...
...
Next Story

భారత్-ఈయూ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఖరారు: త్వరలోనే సంతకాలు

భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఇరు పక్షాలకు మేలు చేసేలా ఈ డీల్ ఖరారైందని, త్వరలోనే అధికారికంగా సంతకాలు జరుగుతాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. ఇది ఇరు దేశాల ఆర్థిక సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలకనుంది.

Published on: Jan 26, 2026 08:14 PM IST
Advertisement

భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఇరు పక్షాల మధ్య చర్చలు విజయవంతంగా ముగిశాయని, ఒప్పందం దాదాపు ఖరారైందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం ప్రకటించారు.

వ్యాపార సామ్రాజ్యానికి కొత్త ఊపు

ఈయూ కమిషన్ అధ్యక్షురాలికి స్వాగతం పలుకుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Photo: PMO)
ఈయూ కమిషన్ అధ్యక్షురాలికి స్వాగతం పలుకుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Photo: PMO)

"చర్చలు సఫలమయ్యాయి.. డీల్ ఫైనల్ అయింది. భారత కోణంలో చూస్తే ఇది ఎంతో సమతుల్యమైన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఒప్పందం. దీనివల్ల యూరోపియన్ దేశాలతో మన ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం అవుతుంది" అని రాజేష్ అగర్వాల్ వివరించారు. ప్రస్తుతం ఈ ఒప్పంద పత్రానికి సంబంధించిన న్యాయపరమైన అంశాల పరిశీలన (Legal scrubbing) జరుగుతోందని, ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఒప్పందంపై సంతకాలు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ద్వారా ఇరు ఆర్థిక వ్యవస్థల్లో పెట్టుబడులు వెల్లువెత్తడమే కాకుండా, వాణిజ్య రంగానికి భారీగా ఊతం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా అధికారికంగా సంతకాలు పూర్తయితే, వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ ఒప్పందం అమలులోకి వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

భారత గణతంత్ర వేడుకల్లో ‘ఈయూ’ సందడి

మరోవైపు, భారత్-ఈయూ మధ్య బంధం కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా రక్షణ, భద్రతా రంగాల్లోనూ విస్తరిస్తోంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరవడం విశేషం.

సమ్మిట్‌లో భాగంగా మంగళవారం భారత్-ఈయూ మధ్య రక్షణ, భద్రతా భాగస్వామ్యంపై సంతకాలు జరగనున్నాయి. దీని ద్వారా సైబర్ భద్రత, సముద్ర భద్రత (Maritime security), ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్యటనపై స్పందిస్తూ.. యూరోపియన్ దేశాల నేతలకు ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గౌరవమని, ఈ పర్యటన భారత్-ఈయూ భాగస్వామ్య బలాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందని అన్నారు. 2026 గణతంత్ర వేడుకలు కేవలం ఉత్సవాలుగా మాత్రమే కాకుండా భారత్, యూరప్ దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక బంధాన్ని పటిష్టం చేసిన మైలురాయిగా నిలిచిపోనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe