Instagram : ఇన్​స్టాగ్రామ్ ఇన్​ఫ్లుయెన్సర్లకు క్రేజీ అప్డేట్​! ఇక 'స్టోరీ'లను కూడా ఎడిట్ చేసుకోవచ్చు

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా అదిరిపోయే శుభవార్త అందించింది. స్టోరీ పోస్ట్ చేసిన 15 నిమిషాల లోపు వ్యూస్, లైక్స్ కోల్పోకుండానే ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. కొత్త బ్యాక్‌గ్రౌండ్‌లు, స్టిక్కర్లతో వచ్చిన ఈ అప్‌డేట్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Nov 20, 2026, 10:01:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సోషల్ మీడియా ప్రియులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక కీలక మార్పును ఇన్‌స్టాగ్రామ్ ఎట్టకేలకు అందుబాటులోకి తెచ్చింది! 24 గంటల తర్వాత అదృశ్యమయ్యే ఫొటోలు, వీడియోల కోసం ఇన్‌స్టాగ్రామ్​లో 2016లోనే 'స్టోరీస్' ఫీచర్‌ను ప్రవేశపెట్టిన మెటా ఆధారిత సంస్థ,. సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత, ఇప్పుడు ఆ స్టోరీలను ఎడిట్ చేసే వెసులుబాటును కల్పించింది. స్టోరీ షేర్ చేసిన తర్వాత చిన్న అక్షర దోషం కనిపించినా, పాట మార్చాలనిపించినా ఇకపై దాన్ని డిలీట్ చేసి మళ్లీ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటివరకు వచ్చిన వ్యూస్, లైక్స్, రిప్లైలకు ఎలాంటి నష్టం కలగకుండానే 15 నిమిషాల లోపు స్టోరీని ఎడిట్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది.

ఇన్​స్టాగ్రామ్ లేటెస్ట్ అప్డేట్స్..
ఇన్​స్టాగ్రామ్ లేటెస్ట్ అప్డేట్స్..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనే కాకుండా నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరిలో ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సినిమా ప్రమోషన్ల నుంచి స్థానిక బొటిక్ వ్యాపారాలు, ఫుడ్ బ్లాగర్ల వరకు ప్రతి ఒక్కరూ తమ రోజువారీ అప్‌డేట్స్ కోసం స్టోరీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఒక్కసారి స్టోరీ పెట్టాక అందులో ఏదైనా తప్పు దొర్లితే, దాన్ని డిలీట్ చేసి మళ్లీ పోస్ట్ చేయడం వల్ల అప్పటికే వచ్చిన రీచ్, ఎంగేజ్‌మెంట్ దెబ్బతినేది. ఇన్‌స్టాగ్రామ్ తాజా అప్‌డేట్ కంటెంట్ క్రియేటర్లు, వ్యాపార సంస్థలు, సోషల్ మీడియా మేనేజర్లకు పెద్ద ఊరటనిస్తోంది.

15 నిమిషాల గడువు.. వ్యూస్, రిప్లైలకు ఏం కాదు!

స్టోరీ పోస్ట్ చేసిన 15 నిమిషాల వరకు యూజర్లు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. స్టోరీని షేర్ చేసిన తర్వాత అందులోని టెక్ట్స్, మ్యూజిక్, స్టిక్కర్లు, డ్రాయింగ్స్ వంటి వాటిలో మార్పులు చేసుకోవచ్చు అని అన్నారు. ఇలా మార్పులు చేసినప్పటికీ ఆ పోస్ట్‌కు అప్పటికే వచ్చిన వ్యూస్, లైక్స్, రిప్లైలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు.

చిన్నపాటి స్పెల్లింగ్ తప్పులు లేదా చివరి నిమిషంలో చేయాల్సిన సవరణల కోసం స్టోరీని తొలగించి తిరిగి అప్‌లోడ్ చేసే తలనొప్పిని ఈ కొత్త ఆప్షన్ పూర్తిగా తప్పిస్తుంది. అయితే పారదర్శకత కోసం మార్పులు చేసిన స్టోరీలపై ‘Edited’ అనే లేబుల్ కనిపిస్తుంది. తద్వారా పోస్ట్ చేసిన తర్వాత దాన్ని సవరించారని వీక్షకులు సులభంగా గుర్తించగలరు.

స్టోరీని ఎడిట్ చేయడం ఎలా?

యూజర్లు తమ స్టోరీని ఎడిట్ చేసుకోవడం చాలా సులభం. ముందుగా మీరు పోస్ట్ చేసిన స్టోరీని తెరిచి, కుడివైపు కింది మూలలో కనిపించే మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే 'Edit Story' ఆప్షన్‌ను ఎంచుకుని కావాల్సిన మార్పులు చేసి సేవ్ చేస్తే సరిపోతుంది.

ఎడిటింగ్ సదుపాయంతో పాటు స్టోరీస్ క్రియేషన్ ఇంటర్‌ఫేస్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ ఆకర్షణీయంగా అప్‌డేట్ చేసింది. కొత్త ఫాంట్లు, రంగులతో కూడిన సరికొత్త స్టిక్కర్ ఆప్షన్లను ప్లాట్‌ఫామ్ పరిచయం చేసింది. ఫోటోలకు మరింత అందాన్ని తెచ్చేందుకు కొత్త బ్లర్, గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్లను జతచేసింది. దీనికి తోడు ఒకేసారి ఎక్కువ ఫోటోలను సులభంగా ఎంచుకుని షేర్ చేసే విధంగా యాప్‌ను తీర్చిదిద్దింది.

క్రియేటర్ల కాపీరైట్ రక్షణకు కొత్త టూల్.. టీనేజర్ల భద్రతపై ఏఐ నిఘా!

ఈ నెల ప్రారంభంలోనే ఇన్‌స్టాగ్రామ్ మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది. ఒరిజినల్ కంటెంట్ రూపొందించే క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా 'కంటెంట్ ప్రొటెక్షన్ టూల్' తీసుకొచ్చింది. ఒక క్రియేటర్ రూపొందించిన అసలు వీడియోలను ఇతరులు కాపీ కొట్టి తిరిగి అప్‌లోడ్ చేస్తున్నారా లేదా అన్నది ఈ టూల్ ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ రెండు ప్లాట్‌ఫామ్‌లను స్కాన్ చేసి, అలాంటి పోలిన వీడియోలు కనిపించగానే అసలు క్రియేటర్‌కు వెంటనే నోటిఫికేషన్ పంపుతుంది.

అలాగే టీనేజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వయసు అంచనా వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. తప్పుడు వయసు వివరాలు ఇచ్చి ఖాతాలు నడుపుతున్న టీనేజ్ అకౌంట్లను ఈ ఏఐ వ్యవస్థ గుర్తించి తగిన భద్రతా నిబంధనలను వర్తింపజేస్తుంది. వరుస అప్‌డేట్లతో యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు క్రియేటర్ల హక్కులకు ఇన్‌స్టాగ్రామ్ మరింత భరోసా కల్పిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More