Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ.. పిల్లోడు కాదు పిడుగు- 15ఏళ్లకే కళ్లు చెదిరే నెట్ వర్త్!
బిహార్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ఐపీఎల్ వేదికపై గర్జించే వరకు.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రయాణం అద్భుతం! తండ్రి చేసిన త్యాగం, క్రమశిక్షణ నేడు అతడిని క్రికెట్ ప్రపంచంలో యంగ్ డైనమైట్‌గా నిలబెట్టాయి. ఈ నేపథ్యంలో వైభవ్ నెట్ వర్త్, లైఫ్‌స్టైల్ గురించి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
వైభవ్ సూర్యవంశీ.. గత కొంతకాలంగా, భారత క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతున్న పేరు ఇది! ఈ 15ఏళ్ల యువ క్రికెటర్ సృష్టిస్తున్న సంచలనాలు అంతా ఇంతా కాదు. అందుకే అందరు వైభవ్‌ని "పిల్లోడు" కాదు "పిడుగు" అని అంటున్నారు. ఐపీఎల్ 2026లో సోమవారం జరిగిన సీఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఇది మరోసారి నిరూపితమైంది. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ యంగ్ డైనమైట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు, నెట్ వర్త్, లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వైభవ్ సూర్యవంశీ- నాలుగేళ్ల ప్రాయంలోనే బ్యాట్ పట్టి..
వైభవ్ ప్రయాణం చాలా చిన్న వయస్సులోనే మొదలైంది.
4 ఏళ్ల వయస్సు: ఇరుకైన సందుల్లో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.
9 ఏళ్ల వయస్సు: బిహార్ సమస్తిపూర్‌లోని క్రికెట్ అకాడమీలో చేరాడు.
తండ్రి త్యాగం: స్వతహాగా క్రికెటర్ కావాలనుకున్న వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ, తన కల నెరవేరకపోవడంతో కొడుకు కోసం తనకున్న సాగు భూమిని అమ్మేశారు. ఆ డబ్బుతో వైభవ్ శిక్షణకు అవసరమైన ఖర్చులు భరించారు. ఇంటి పక్కనే సొంతంగా ప్రాక్టీస్ నెట్స్ ఏర్పాటు చేసి, కొడుకు నిత్యం సాధన చేసేలా పర్యవేక్షించారు.
వైభవ్ సూర్యవంశీ- సింప్లిసిటీకి నిలువుటద్దం.. ఆ ఇల్లు!
తాజ్‌పూర్‌లో తన తాత కట్టిన రెండంతస్తుల పాత ఇంట్లోనే వైభవ్ నివసిస్తున్నాడు. ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత సంపాదిస్తున్నా.. వైభవ్ మూలాలు మాత్రం ఇప్పటికీ ఆ సామాన్యమైన ఇంట్లోనే ఉన్నాయి. ఆ ఇంటి గోడలకు ఇప్పటికీ పాలిష్ కూడా చేయలేదు. ఒక మూల జిమ్ కోసం కొన్ని వెయిట్స్, మరో మూల తను గెలుచుకున్న మెడల్స్.. ఇవే వైభవ్ ప్రపంచం. క్రమశిక్షణ అంటే విలాసవంతమైన విల్లాలో ఉండటం కాదు, ఒక పాత ఇంటి ఆవరణలో చెమటోడ్చడం అని అతడు నిరూపించాడు.
వైభవ్ సూర్యవంశీ- ఐపీఎల్ రికార్డుల వేట..
2024 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్‌ని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది (ఇది అతడి బేస్ ప్రైస్ రూ. 30లక్షల కంటే మూడు రెట్లు ఎక్కువ).
ఐపీఎల్ అరంగేట్రంలోనే వైభవ్ సంచలనం సృష్టించాడు:
- తన ఐపీఎల్ కెరీర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు.
- గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే 101 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.
- ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెంచూరియన్‌గా నిలిచాడు.
- తన తొలి సీజన్‌లో 7 ఇన్నింగ్స్‌ల్లో 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు సాధించి దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాడు.
వైభవ్ సూర్యవంశీ ఆదాయం, నెట్ వర్త్..
కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ నెట్ వర్త్ సుమారు రూ. 2.5 కోట్లు అని నివేదికలు చెబుతున్నాయి.
వైభవ్ సంపాదన ఐపీఎల్‌కే పరిమితం అవ్వలేదు.
బీసీసీఐ ఆదాయం: అండర్-19 స్థాయిలో ఆడితే మ్యాచ్‌కు రూ. 20,000, రిజర్వ్ ప్లేయర్‌గా ఉంటే రూ. 10,000 లభిస్తాయి. అండర్-19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఒక్కో ప్లేయర్‌కు రూ. 40 లక్షల బహుమతి లభించింది.
డొమెస్టిక్ క్రికెట్: ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో రోజుకు రూ. 40,000 సంపాదిస్తున్నాడు (4 రోజుల మ్యాచ్‌కి రూ. 1.6 లక్షలు).
ఐపీఎల్- ఐపీఎల్ 2026 కోసం వైభవ్‌ని రూ. 1.1కోట్లకు ఆర్ఆర్ రీటైన్ చేసుకుంది.
కార్లు: విజయాల ఫలితంగా వైభవ్ ఇప్పుడు ఒక ‘టాటా కర్వ్ ఈవీ’, ఒక 'మెర్సిడెస్ బెంజ్' కారును పొందాడు.
వైభవ్ సూర్యవంశీ- కుటుంబమే కొండంత అండ..
వైభవ్ సూర్యవంశీ విజయాల వెనుక అతడి తండ్రి సంజీవ్ నిశ్శబ్ద శిల్పిలా నిలబడితే, తల్లి అతడి చదువు, క్రమశిక్షణ విషయంలో రాజీ పడకుండా చూసుకున్నారు. సెలబ్రిటీ హోదా వచ్చినప్పటికీ, వైభవ్ కుటుంబం మాత్రం ఇప్పటికీ తాజ్‌పూర్‌లోనే నిరాడంబరంగా జీవిస్తోంది. వెలుగులోకి రావడం కంటే, కొడుకు భవిష్యత్తుకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


