...
...
Next Story

Kia Carens CNG : కియా కారెన్స్, కియా కారెన్స్ క్లావిస్​లో సీఎన్జీ వేరియంట్లు లాంచ్- ధర ఎంతంటే..

ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా తన మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) విభాగంలో కారెన్స్, కారెన్స్ క్లావిస్ మోడళ్లలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.12.12 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ 7-సీటర్ కార్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Sep 19, 2026, 10:45:36 IST
Advertisement

కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే వారికి కియా ఇండియా శుభవార్త అందించింది. తన పాపులర్ ఎంపీవీ మోడళ్లయిన కారెన్స్, కారెన్స్ క్లావిస్ కార్లలో సరికొత్తగా సీఎన్జీ వర్షెన్లను అధికారికంగా ప్రవేశపెట్టింది. నిత్యం ప్రయాణాలు చేస్తూ తక్కువ నిర్వహణ ఖర్చు, ఎక్కువ ఆదా కోరుకునే వాహనదారులకు ఈ కొత్త మోడళ్లు చక్కటి ఎంపికగా నిలవనున్నాయి.

కియా కారెన్స్ ఎంపీవీ..
కియా కారెన్స్ ఎంపీవీ..

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, మైలేజ్ ఆధారిత ఇంధనాలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కియా తీసుకొచ్చిన ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ కార్లు అటు సిటీ డ్రైవింగ్‌కు, ఇటు సుదీర్ఘ ప్రయాణాలకు ఎంతగానో ఉపయోగపడతాయి.

మూడు ఆకర్షణీయ వేరియంట్లలో లభ్యం!

కియా కారెన్స్, కారెన్స్ క్లావిస్ కలిపి మొత్తం మూడు సీఎన్జీ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. వీటి ఎక్స్-షోరూమ్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

కారెన్స్ ప్రీమియం (ఓ) సీఎన్జీ: రూ. 12.12 లక్షలు

కారెన్స్ క్లావిస్ హెచ్​టీఈ సీఎన్జీ: రూ. 12.39 లక్షలు

కారెన్స్ క్లావిస్ హెచ్​టీఈ (ఓ) సీఎన్జీ: రూ. 13.35 లక్షలు

శక్తివంతమైన ఇంజిన్.. డ్యూయల్ ఫ్యూయల్ సౌకర్యం

ఈ రెండు కార్లలోనూ 1.5 లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ జీ1.5 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. సీఎన్జీ మోడ్‌లో నడిచేటప్పుడు ఈ ఇంజిన్ 95 బీహెచ్‌పీ పవర్​ని, 123 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో డ్యూయల్ ఫ్యూయల్ వ్యవస్థ ఉండటం వల్ల డ్రైవర్ తన అవసరానికి అనుగుణంగా కేవలం ఒక స్విచ్ నొక్కి పెట్రోల్ నుంచి సీఎన్జీకి లేదా సీఎన్జీ నుంచి పెట్రోల్‌కు సులభంగా మారవచ్చు.

60 లీటర్ల ట్యాంక్.. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ భద్రత

అంతేకాకుండా, సీఎన్జీ ట్యాంక్ బరువును తట్టుకునేలా సస్పెన్షన్ వ్యవస్థలో ప్రత్యేక మార్పులు చేశారు. మెరుగైన బ్రేకింగ్ కోసం ముందు భాగంలో పెద్దవైన 16-అంగుళాల డిస్క్ బ్రేకులు, ఆర్16 సైజ్ వీల్స్​ని అందించారు. స్టీరింగ్ వద్ద ప్రత్యేక సీఎన్‌జీ స్విచ్‌తో పాటు, డాష్‌బోర్డ్ మీదున్న 4.2 అంగుళాల డిజిటల్ స్కీన్‌పై ట్యాంక్‌లో ఉన్న సీఎన్జీతో ఇంకా ఎంత దూరం ప్రయాణించవచ్చో స్పష్టంగా కనిపిస్తుంది.

మూడో వరుస సీట్లలో కొత్త కంఫర్ట్!

వెనుక వరుసలో కూర్చునే ప్రయాణికుల సౌకర్యం కోసం కియా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కియా కారెన్స్ సీఎన్జీ, కారెన్స్ క్లావిస్ సీఎన్జీ మూడో వరుస సీట్ల ఫ్రేమ్‌ను రీడిజైన్ చేయడం ద్వారా, ప్రయాణికులు సీటును మరింత వెనక్కి వాల్చుకుని ప్రశాంతంగా కూర్చునే వీలు కలిగింది. విస్తృతమైన స్థలం, ప్రయాణ అనుకూలత కలిగిన ఈ 7-సీటర్లు కుటుంబ సమేతంగా ప్రయాణించే వారికి పూర్తి స్థాయి సంతృప్తిని అందిస్తాయి.

"భారతదేశం విభిన్నమైన కొనుగోలుదారుల సమాహారం. ఇక్కడ ప్రతీ కస్టమర్ అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. వారి జీవనశైలికి తగినట్లుగా సరైన ఇంజిన్ ఆప్షన్‌ను అందించడమే మా వ్యూహం. పొదుపైన ప్రయాణాన్ని కోరుకునే వారికి సీఎన్జీ ఎప్పుడూ ఉత్తమ ప్రతిపాదనగా ఉంటోంది. కారెన్స్, కారెన్స్ క్లావిస్‌లలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీని ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని మరింత పెంచుతున్నాము," అని కియా ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ పేర్కొన్నారు.

మరి మీరు ఈ కియా కారెన్స్ సీఎన్జీ, కియా కారెన్స్ క్లావిస్ సీఎన్జీ మోడల్స్​ని కొంటున్నారా?

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks