. మహీంద్రా అండ్ మహీంద్రా వార్షికంగా 35.5 శాతం వృద్ధితో 57,817 యూనిట్లను విక్రయించి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆగస్టుతో పోలిస్తే మహీంద్రా అమ్మకాలు 7.8 శాతం పెరగ్గా, మార్కెట్ వాటా 13.8 శాతానికి చేరింది.
మరొకవైపు టాటా మోటార్స్ 56,156 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానానికి పడిపోయింది. గతేడాదితో పోలిస్తే టాటా విక్రయాలు 28.1 శాతం పెరిగినప్పటికీ, ఆగస్టు నెలలోని 58,045 యూనిట్లతో పోలిస్తే 3.3 శాతం క్షీణత నమోదు చేసింది. ఫలితంగా మహీంద్రా, టాటా కంపెనీల మధ్య వ్యత్యాసం కేవలం 1,661 యూనిట్లుగానే ఉండటం గమనార్హం.
హుందాయ్ సహా ఇతర బ్రాండ్ల పనితీరు
హుందాయ్ మోటార్ ఇండియా 50,201 యూనిట్లతో అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను నమోదు చేస్తూ నాల్గొవ స్థానంలో నిలిచింది. ఇది వార్షికంగా 31.5 శాతం, నెలవారీగా 4.4 శాతం వృద్ధి. హుందాయ్ మార్కెట్ వాటా 11.9 శాతంగా ఉంది.
మిగతా ప్రముఖ బ్రాండ్ల విక్రయాల వివరాలు..
టయోటా: 28,212 యూనిట్లు (21.4% వార్షిక వృద్ధి)
కియా: 26,668 యూనిట్లు (45.9% వార్షిక వృద్ధి)
స్కోడా అండ్ వోక్స్‌వ్యాగన్: 8,468 యూనిట్లు (13.8% వార్షిక వృద్ధి)
ఎంజీ : 6,475 యూనిట్లు
హోండా: 5,283 యూనిట్లు (42.5% వార్షిక వృద్ధి)
రెనాల్ట్: 3,411 యూనిట్లు (33.1% వార్షిక వృద్ధి)
నిస్సాన్: 2,967 యూనిట్లు
ఈబ్రాండ్లతో పాటు వియత్నాంకు చెందిన విద్యుత్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ అనూహ్యంగా 2,964 యూనిట్లను నమోదు చేసి భారీ వృద్ధిని కనబరిచింది. బీవైడీ 836 యూనిట్లు, సిట్రోయెన్ 803 యూనిట్లు, జీప్ 272 యూనిట్లను విక్రయించి టాప్ 15 జాబితాలో నిలిచాయి.
టాప్ 6 దిగ్గజాలదే ఆధిపత్యం!
మొత్తం కార్ల విక్రయాలలో మొదటి 6 స్థానాల్లో ఉన్న కంపెనీలే (మారుతీ, మహీంద్రా, టాటా, హుందాయ్, టయోటా, కియా) 3,88,880 యూనిట్ల వాటాను కలిగి ఉన్నాయి. అంటే టాప్ 15 కంపెనీల మొత్తం విక్రయాల్లో ఏకంగా 92.5 శాతం వాటా ఈ ఆరు కంపెనీలదే కావడం విశేషం. మిగిలిన 9 కంపెనీలు కలిసి కేవలం 31,479 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగాయి!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


