ISRO Hackathon 2026: విద్యార్థులకు ఇస్రో బంపర్ ఆఫర్! స్పేస్ హ్యాకథాన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం- గెలిస్తే..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. 'భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ 2026' మూడో ఎడిషన్‌ని ప్రారంభించింది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి, అంతరిక్ష సాంకేతిక సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడమే ఈ జాతీయ స్థాయి పోటీ ముఖ్య లక్ష్యం.

Published on: Jun 15, 2026, 09:58:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ISRO Space Hackathon 2026 : భారతదేశ అంతరిక్ష రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు వేదికై నిలిచే 'భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ (బీఏహెచ్) 2026' మూడో ఎడిషన్‌ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అధికారికంగా ప్రారంభించింది. దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న స్పేస్-టెక్ వ్యవస్థలో సరికొత్త ఐడియాలతో భాగస్వాములు కావాలని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఇస్రో పిలుపునిచ్చింది. ప్రముఖ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ ‘హ్యాక్2స్కిల్’ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి కార్యక్రమం ద్వారా.. ఖగోళ శాస్త్రం, వాతావరణ మార్పులకు సంబంధించిన అత్యంత సంక్లిష్టమైన సవాళ్లకు సరికొత్త పరిష్కారాలను కనుగొనాలని ఇస్రో భావిస్తోంది.

ఇస్రో నుంచి విద్యార్థులకు అప్డేడ్..
ఇస్రో నుంచి విద్యార్థులకు అప్డేడ్..

ఎవరు అర్హులు? టీమ్ నిబంధనలు ఏంటి?

ఈ హ్యాకథాన్‌లో పాల్గొనడానికి ఇస్రో కొన్ని కఠినమైన అర్హతలను నిర్ణయించింది:

ప్రస్తుతం భారతదేశంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, లేదా పీహెచ్‌డీ చేస్తున్న రీసెర్చ్ స్కాలర్లు మాత్రమే ఈ పోటీకి అర్హులు.

ఉద్యోగాలు చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఇందులో పాల్గొనే అవకాశం లేదు.

ప్రతి బృందంలో ఖచ్చితంగా ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉండాలి.

విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పిస్తూ.. వేర్వేరు కాలేజీలు లేదా యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు కలిసి కూడా ఒక ఉమ్మడి టీమ్‌గా ఏర్పడవచ్చు.

ఇస్రో ఇచ్చిన 15 సవాళ్లు ఇవే..

అంతరిక్ష పరిశోధనలను, భూమిపై వనరుల నిర్వహణతో ముడిపెడుతూ ఇస్రో మొత్తం 15 సవాళ్లను విద్యార్థుల ముందు ఉంచింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

క్లైమేట్ డిజిటల్ ట్విన్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో భారతదేశ వాతావరణాన్ని అంచనా వేసే డిజిటల్ ట్విన్‌ను రూపొందించడం.

చంద్రునిపై మంచు అన్వేషణ: చంద్రయాన్-2 పంపిన రాడార్ డేటాను విశ్లేషించి, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉపరితలం కింద ఉన్న మంచు నిల్వలను గుర్తించడం. భవిష్యత్తులో అక్కడ తిరిగే రోవర్ల ప్రయాణానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయడం.

ఆదిత్య-ఎల్1 డేటా విశ్లేషణ: ఆదిత్య-ఎల్1 పంపే సమాచారం ఆధారంగా సూర్యుడిపై వచ్చే సౌర జ్వాలలను ముందుగానే అంచనా వేయడం.

కొత్త గ్రహాల గుర్తింపు: అంతరిక్షం నుండి వచ్చే అస్పష్టమైన కాంతి తరంగాల ద్వారా కొత్త గ్రహాలను కనిపెట్టడం.

శాటిలైట్ ఇమేజ్ క్లియరెన్స్: జనరేటివ్ ఏఐ సాయంతో ఉపగ్రహ చిత్రాలలో అడ్డుగా ఉండే మేఘాలను తొలగించి స్పష్టమైన ఫోటోలను రూపొందించడం.

ముఖ్యమైన తేదీలు..

ఈ హ్యాకథాన్ రిజిస్ట్రేషన్లు, ఐడియా సమర్పణ ప్రక్రియ జూన్ 10, 2026 నుంచే ప్రారంభమయ్యాయి.

విద్యార్థులకు సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కల్పించడానికి జూన్ 15, జూన్ 16 తేదీల్లో ఇస్రో ప్రత్యేకంగా రెండు వివరణాత్మక సెషన్లను నిర్వహిస్తోంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై 1, 2026 చివరి తేదీ.

దరఖాస్తుల పరిశీలన అనంతరం, ఎంపికైన టీముల వివరాలను జులై 20, 2026న ఇస్రో ప్రకటిస్తుంది. ఆ తర్వాత జులై 21న ఇండక్షన్ సెషన్ ఉంటుంది. ఇక తుది సమరమైన 30 గంటల లైవ్ గ్రాండ్ ఫినాలే ఆగస్టు 6, 7 తేదీల్లో జరగనుంది.

ఉచిత రిజిస్ట్రేషన్.. ఇస్రోలో ఇంటర్న్‌షిప్ అవకాశం!

ఈ హ్యాకథాన్‌లో పాల్గొనడానికి ఎలాంటి ఫీజూ లేదు, ఇది పూర్తిగా ఉచితం. ఆసక్తి గల విద్యార్థులు హ్యాక్2స్కిల్ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఎలాంటి ఫిజికల్ ప్రొటోటైప్ (నమూనా) తయారు చేయాల్సిన అవసరం లేదు. కేవలం వెబ్‌సైట్‌లో ఇచ్చిన టెంప్లేట్ ప్రకారం మీ ఐడియా యొక్క పూర్తి వివరణాత్మక ప్రపోజల్‌ను జులై 1 లోగా సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

ఫైనల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఇస్రో శాస్త్రవేత్తలు, సబ్జెక్ట్ నిపుణులు స్వయంగా సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తారు. జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు, ఇస్రోలో నడుస్తున్న లైవ్ స్పేస్ ప్రాజెక్టులలో నేరుగా అధికారిక ఇంటర్న్‌షిప్ చేసే సువర్ణావకాశాన్ని కూడా అభ్యర్థులు దక్కించుకోవచ్చు. అంతేకాదు, ఫిజికల్ ఫినాలేకు ఎంపికైన విద్యార్థులందరికీ రానూపోనూ సెకండ్ ఏసీ రైలు ప్రయాణ ఖర్చులను నిర్వాహకులే భరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మీలోని స్పేస్ సైంటిస్ట్‌కు పని చెప్పే సమయం వచ్చేసింది!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More