...
...
Next Story

అమెరికన్లకు సముద్ర గర్భమే గతి.. అణ్వాయుధాలపై ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్

అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ అణ్వాయుధ, క్షిపణి సామర్థ్యాలను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, పర్షియన్ గల్ఫ్ నుంచి అమెరికా తప్పుకోకపోతే సముద్ర గర్భంలో సమాధి చేస్తామని హెచ్చరించారు.

Published on: May 01, 2026 02:51 PM IST
Advertisement

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు అయతుల్లా మోజ్తబా ఖమేనీ.. తొలిసారిగా అమెరికాపై నిప్పులు చెరిగారు. తమ దేశ అణ్వాయుధ ప్రాజెక్టులు, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు "జాతీయ ఆస్తులు" అని, వాటి విషయంలో ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. పర్షియన్ గల్ఫ్ డే సందర్భంగా గురువారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

"అమెరికన్లకు సముద్ర గర్భమే దిక్కు"

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళ ఉనికిపై మోజ్తబా అత్యంత కటువైన పదజాలాన్ని ఉపయోగించారు. "పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్లకు చోటు ఉందంటే.. అది కేవలం ఆ సముద్రపు అడుగున మాత్రమే" అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అమెరికా బలగాలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లకపోతే వారిని నాశనం చేస్తామనే అర్థంలో ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాల రౌడీయిజం, అమెరికా దాడుల తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒక "కొత్త అధ్యాయం" మొదలైందని, పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిపై తమ పట్టు మరింత బిగుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అణ్వాయుధాలే మా అస్తిత్వం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒక సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్న తరుణంలో మోజ్తబా ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రంప్ వ్యూహాలు రచిస్తుంటే.. ఖమేనీ మాత్రం రివర్స్ గేర్ వేశారు.

"9 కోట్ల మంది ఇరాన్ ప్రజలు తమ అణ్వాయుధ, క్షిపణి సామర్థ్యాలను, తమ ప్రాణప్రదమైన ఆస్తులుగా భావిస్తున్నారు. నానో టెక్నాలజీ నుంచి క్షిపణుల వరకు ప్రతి ఒక్కటీ మా దేశ గౌరవానికి చిహ్నం. మా గాలిని, నీటిని, గడ్డను ఎలా కాపాడుకుంటామో.. మా ఆయుధ సంపత్తిని కూడా అలాగే రక్షించుకుంటాం" అని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెస్కియన్ కూడా అమెరికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ఓడరేవులను నిర్బంధించాలని అమెరికా చూస్తోందని, ఇటువంటి నావికా దిగ్బంధాలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు. "అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవి విఫలం కాక తప్పదు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఫిబ్రవరిలో జరిగిన దాడుల తర్వాత మోజ్తబా ఖమేనీ ఇంకా ప్రజల ముందుకు రాలేదు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ తాజా ప్రకటన ద్వారా తాను "మెంటల్లీ షార్ప్" గా ఉన్నానని, ఇరాన్ విదేశాంగ విధానంలో ఏ మార్పు లేదని ఆయన ప్రపంచానికి సంకేతాలు పంపారు. అమెరికాను "గ్రేట్ సాతాన్" గా అభివర్ణించే పాత ధోరణినే ఆయన కొనసాగించడం గమనార్హం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్రశ్న 1: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరు?

జవాబు: అయతుల్లా మోజ్తబా ఖమేనీ ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్. ఆయన తన తండ్రి అలీ ఖమేనీ మరణానంతరం మార్చి 9, 2026న ఈ బాధ్యతలు చేపట్టారు.

ప్రశ్న 2: హార్ముజ్ జలసంధి ప్రాముఖ్యత ఏమిటి?

జవాబు: ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే చమురులో దాదాపు 20% ఈ జలసంధి గుండానే వెళ్తుంది. దీనిపై ఇరాన్ పట్టు సాధిస్తే ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

ప్రశ్న 3: అమెరికాపై ఇరాన్ ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తోంది?

జవాబు: ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అమెరికా ఆంక్షలు విధించడం, ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్ మాజీ నేత మరణించడం ఈ శత్రుత్వానికి ప్రధాన కారణాలు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe