RCB : ‘ఆర్సీబీ అభిమానులకు అన్యాయం జరిగింది’- కర్ణాటక తదుపరి సీఎం సంచలన ఆరోపణలు..
IPL 2026 RCB vs GT : ఓవైపు ఆర్సీబీ గెలుపుతో బెంగళూరులో సంబరాలు జరుగుతుంటే మరోవైపు ఐపీఎల్ 2026 ఫైనల్ వెన్యూపై రాజకీయ దుమారం రేగింది! రాజకీయాలు చేసి, ఫైనల్ వెన్యూను బెంగళూరు నుంచి తరలించారని ఆ రాష్ట్ర తదుపరి సీఎం డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాక్-టు-బ్యాక్ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించిన ఆనందం ఒకవైపు ఉంటే.. ఈ దఫా సీజన్ చుట్టూ కర్ణాటకలో రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఆర్సీబీ విజేతగా నిలిచిన అనంతరం.. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల కారణంగానే బెంగళూరుకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హోస్టింగ్ అవకాశాన్ని తప్పించారని, ఇది కర్ణాటక ప్రజలకు, ఆర్సీబీ అభిమానులకు జరిగిన తీవ్ర అన్యాయమని ఆయన మండిపడ్డారు.

విరాట్ కోహ్లీ మెరుపు హాఫ్ సెంచరీతో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌ను నిలబెట్టుకోగానే కర్ణాటక వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. కాగా బెంగళూరులో ఉద్రిక్తతలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీధుల్లో బహిరంగ సంబరాలపై పోలీసులు నిషేధం విధించారు.
అయితే ఈ విజయోత్సవ వేళ 'వేదిక' వివాదం తెరపైకి వచ్చింది.
"రాజకీయాల వల్లే బెంగళూరుకు అన్యాయం" – డీకే శివకుమార్..
ఆదివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన డీకే శివకుమార్ కేంద్రం లేదా ఐపీఎల్ నిర్వాహకులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు:
"నిజానికి ఈ ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోనే జరగాల్సింది. కానీ మనకు అన్యాయం జరిగింది. కేవలం రాజకీయం కారణంగానే ఫైనల్ మ్యాచ్‌ను వేరే వేదికకు (అహ్మదాబాద్) మార్చారు. దీనిపై నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ.. కచ్చితంగా మనకి అన్యాయం జరిగింది," అని శివకుమార్ ఆరోపించారు.
సాధారణంగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్టు హౌమ్ గ్రౌండ్లో తదుపరి సీజన్ ఫైనల్ జరుగుతుంటుంది. 2025లో ఆర్సీబీ గెలవడంతో ఐపీఎల్ 2026 ఫైనల్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుందని అందరు భావించారు. కానీ బీసీసీఐ దానిని అహ్మదాబాద్‌కు తరలించి షాక్ ఇచ్చింది.
రాజకీయ విమర్శలు పక్కన పెడితే.. ఆ తర్వాత ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జట్టును అభినందించారు. "వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. నిజమైన ఛాంపియన్లలా పోరాడి బెంగళూరు గర్వపడేలా చేశారు," అని కొనియాడారు.
ఆర్సీబీ బ్రాండ్ భయం లేని క్రికెట్ – సిద్ధరామయ్య
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆర్సీబీ అద్భుత విజయానికి అభినందనలు తెలిపారు.
"ఈ టోర్నమెంట్ అంతటా ఆర్సీబీ ఆటగాళ్లు ప్రదర్శించిన భయం లేని క్రికెట్ ముందు ప్రత్యర్థి జట్లకు సమాధానమే దొరకలేదు. జట్టు ఉమ్మడి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ అభిమానుల ఇళ్లలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది," అని ఆయన పేర్కొన్నారు.
రోడ్లపై సంబరాలు వద్దు.. ఇళ్లలోనే చేసుకోండి: బెంగళూరు పోలీస్
మ్యాచ్ గెలిచిన వెంటనే అర్ధరాత్రి వేళ బెంగళూరులోని రోడ్లపైకి వేలాది మంది అభిమానులు చేరి కేకలు వేస్తూ బైక్ ర్యాలీలు తీస్తారని పోలీసులకు తెలుసు. దీనితో శాంతిభద్రతలకు సమస్య వాటిల్లే అవకాశం ఉన్నందున అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఆర్సీబీ అభిమానులు ఇళ్లలోనే సంబరాలు చేసుకోవాలని, రోడ్లపైకి రావద్దని స్పష్టం చేశారు.
"బెంగళూరు సిటీ పోలీస్ పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేసింది. రోడ్లపై ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే ఊరుకోం. వాహనాల తనిఖీలు తీవ్రతరం చేశాం. బహిరంగంగా వీధుల్లో ఎలాంటి వేడుకలకు అనుమతి లేదు. ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే కేవలం ఇళ్ల లోపల మాత్రమే చేసుకోవాలి," అని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ ఆంక్షలపై సిద్ధరామయ్య కూడా స్పందిస్తూ.. అభిమానులంతా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, పోలీసుల నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఐపీఎల్ 2025 గెలిచిన అనంతరం బెంగళూరులో నిర్వహించిన విక్టరీ పరేడ్ సమయంలో 11మంది చనిపోయిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


