...
...
Next Story

రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి.. మరోసారి వడ్డీ రేట్లు పెంచక తప్పదా?

అక్టోబర్‌లో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి ఎగబాకి, ఆర్‌బీఐ గరిష్ఠ పరిమితిని దాటేసింది. ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటి నిత్యావసరాల ధరలు పెరగడమే ఇందుకు కారణం. దీంతో డిసెంబర్‌లో ఆర్‌బీఐ మరోసారి రెపో రేటు పెంచే అవకాశాలు బలపడ్డాయి.

Published on: Nov 12, 2026, 16:38:42 IST
Advertisement

న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరలు భగ్గుమనడంతో అక్టోబర్‌లో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి ఎగబాకింది. కొత్త సీపీఐ (వినియోగదారుల ధరల సూచీ) సిరీస్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించుకున్న 6 శాతం గరిష్ఠ పరిమితిని ద్రవ్యోల్బణం దాటడం ఇదే తొలిసారి. సెప్టెంబర్‌లో 5.54 శాతంగా ఉన్న ధరల పెరుగుదల, అక్టోబర్‌లో 5.93 శాతానికి పరిమితమవుతుందని రాయిటర్స్ సర్వేలో ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ద్రవ్యోల్బణం 6 శాతం మార్కును దాటేసింది.

రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి.. మరోసారి వడ్డీ రేట్లు పెంచక తప్పదా?
రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి.. మరోసారి వడ్డీ రేట్లు పెంచక తప్పదా?

ఆర్‌బీఐ మధ్యకాలిక ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతం కాగా, 2 నుంచి 6 శాతం మధ్య ఉండటాన్ని సాధారణ పరిమితిగా పరిగణిస్తారు. వరుసగా ఐదో నెలలోనూ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే ఎక్కువగానే కొనసాగింది. గతంలో 2012 ఆధార సంవత్సరంగా ఉన్న పాత సీపీఐ సిరీస్ ప్రకారం 2024 అక్టోబర్‌లో చివరిసారిగా ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరింది. రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయికి చేరుకోవడం గమనార్హం.

ఆహార, రవాణా ధరల భారం

దేశ వినియోగదారుల ధరల సూచీలో దాదాపు 40 శాతం వాటా ఆహార పదార్థాలదే. అక్టోబర్‌లో ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటి నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం 8.94 శాతానికి దూసుకెళ్లింది. సెప్టెంబర్‌లో ఇది 7.74 శాతంగానే ఉంది. మరోవైపు రవాణా రంగ ద్రవ్యోల్బణం కూడా నెల వ్యవధిలో 5.01 శాతం నుంచి 5.84 శాతానికి పెరిగింది.

అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం కాస్త ఊరటనిస్తోంది. హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడుల భయాలు ఉన్నప్పటికీ, అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్‌కు 92 డాలర్ల వద్దకు దిగివచ్చింది.

ఆర్‌బీఐ అంచనాలు.. ఎల్‌నినో ముప్పు

ప్రస్తుత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం సగటున 6 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ద్రవ్యోల్బణ అంచనాను 5 శాతం నుంచి 5.2 శాతానికి సవరించింది. బలహీన రుతుపవనాలు, తీవ్రమైన ఎల్‌నినో పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగం, గ్రామీణ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే ముప్పుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వ వద్ద సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉండటం, ప్రభుత్వ చర్యలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మళ్లీ వడ్డీ రేట్ల పెంపు తప్పదా? ఆర్థికవేత్తల విశ్లేషణ

తాజా గణాంకాల నేపథ్యంలో రాబోయే నెలల్లో ఆర్‌బీఐ మరోసారి వడ్డీ రేట్లు పెంచడం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. "ఇంధన, ముడిసరుకుల ధరల భారం కోర్ ద్రవ్యోల్బణానికి పాకుతోంది. జలాశయాల్లో నీటిమట్టాలు తక్కువగా ఉండటం రబీ పంటలపై ప్రభావం చూపి, ఆహార ధరలు మరింత పెరిగే ప్రమాదముంది. రాబోయే కొన్ని నెలల పాటు ద్రవ్యోల్బణం 6 శాతం పైనే కొనసాగవచ్చు. ముడిచమురు ధరల తగ్గుదల, రూపాయి బలపడటం ఆర్‌బీఐకి కొంత వెసులుబాటు కల్పించినా, మరో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పెంపును మేవ అంచనా వేస్తున్నాం" అని ముంబైకి చెందిన 360 వన్ అసెట్ సీనియర్ ఎకనామిస్ట్ విక్రమ్ ఛాబ్రా పేర్కొన్నారు.

"బంగారం, వెండి ధరలు ఆశించిన స్థాయిలో తగ్గకపోవడం వల్ల కోర్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. ఆర్థిక వృద్ధి బలంగా ఉన్న నేపథ్యంలో ధరల ఒత్తిడి విస్తరిస్తున్నందున, తదుపరి రెండు సమావేశాల్లో ఆర్‌బీఐ మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచి, గరిష్ఠ రేటును 6 శాతానికి తీసుకెళ్లే అవకాశం ఉంది" అని నిర్మల్ బాంగ్ లీడ్ ఎకనామిస్ట్ థెరెసా జాన్ అభిప్రాయపడ్డారు.

"వస్త్రాల ధరల్లో సీజనల్ పెరుగుదల, కార్ల ధరలు పెరగడం, అంతర్జాతీయ ఒడిదొడుకుల ప్రభావం అక్టోబర్ ద్రవ్యోల్బణంలో స్పష్టంగా కనిపిస్తోంది. 2027 జూన్ వరకు ద్రవ్యోల్బణం 6 శాతం పైనే నమోదయ్యే సూచనలు ఉన్నాయి" అని యాక్సిస్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తనయ్ దలాల్ విశ్లేషించారు.

"పశ్చిమాసియాలో శాంతి ఆశలతో ముడిచమురు ధరలు తగ్గినా, గతంలో పెరిగిన ధరల ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున ద్రవ్యోల్బణం వెంటనే తగ్గదు. రాబోయే 6 నుంచి 9 నెలల్లో ఆర్‌బీఐ మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచవచ్చు" అని ఎలారా సెక్యూరిటీస్ డిప్యూటీ హెడ్ ఆఫ్ రీసెర్చ్ గరిమా కపూర్ అంచనా వేశారు.

"రెండేళ్ల గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ఠ స్థాయిని తాకలేదు. ప్రతికూల బేస్ ఎఫెక్ట్ తోడవడంతో ఆర్‌బీఐ తన త్రైమాసిక అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది. డిసెంబర్‌లో వరుసగా రెండోసారి వడ్డీ రేటు పెంపు ఉంటుందన్న మా అంచనాకు ఈ గణాంకాలు మరింత బలం చేకూరుస్తున్నాయి" అని సింగపూర్‌లోని డీబీఎస్ బ్యాంక్ సీనియర్ ఎకనామిస్ట్ రాధికా రావు వివరించారు.

"చమురు సంస్థల లాభాలు మెరుగుపడటం, ముడిచమురు ధరలు తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే సవరించాల్సిన అవసరం తగ్గింది. అయినా ఆహార ధరల ఒత్తిడి తీవ్రమవుతోంది. ఫలితంగా డిసెంబర్, ఫిబ్రవరి నెలల్లో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచవచ్చు. ఆ తర్వాత వినియోగదారుల డిమాండ్ నెమ్మదించి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది" అని లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ లీడ్ ఎకనామిస్ట్ అలెగ్జాండ్రా హెర్మన్ ప్రసాద్ తెలిపారు.

మొత్తానికి ఆహార ధరల సెగ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు సామాన్యుడి ఇంటి బడ్జెట్‌పై భారం తప్పదు. మరోవైపు ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తే గృహ, వాహన రుణాల ఈఎంఐలు మరింత పెరిగే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks