...
...
Next Story

సెల్యూట్ కెప్టెన్.. సూర్యకుమార్ అద్భుత పోరాటం.. అభిషేక్ గోల్డెన్ డకౌట్.. ఇండియా స్కోరు ఇదే

300 లోడింగ్.. ఇదీ బలమైన బ్యాటింగ్ యూనిట్ ఉన్న టీమిండియాపై ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకం. టీ20 ప్రపంచకప్ లో పసికూన అమెరికాపై భారత బ్యాటర్లు చెలరేగిపోతారనే అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. అయితే కెప్టెన్ సూర్య అద్భుత పోరాటంతో టీమ్ పోరాడే స్కోరు సాధించింది.

Published on: Feb 7, 2026, 20:54:11 IST
Advertisement

ఏదో అనుకుంటే, ఇంకేదో అయింది. పసికూన అమెరికా టీమ్ పై భారత బ్యాటర్లు చెలరేగిపోతారు, రికార్డు స్కోరు సాధిస్తారని అనుకుంటే.. దారుణమైన బ్యాటింగ్ తో పూర్తిగా నిరాశపరిచారు.

సూర్యకుమార్ యాదవ్ (AFP)
సూర్యకుమార్ యాదవ్ (AFP)

డిఫెండింగ్ ఛాంపియన్ గా టీ20 ప్రపంచకప్ లో అడుగుపెట్టిన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ లోనే బ్యాటింగ్ లో చతికిలపడింది. కానీ సూర్యకుమార్ (49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్) అసాధారణ పోరాటంతో ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది.

అభిషేక్ గోల్డెన్ డకౌట్

అభిషేక్ శర్మ క్రీజులో ఉంటే చాలు బౌండరీల సునామీ, పరుగుల తుపాను చూస్తాం. కానీ శనివారం (ఫిబ్రవరి 7) మాత్రం అతని బ్యాట్ సైలెంట్ అయిపోయింది. కనీసం ఒక్క రన్ కూడా చేయకుండా, రెండు బాల్స్ కూడా ఆడకుండా ఔటైపోయాడు అభిషేక్ శర్మ. తాను ఆడిన ఫస్ట్ బాల్ కే క్యాచ్ ఇచ్చేసి గోల్డెన్ డకౌట్ గా పెవిలియన్ చేరిపోయాడు.

టపటపా

ఇండియాతో ఇన్నింగ్స్ లో అమెరికా బౌలింగ్, ఫీల్డింగ్ ను కచ్చితంగా మెచ్చుకోవాల్సింది. డిఫెండింగ్ ఛాంపియన్ ను కట్టడి చేసేలా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, ఫీల్డింగ్ తో యూఎస్ఏ అదరగొట్టింది. మరోవైపు ఇండియన్ బ్యాటర్ల తప్పుడు షాట్ సెలక్షన్లతో వికెట్లు పారేసుకున్నారు. ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) కాస్త పరుగులు చేశారు.

ఒకే ఓవర్లో 3 వికెట్లు

తిలక్ వర్మ, ఇషాన్ ఆడుతుండటంతో టీమిండియా రికవరీ అయేలా కనిపించింది. కానీ అమెరికా పేసర్ వాన్ ఒకే ఓవర్లో మూడు వికెట్లతో టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో వాన్.. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబె (0) వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. రింకు సింగ్ (6), హార్దిక్ పాండ్య (5) కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో వాంఖడే స్టేడియం ఒక్కసారిగా లైబ్రరీలా మారిపోయింది.

సూర్యకుమార్ పోరాటం

లాస్ట్ ఓవర్లలో సూర్య గేరు మార్చాడు. తనదైన స్టైల్లో బౌండరీలు బాదాడు. ఫోర్ తో 30 బాల్స్ లో ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు సూర్య.

ఆ తర్వాత చెలరేగిపోయాడు సూర్య. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 కొట్టిన సూర్యకుమార్.. ఇండియా స్కోరును 160 దాటించాడు. అమెరికా బౌలర్లలో వాన్ 4 వికెట్లు తీశాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks