...
...
Next Story

India monsoon : పుంజుకున్న రుతుపవనాలు- ఇక దేశవ్యాప్తంగా భారీ వర్షాలు!

IMD rain alerts : కొద్దిరోజుల విరామం తర్వాత దేశంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ అత్యంత వేగంగా పుంజుకున్నాయి. భారత్‌ను దట్టమైన మేఘాలు కప్పేసిన దృశ్యాలను ఇస్రో ఉపగ్రహం INSAT-3DS చిత్రీకరించింది. పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల అలర్ట్ జారీ చేసింది.

Published on: Jul 23, 2026, 05:28:35 IST
Advertisement

దేశంలో అనేక రోజుల పాటు నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి నాడి లాంటి వర్షాకాలం సంపూర్ణ బలంతో పుంజుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అత్యంత అధునాతన 'INSAT-3DS' వాతావరణ ఉపగ్రహం పంపిన తాజా చిత్రాల ప్రకారం.. దాదాపు దేశం మొత్తాన్ని దట్టమైన మేఘాలు కప్పేశాయి.

అమృత్​సర్ గోల్డెన్ టెంపుల్​ని కప్పేసిన మేఘాలు.. (PTI)
అమృత్​సర్ గోల్డెన్ టెంపుల్​ని కప్పేసిన మేఘాలు.. (PTI)

“ఈ నేపథ్యంలో రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు వాయువ్య, మధ్య, ఉత్తర ద్వీపకల్ప భారత్‌తో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు అత్యంత చురుగ్గా ఉంటాయి,” అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.

ఉపగ్రహం పంపిన 'థర్మల్ ఇన్‌ఫ్రారెడ్' ఇమేజ్ ప్రకారం.. ఉత్తర బెంగాల్ ఖాతం నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా గుజరాత్, అరేబియా సముద్రం వరకు వర్షపు మేఘాలు విల్లు ఆకారంలో విస్తరించి ఉన్నాయి.

మేఘాల సాంద్రతపై ఐఎండీ విశ్లేషణ..

శాటిలైట్ చిత్రాలలోని వర్ణాలను వివరిస్తూ ఐఎండీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మేఘాలలో ఉన్న నీటి బిందువులు, మంచు స్పటికాల సాంద్రతను బట్టి అవి ప్రతిబింబించే తీరు మారుతుందని తెలిపింది. వీటిలో అత్యంత ఎత్తులో ఉండే, తీవ్రమైన వర్షాన్నిచ్చే క్యుములోనింబస్ మేఘాలు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. తక్కువ, మధ్యస్థ ఎత్తులో ఉండే మేఘాలు కూడా కాంతివంతంగానే ఉన్నప్పటికీ, పలుచని మేఘాలు కాస్త మసకగా కనిపిస్తాయని నిపుణులు వివరించారు.

రాబోయే రోజుల్లో అతి భారీ వర్షాలు..

జులై 24 వరకు దేశవ్యాప్తంగా విస్తారంగా, అత్యంత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భారతదేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 75 శాతం కేవలం నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. తాగునీరు, సాగునీటితో పాటు జలవిద్యుత్ ఉత్పత్తికి కూడా ఈ వర్షాలే ప్రధాన ఆధారం. సాధారణంగా జూన్ ప్రారంభంలో కేరళను తాకే రుతుపవనాలు, జులై సగం నాటికి దేశమంతటికీ విస్తరిస్తాయి.

వరి, ప్రత్తి, చెరకు వంటి ప్రధాన ఖరీఫ్ పంటలకు ఈ వర్షాలు అత్యంత కీలకం. రుతుపవనాల్లో ఏమాత్రం ఆలస్యం జరిగినా లేదా వర్షాలు తగ్గినా ఆహార భద్రతతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది.

రైతులకు ఐఎండీ కీలక సూచనలు..

భారీ వర్షాల దృష్ట్యా వాతావరణ శాఖ రైతులకు పలు ముందస్తు జాగ్రత్తలు సూచించింది:

వాతావరణం అనుకూలించే వరకు జమ్ముకశ్మీర్ పరిధిలో మినుము, పెసర వంటి ఖరీఫ్ పప్పుధాన్యాల విత్తనాలు వేయకూడదు.

పంజాబ్‌లో భారీ వర్షాలు కురిసే సమయంలో పెసర విత్తనాలు వేయడం ఆపేయాలని సూచించింది.

వరి, జొన్న, సోయాబీన్, కంది, వేరుశనగ పంట పొలాలతో పాటు పండ్ల తోటల్లో నీరు నిల్వ ఉండకుండా, సరైన డ్రైనేజీ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks