...
...
Next Story

జేఈఈ మెయిన్స్​ 2026 అభ్యర్థులకు అలర్ట్: ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం చివరి తేదీ ఇది..

జేఈఈ మెయిన్స్​ 2026 రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు కాకుండా ఇతర గుర్తింపు పత్రాలు సమర్పించిన వారు, ఫోటోలు సరిపోలని అభ్యర్థులు జనవరి 15, 2026 లోపు తమ గుర్తింపును ధృవీకరించుకోవాలని స్పష్టం చేసింది.

Published on: Jan 3, 2026, 10:00:57 IST
Advertisement

జేఈఈ మెయిన్స్​ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన సూచన చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన గుర్తింపు పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో మరోసారి వెరిఫై చేసుకోవాలని ఆదేశించింది.

జేఈఈ అభ్యర్థులకు కీలక అప్డేట్​..
జేఈఈ అభ్యర్థులకు కీలక అప్డేట్​..

ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు జనవరి 15, 2026 వరకు ఎన్టీఏ గడువు ఇచ్చింది.

జేఈఈ మెయిన్స్​ 2026- ఎందుకు ఈ వెరిఫికేషన్?

"కొంతమంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డుకు బదులుగా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించారు. అదే సమయంలో దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన లైవ్ ఫోటోలు, యూఐడీఏఐ రికార్డుల్లో ఉన్న ఫోటోలతో సరిపోలడం లేదు," అని ఎన్టీఏ తన అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇలాంటి సమస్యలు ఉన్న అభ్యర్థుల గుర్తింపును నిర్ధారించుకోవడానికే ఈ ప్రక్రియను చేపట్టినట్టు వివరించింది.

జేఈఈ మెయిన్స్​ 2026- ఎలా ధృవీకరించుకోవాలి?

సంబంధిత అభ్యర్థులు తమ లేటెస్ట్​ ఫోటోతో కూడిన ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనిపై సంబంధిత స్కూల్ లేదా కాలేజీ ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ సంతకం చేసి, ధృవీకరించాలని (అటెస్టేషన్​) గతంలో ఆదేశాలు ఇచ్చింది.

అయితే, చాలామంది అభ్యర్థులు తమ స్కూల్ లేదా కాలేజీ అధికారులను సంప్రదించడం కష్టమవుతోందని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ.. అటెస్టేషన్ నిబంధనలను సడలించింది. ఇకపై అభ్యర్థులు క్లాస్-1 గెజిటెడ్ ఆఫీసర్లైన తహసీల్దార్, రెవెన్యూ ఆఫీసర్, ఎస్​డీఎం లేదా డీఎంలతో కూడా సంతకం చేయించుకోవచ్చు. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐ అభ్యర్థులు భారత రాయబార కార్యాలయంలోని క్లాస్-1 గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అటెస్టేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

జేఈఈ మెయిన్స్​ 2026- పరీక్ష తేదీలు..

ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి.

భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, సెంట్రల్ ఫండ్డ్ టెక్నికల్ ఇన్ స్టిట్యూట్లలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఎన్టీఏ ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. అంతేకాకుండా, ఐఐటీల్లో ప్రవేశం కల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఇది అర్హత పరీక్షగా కూడా పనిచేస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో విద్యార్థుల ప్రతిభను పరీక్షించే ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.

ప్రతియేటా కొన్ని లక్షల మంది జేఈఈ మెయిన్స్​ రాస్తుంటారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks