Mojtaba Khamenei : ఇరాన్​లో 'నెపో' పాలిటిక్స్​? సుప్రీం లీడర్​గా ఖమేనీ కుమారుడు! ఎవరు ఈ మొజ్తబా?

Iran Israel war L అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అల్​ ఖమేనీ మరణించిన తర్వాత, ఇరాన్ తదుపరి పగ్గాలను ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఆయన్నే ఇరాన్​ సుప్రీం లీడర్​గా ఎన్నుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Published on: Mar 4, 2026, 09:57:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇజ్రాయెల్​- అమెరికా దాడుల్లో ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతొల్లా అల్​ ఖమేనీ హతమైన విషయం తెలిసిందే. ఖమేనీ తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్​ సుప్రీం లీడర్​ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. అల్​ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీనే ఇరాన్​ తదుపరి సుప్రీమోగా ఎన్నుకున్నట్టు సమాచారం.

అయతొల్లా అల్​ ఖమేనీ కుమారుడు మొజ్తబా.. (AP/Reuters)
అయతొల్లా అల్​ ఖమేనీ కుమారుడు మొజ్తబా.. (AP/Reuters)

56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ.. అల్​ ఖమేనీ పెద్ద కుమారుడు. ఇరాన్ విప్లవ దళాల (ఐఆర్​జీసీ) ఒత్తిడి మేరకే మోజ్తబాను నాయకుడిగా ఎన్నుకున్నట్లు 'ఇరాన్ ఇంటర్నేషనల్' తాజాగా నివేదించింది. అయితే, ఇస్లామిక్ రిపబ్లిక్ సాధారణంగా వారసత్వ పాలనను విమర్శిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తండ్రి తర్వాత కొడుకు నాయకుడు కావడంపై చర్చ మొదలైంది.

గత ఏడాది అల్​ ఖమేనీ స్వయంగా సిద్ధం చేసిన వారసుల జాబితాలో కూడా మోజ్తబా పేరు లేకపోవడం గమనార్హం. షియా ముస్లిం మత పెద్దల వ్యవస్థలో తండ్రి నుంచి కుమారుడికి అధికారం బదిలీ అవ్వడాన్ని సానుకూలంగా చూడరు.

ఎవరీ మోజ్తబా ఖమేనీ?

మోజ్తబా ఉన్నత స్థాయి మత గురువు కాదు. ఆయన ఇంతవరకు ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక పదవులను నిర్వహించలేదు. అయినప్పటికీ, తెర వెనుక ఆయనకు విపరీతమైన ప్రభావం ఉందని నమ్ముతారు. ముఖ్యంగా ఇరాన్ పారామిలిటరీ విప్లవ దళాలతో (ఐఆర్​జీసీ) ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

గతంలో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఖమేనీ కుటుంబంలో మోజ్తబా మాత్రమే ప్రాణాలతో బయటపడగా.. అల్​ ఖమేనీ భార్య, కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు.. అమెరికా- ఇజ్రాయెల్​ దాడుల్లో మరణించారు.

2019లో అమెరికా ట్రెజరీ శాఖ మోజ్తబాపై ఆంక్షలు విధించింది. ఎన్నికైన ప్రతినిధి కాకపోయినా, తన తండ్రి కార్యాలయంలో ఉంటూ అధికారిక హోదాలో వ్యవహరించినందుకు ఈ చర్య తీసుకున్నారు.

కాగా ఇరాన్​ సుప్రీం లీడర్​గా మొజ్తబా ఎన్నికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.​

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై డ్రోన్ దాడి..

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. మంగళవారం అర్థరాత్రి దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి వల్ల అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. కువైట్, రియాద్‌లలోని అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు జరిగిన తర్వాత ఇప్పుడు దుబాయ్‌లో జరగడం గమనార్హం.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ దాడిని ధృవీకరించారు. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. దుబాయ్ మీడియా ఆఫీస్ కూడా మంటలను అదుపు చేసినట్లు ఎక్స్ ద్వారా వెల్లడించింది.

క్షిపణుల కొరతపై పెంటగాన్ హెచ్చరిక..

పెంటగాన్ (యూఎస్​ డిఫెన్స్​) నుంచి వచ్చిన లీకుల ప్రకారం.. అమెరికా మరో 10 రోజుల పాటు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తే, కీలకమైన క్షిపణుల నిల్వలు అట్టడుగుకు చేరుకోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్‌సెప్టర్ మిస్సైల్స్ కొరత ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, ఉక్రెయిన్ వంటి దేశాలకు భారీగా సైనిక సాయం అందించడం వల్ల అమెరికా ఆయుధ నిల్వలు ఇప్పటికే క్షీణించాయి. గత ఏడాది ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికా తన వద్ద ఉన్న 'THAAD' ఇంటర్‌సెప్టర్లలో 25 శాతాన్ని (150 క్షిపణులు) వాడేసింది.

కాగా యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే, ఇరాన్ ప్రతీకార దాడులను అడ్డుకోవడానికి సరిపడా క్షిపణులు లేకపోవడం అమెరికాకు పెద్ద సవాలుగా మారనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More