పేషెంట్‌తో లైంగిక సంబంధం.. టాప్ న్యూరోసర్జన్ పై సస్పెన్షన్ వేటు

బ్రిటన్‌లోని భారత సంతతి డాక్టర్, టాప్ న్యూరోసర్జన్ తన హోదాను అడ్డుపెట్టుకుని చేసిన అకృత్యాలు ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఎనిమిది నెలల పాటు సస్పెన్షన్ విధిస్తూ ట్రిబ్యునల్ సంచలన తీర్పునిచ్చింది.

Published on: May 27, 2026, 07:47:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైద్యుడిని దైవంగా భావించే సమాజంలో ఒక సీనియర్ న్యూరోసర్జన్ ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్శిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్‌లో పనిచేస్తున్న డాక్టర్ చిరాగ్ పటేల్, తన వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించారు. వెన్నెముక సమస్యతో తన వద్దకు వచ్చిన ఒక నిస్సహాయురాలైన (Vulnerable) మహిళను లొంగదీసుకుని, నాలుగేళ్ల పాటు ఆ బంధాన్ని కొనసాగించిన వైనం బయటపడింది.

డాక్టర్ చిరాగ్ పటేల్
డాక్టర్ చిరాగ్ పటేల్

ఆపరేషన్ గదిలో మొదలై.. బెడ్‌రూమ్ వరకు

ఈ వ్యవహారం 2019లో మొదలైంది. బాధితురాలికి వెన్నెముక శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చిరాగ్, ఆ సమయంలోనే ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. అప్పటి నుంచి 2023 వరకు వీరి మధ్య శృంగార సంబంధం కొనసాగింది. ఆమెకు అసభ్యకరమైన చిత్రాలు పంపడం, వైద్య నియమాలకు విరుద్ధంగా ఆమెకు వ్యసనపరుడయ్యే మత్తు మందులను (Addictive Drugs) రాసివ్వడం వంటి ఘోరాలకు పాల్పడ్డారు. చివరికి వీరి మధ్య గొడవలు మొదలై, ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ బండారం బయటపడింది.

"సంసారంలో గొడవలే కారణం" అంటూ వింత వాదన

వైద్య మండలి విచారణలో డాక్టర్ చిరాగ్ చెప్పిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. "నా వైవాహిక జీవితంలో సమస్యలు ఉండటం వల్లే ఆ మహిళతో సంబంధం పెట్టుకున్నాను" అని ఆయన తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, ఆ సంబంధాన్ని తెంచుకోవాలని చూసినప్పుడు ఆమె తనను బ్లాక్‌మెయిల్ చేసిందని, ఉద్యోగం పోగొడతానని బెదిరించిందని వాదించారు. ఆ భయంతోనే ఆమెకు 5,000 పౌండ్లు (సుమారు రూ. 5.3 లక్షలు) ఇవ్వజూపానని కూడా అంగీకరించారు.

రోగి భద్రత కంటే స్వార్థమే ముఖ్యం

ఈ కేసును విచారించిన మెడికల్ ట్రిబ్యునల్ డాక్టర్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఒక వైద్యుడిగా రోగి ఆరోగ్యం, భద్రత చూడాల్సిన మీరు, మీ స్వార్థం, కెరీర్ కోసం నియమాలను తుంగలో తొక్కారు. బాధితురాలికి మత్తు మందులను అలవాటు చేయడం క్షమించరాని నేరం" అని ప్యానెల్ మందలించింది.

కేవలం కుటుంబ సమస్యలను సాకుగా చూపి వృత్తి ధర్మాన్ని విస్మరించడం సమర్థనీయం కాదని స్పష్టం చేస్తూ, ఆయనను 8 నెలల పాటు వైద్య వృత్తి నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More