...
...
Next Story

JSW Jaecoo J5 hybrid : జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ.. జేకూ జే5 ఎలా ఉంటుంది?

భారత ఆటోమొబైల్​ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ ఎంట్రీకి ముందు జేకూ జే5 హైబ్రిడ్ ఎస్‌యూవీ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా భారత రోడ్లపై కనిపించింది. డిసెంబర్ 3న 'కాంబాట్' ఎస్‌యూవీతో పాటు ఈ కారును కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే..

Published on: Nov 27, 2026, 09:59:52 IST
Advertisement

జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ భారత ఆటోమొబైల్ రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ డిసెంబర్ 3, 2026న ‘కాంబాట్’ ఎస్‌యూవీతో పాటు జేకూ జే5 హైబ్రిడ్ ఎస్‌యూవీని కూడా ప్రదర్శించే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలోనే ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా దేశీయ రోడ్లపై పరీక్షల సమయంలో జేకూ జే5 కనిపించింది. 'ఎంఆర్‌డీ వ్లాగ్స్' పంచుకున్న తాజా స్పై ఫోటోలలో నల్లటి టెస్ట్ కారుపై జేకూ అక్షరాలు, జే5 బ్యాడ్జ్‌తో పాటు వెనుక టెయిల్‌గేట్‌పై 'హైబ్రిడ్' బ్యాడ్జ్ స్పష్టంగా కనిపిస్తోంది. గత జులైలో క్యామోఫ్లేజ్ గ్రిల్‌తో కనిపించిన టెస్ట్ వాహనంతో పోలిస్తే, ఇందులోని ఇంజిన్ తీరుపై ఈ తాజా ఫోటోలు బలమైన సంకేతాలు ఇస్తున్నాయి.

జేకూ జే5 హైబ్రిడ్ ఎస్‌యూవీ- విశేషాలు..

జేఎస్​డబ్ల్యూ జేకూ జే5 ఈవీ వర్షెన్
జేఎస్​డబ్ల్యూ జేకూ జే5 ఈవీ వర్షెన్

గతంలో కనిపించిన ఫోటోలను బట్టి జే5లో ఎలక్ట్రిక్, ఐసీఈ బాడీ వెర్షన్లు భారత్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టమైంది. అయితే మునుపటి టెస్ట్ కారుపై సాధారణ గ్రిల్ ఉండటంతో అది కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తోందా లేక హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తోందా అన్నది తేలలేదు.

తాజాగా ఎలాంటి ముసుగు లేకుండా కనిపించిన ఈ కారు తాను హైబ్రిడ్ మోడల్ అని స్పష్టంగా చాటుకుంది. ఆసక్తికరంగా పరీక్షల సమయంలోనూ ఇది విదేశీ 'జేకూ' బ్రాండింగ్‌తోనే కనిపించింది. భారత్‌లో జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ పేరుతో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, తుది బ్యాడ్జ్‌లు, మోడల్ పేరును ఇంకా ప్రకటించలేదు.

జేకూ జే5 హైబ్రిడ్ ఎస్‌యూవీ- ఎక్స్​టీరియర్..

క్యామోఫ్లేజ్ తొలగించడంతో జేకూ జే5 హైబ్రిడ్ నిటారుగా ఉండే ఎస్‌యూవీ రూపురేఖలు స్పష్టంగా బయటపడ్డాయి. ముందు భాగంలో దగ్గరగా అమర్చిన నిలువు చారలతో కూడిన పెద్ద గ్రిల్, సన్నని లైటింగ్ యూనిట్లు, వెడల్పాటి కింది ఎయిర్ ఇన్‌టేక్ ఉన్నాయి. కొంతవరకు చదునుగా ఉండే బోనెట్, నిటారుగా నిలబడిన భంగిమ దీనికి సంప్రదాయ ఎస్‌యూవీ రూపాన్ని ఇస్తున్నాయి. పక్క భాగాన రూఫ్ రెయిల్స్, సాధారణ డోర్ హ్యాండిళ్లు, నలుపు రంగు పిల్లర్లు, దాదాపు ఫ్లాట్​గ సాగే రూఫ్‌లైన్ కనిపిస్తున్నాయి. అల్లాయ్ వీల్స్, నలుపు రంగు బాడీ క్లాడింగ్ సైడ్ ప్రొఫైల్‌ను పూర్తి చేస్తున్నాయి.

తాజా స్పై ఫోటోలు కారు బయటి భాగాన్నే చూపించాయి; లోపలి క్యాబిన్ వివరాలను వెల్లడించలేదు. విదేశీ మార్కెట్లలో లభించే జే5లో 13.2-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్, 8.8-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఫోన్ చార్జర్, ఎనిమిది స్పీకర్ల సోనీ ఆడియో సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి సౌకర్యాలు కూడా విదేశీ మోడల్‌లో ఉన్నాయి. భద్రత కోసం పలు ఎయిర్‌బ్యాగ్‌లు, సరౌండ్-వ్యూ కెమెరా వ్యవస్థ, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉంటాయి.

విదేశాల్లోని స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్‌లో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌కు ఎలక్ట్రిక్ మోటార్, 1.83 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీని జతచేశారు. ఈ వ్యవస్థ 224 హెచ్​పీ పవర్​ని, 295 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుండగా, లీటరుకు 18.9 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని అంచనా.

జేఎస్‌డబ్ల్యూ ఎస్‌యూవీ శ్రేణి విస్తరణ..

రగ్డ్ 'కాంబాట్' ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీకి తోడుగా, నగర ప్రయాణాలకు అనువైన మిడ్-సైజ్ ఎస్‌యూవీగా జే5ను జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ తీసుకురానుంది. ధరలు, ఫీచర్లను బట్టి ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో పోటీ పడే అవకాశం ఉంది. గతంలో పరీక్షల సమయంలో కనిపించిన ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తోడైతే, మార్కెట్లో జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ పరిధి మరింత విస్తరించడం ఖాయం.

అయితే ఈ డిసెంబర్​ 3 ప్రదర్శనలో జే5 ఉంటుందా లేదా, భారత్‌లో దీన్ని ఏ పేరుతో విక్రయిస్తారనే విషయంలో ఇంకా అధికారిక స్పష్టత రాలేదు.

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks