...
...
Next Story

నిరుద్యోగ సమయంలో ఆర్థిక ప్రణాళిక- మీ పర్సనల్​ లోన్​ ఈఎంఐ భారాన్ని ఇలా తగ్గించుకోండి..

అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం మానసిక ఒత్తిడిని కలిగించడమే కాకుండా ఆర్థికంగానే కూడా ఇబ్బంది పెడుతుంది. అయితే, పర్సనల్ లోన్ ఈఎంఐలు భారంగా మారినప్పుడు టెన్షన్​ పడకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు.

Published on: Jan 10, 2026, 09:48:42 IST
Advertisement

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో చెప్పడం చాలా కష్టంగా మారింది. దాదాపు ప్రతి రంగంలోని ఉద్యోగులకు ఈ భయం ఉంటూనే ఉంటుంది. ఉద్యోగం కోల్పోవడం అనేది కేవలం మనశ్శాంతినే కాకుండా ఇంటి ఆర్థిక పరిస్థితిని కూడా తలకిందులు చేస్తుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రతి నెలా కట్టాల్సిన పర్సనల్ లోన్ ఈఎంఐలు భారంగా మారి, నిద్రలేని రాత్రులను మిగులుస్తాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో భయపడటం కంటే చాకచక్యంగా వ్యవహరించడం ముఖ్యం. బకాయిలు చెల్లించే విషయంలో స్పష్టమైన ప్రణాళిక ఉంటే మీ ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవచ్చు.

భారత్ లోన్ వ్యవస్థాపకుడు అమిత్ బన్సల్ ఈ పరిస్థితిని విశ్లేషిస్తూ.. "ఉద్యోగం పోయిన వెంటనే రుణగ్రహీతలు తమ వద్ద ఉన్న పొదుపు మొత్తం, సెవరెన్స్ పే (ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు వచ్చే పరిహారం), అత్యవసర ఖర్చులను ఒకసారి సమీక్షించుకోవాలి. దీనివల్ల లోన్ ఈఎంఐలు ఎన్ని నెలల వరకు కట్టగలమో ఒక అంచనా వస్తుంది. ఆలస్యం చేయకుండా బ్యాంకు అధికారులను సంప్రదించడం చాలా ముఖ్యం. తాత్కాలిక మారటోరియం, లోన్ గడువు పెంపు లేదా రీపేమెంట్ షెడ్యూల్ మార్పు వంటి ఆప్షన్లను బ్యాంకులు అందించే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా చూసుకోవచ్చు," అని వివరించారు.

ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టండి ఇలా..

మొదట మీ వద్ద ఉన్న నగదు నిల్వలను లెక్కించండి:

పొదుపు నిల్వలు: మీ దగ్గర ఉన్న సేవింగ్స్, ఎమర్జెన్సీ ఫండ్స్ ఎన్ని నెలల ఈఎంఐలకు సరిపోతాయో లెక్కలేసుకోండి.

ఖర్చులకు కత్తెర: విలాసవంతమైన ఖర్చులను పూర్తిగా పక్కన పెట్టండి. కేవలం అద్దె, కరెంట్ బిల్లులు, ఈఎంఐల వంటి అత్యవసర ఖర్చులకే ప్రాధాన్యత ఇవ్వండి.

చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయినప్పుడు, బ్యాంకర్లకు భయపడి ఈ విషయాన్ని దాస్తుంటారు. కానీ ముందే చెబితేనే పరిష్కారం దొరుకుతుంది!

ముందే సంప్రదించండి: ఈఎంఐ గడువు ముగియక ముందే మీ ఆర్థిక ఇబ్బందిని బ్యాంకుకు వివరించండి. ఇలా చేయడం వల్ల వారు మీపై నమ్మకంతో రీపేమెంట్ పద్ధతిని మార్చే అవకాశం ఉంటుంది.

వెసులుబాటు కోరండి: కొన్ని నెలల పాటు ఈఎంఐ చెల్లింపుల నుంచి విరామం లేదా కేవలం వడ్డీ మాత్రమే కట్టేలా చూడమని కోరండి. అవసరమైతే లోన్ గడువును పెంచమని అడగండి. దీనివల్ల నెలవారీ కట్టాల్సిన మొత్తం తగ్గుతుంది.

పెనాల్టీల నుంచి రక్షణ: బ్యాంకుతో సంప్రదింపులు జరపడం వల్ల పెనాల్టీలు పడకుండా, మీ క్రెడిట్ ప్రొఫైల్ దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

ఆదాయం పెంచుకుంటూ.. అప్పును తగ్గించుకోండి..

ఉద్యోగ వేటలో ఉంటూనే ఇతర మార్గాలను అన్వేషించండి:

చిన్నపాటి ఆదాయం: ఫ్రీలాన్సింగ్, పార్ట్-టైమ్ జాబ్స్ లేదా షార్ట్-టర్మ్ పనుల ద్వారా ఈఎంఐలకు సరిపడా డబ్బు సంపాదించే ప్రయత్నం చేయండి.

లోన్ ట్రాన్స్‌ఫర్: ఒకవేళ వేరే బ్యాంకు తక్కువ వడ్డీకే లోన్ ఇస్తుంటే, 'బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్' ఆప్షన్‌ను పరిశీలించండి. అయితే ఇందులోని ప్రాసెసింగ్ ఫీజులను కూడా లెక్కలోకి తీసుకోవాలని మర్చిపోకండి.

పాక్షిక చెల్లింపు: చేతిలో డబ్బు ఉన్నప్పుడు చిన్న మొత్తంలో అదనపు చెల్లింపులు చేస్తే భవిష్యత్తులో వడ్డీ భారం తగ్గుతుంది.

పర్సనల్ లోన్​లో ఉండే ప్రమాదాలు గుర్తుంచుకోండి..

పర్సనల్ లోన్స్​ అనేవి పూచీకత్తు లేని అప్పులు. కాబట్టి ఇందులో రిస్క్ ఎక్కువే:

అధిక వడ్డీ: వీటిపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. గడువు పెరిగే కొద్దీ మీరు కట్టే వడ్డీ భారం కూడా పెరుగుతుంది.

చర్యలు: ఈఎంఐలు సకాలంలో కట్టకపోతే భారీ జరిమానాలు పడటమే కాకుండా, రికవరీ చర్యలు కూడా కఠినంగా ఉంటాయి.

చట్టపరమైన ఇబ్బందులు: తీవ్రమైన కేసుల్లో చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

చివరిగా లోన్ రీస్ట్రక్చరింగ్ వల్ల గడువు పెరుగుతుంది. కానీ మొత్తం మీద మీరు కట్టే వడ్డీ సైతం పెరుగుతుందని గుర్తుంచుకోండి. అందుకే ఉద్యోగం పోయిన వెంటనే అప్రమత్తమై, బ్యాంకుతో స్పష్టంగా మాట్లాడి, కొత్త బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పర్సనల్​ లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోండి.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks